మూడు బండ్లు పదహారు దోశలు


Wed,June 13, 2018 10:41 PM

ఒక్కోసారి ఫైవ్‌స్టార్ హోటల్‌లో టిఫిన్ చేసినా రాని రుచి చిన్న బండిమీద తిన్నప్పుడు మనకు దొరుకుతుంది. ఎందుకంటే, ఆ రుచి రావడానికి బండివారు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. వినియోగదారుల మనసు దోచుకోవడానికి వారు చేసే ప్రయత్నాలే ఎక్కడెక్కడి వారినో వారి వద్దకు రప్పించుకుని వారి టిఫిన్లకు ఫిదా చేస్తాయి. అందుకే, ఆ టిఫిన్ బండ్లు ఎప్పుడూ అనేక మందితో కిటకిటలాడుతుంటాయి. తినేవారికి కూడా ఆ రోజు కడుపునిండా తిన్నామన్న తృప్తిని మిగుల్చుతాయి. ఒక్కసారి రుచి చూస్తే చాలు మళ్లీ మళ్లీ తినాలనిపించే ఈ బండ్ల అల్పాహారాన్ని మనమూ రుచి చూడాలంటే హైదరాబాద్ వీధుల్లో విహరించాల్సిందే.
dosa

గోవింద్ దోశ

రోజూ ఇంట్లో టిఫిన్ చేసి బోరు కొట్టిందా? నో ప్రాబ్లం రోజు కంటే కొంచెం ముందు లేచి చార్మినార్ వైపు రండి. ఇక్కడి గోవింద్ దోశ బండి మీద దోశని ఒక్కసారి రుచి చూశారంటే మరునాడు మీ ప్రమేయం లేకుండానే అడుగులు అటువైపే పడుతాయి. ఇక్కడ దోశ పరిమళం రోజూ మనల్ని రా రమ్మని పిలుస్తుంటుంది.

గోవింద్ బండికోసం చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నామంటే గోవింద్ పేరు తెలియని వారుండరు. ఈ బండికోసం ఉప్పల్, మియాపూర్ లాంటి దూరప్రాంతాల నుండి ట్రాఫిక్ దాటుకుని మరీ వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కారం పొడి గురించి. కొన్ని ప్రత్యేకమైన వాటితో దీనిని రంగరిస్తారు. ఆ ఫార్ములా చాలా సీక్రెట్, ఎందుకంటే అదేకదా వారి సక్సెస్ సీక్రెట్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఐన బటర్ దోశ కూడా గోవింద్ సృష్టించిందే.

గోవింద్ దోశ అంటే దోశలకు మాత్రమే ఫేమస్ కాదు. ఇడ్లీలో పది వెరైటీలు, దోశలో 16 వెరైటీలు, మైసూర్ బజ్జీలో 6 వెరైటీలు, ఉప్మాలో పది వెరైటీలు, వడలో ఎనిమిది వెరైటీలు.. అందుకే ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్ తినేవారికి ఇక్కడి మెనూ మరింత పసందుగా కనిపిస్తుంటుంది. ఆ రుచిని అందుకోవడం కోసం ఫైవ్ స్టార్ హోటల్‌లో తినేవారు సైతం బెంజ్ కార్‌లో చార్మినార్ ప్రాంతంలోని గోవింద్ బండి దగ్గరికి వస్తుంటారు.

ప్రస్తుతం హిమాయత్‌నగర్‌లో గోవింద్ దోశ ఓ బిల్డింగ్‌లో స్టార్ట్ చేశారు కాని దాదాపు 33 సంవత్సరాల నుండి కూడా చార్మినార్ ప్రాంతంలో ఓ బండి మీద టిఫిన్స్ అమ్ముతున్నారు. బటర్ దోశ, చీజ్ దోశ, స్పాట్ ఉప్మా, ఇడ్లీ ఫ్రై, పిజ్జా దోశ ఇక్కడ ఫేమస్. హైదరాబాద్‌లో గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం లాంటి వాటిని చూడకపోతే ఎంత మిస్ అవుతామో ఫుడ్ విషయంలో గోవింద్ టిఫిన్స్ టేస్ట్ చేయకపోవడమూ అంతే అని ఫుడ్ లవర్స్ చెప్పుకుంటుంటారు.
Govind-Bandi

నాని టిఫిన్స్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ కార్నర్ రాణిగంజ్ ప్రాంతంలో ఉన్న ఈ నాని టిఫిన్స్ కు దశబ్దాల చరిత్ర ఏమీ లేదు. కానీ ఇక్కడి ఫుడ్ టేస్ట్ వల్లనే అంతకు ముందున్న టిఫిన్ సెంటర్ల దగ్గర ఆగకుండా ఇక్కడికి వచ్చేస్తుంటారు.

మనోళ్ళకు కావాల్సింది ఫుడ్ టేస్టీగా, శుభ్రంగా ఉండడం. అంతేకాని ఏసి, ఇటాలియన్ ఫర్నీచర్ అనేవి సెకండరీ. నాని టిఫిన్ సెంటర్ ఉండేది రోడ్డు పక్కన ఆరుబయట. జనరల్ గా రెస్టారెంట్స్‌తో పోల్చుకుంటే టిఫిన్ సెంటర్స్ ఎంత చిన్నగా, ఇరుకుగా ఉంటాయో మనకు తెలుసు. పేరుకు నాని టిఫిన్స్ చిన్నగా అనిపించినా ఇక్కడ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేస్తూ, కబుర్లు చెప్పుకుంటు రిఫ్రెష్ అవ్వడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ 6 నుండి నైట్ 12 మధ్యలో ఎప్పుడు వెళ్ళినా కాని ఇక్కడ మనం కోరుకునే మన ఊహకందని రుచితో టిఫిన్స్ లాగించేయొచ్చు.

ప్రేమకు భాష లేదు ఒక నిర్దిష్టమైన పద్ధతులూ లేవు. ఏవిధంగానైనా ప్రేమను తెలియజేయవచ్చు. ఇది ఫుడ్‌కు కూడా వర్తిస్తుంది. ఇడ్లీని ఒకే రకంగా డబ్బాలో వేసి ఉడుకబెడితే బోర్!! అదే పెనం మీద వేయించి స్పాట్‌లో చేస్తేనే కదా కొత్త రుచి.. అలా స్పాట్ ఇడ్లీ దగ్గరి నుండి సాంబర్ ఇడ్లీ, తవా ఇడ్లీ.. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవల్సింది దోశల గురించి. పిజ్జా దోశ, పనీర్ దోశ, చీజ్ దోశ, క్రీమ్ దోశ, ఆల్ మిక్స్ దోశ, బటర్ దోశ ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అన్నమాట. పర్స్ లో డబ్బు, కడుపులో ఇంకాస్త ఖాళీ ఉంటే ఇక్కడున్నవన్నీ ఓ పట్టు పట్టేయ్యాలనిపిస్తుంది. కొత్త రుచిని ఆస్వాదించాలనుకునేవారు తప్పకుండా ఒక్కసారైనా నాని టిఫిన్స్‌ను సందర్శించాల్సిందే.
Nani-dosa

రామ్‌కీ బండి

హైదరాబాద్ వాసులకు సుపరిచితమైన పేరు రామ్‌కి బండి. ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చేవారికి కూడా రామ్‌కి బండితో అనుబంధం ఉంది.

ప్రత్యేకమైన దోశలతో రామ్‌కి బండి తన ప్రాభవాన్ని చాటుకుంటున్నది. రకరకాల దోశలు తయారు చేయడంలో రామ్ ది పెట్టింది పేరు. అందుకే ఉదయం లేచిన వెంటనే భోజన ప్రియులు రామ్ బండి ముందే క్యూ కడతారు. వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు కూడా రామ్ బండి వారి టిఫిన్ చేయకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. రామ్ గడచిన పదిసంవత్సరాలుగా నాంపల్లిలో రామ్స్‌దోశ బండిని నిర్వహిస్తున్నాడు. చీజ్ దోశ, బటర్ దోశ, స్పాట్ ఉప్మా, ఇడ్లీ ఫ్రై, పిజ్జా దోశ ఇలా అనేక రకాల దోశలు తయారు చేయడంలో రామ్‌కు అనుభవం ఉంది. ఆయన దగ్గర ఒకసారి దోశ తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచి అక్కడి ప్రత్యేకత. అందుకే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రామ్ బండి భోజన ప్రియులతో కిటకిటలాడుతుంటుంది. నగరంలో అర్ధరాత్రి వరకు టిఫిన్ సెంటర్‌ను నిర్వహించిన తొలి బండిగా రామ్‌కు పేరుంది. ఇప్పుడు చాలామంది ఆయననే అనుసరిస్తున్నారు. రాము ఎంబీఎ చదివిన ఉన్నత విద్యావంతుడు కావడం విశేషం.

నగరంలో రకరకాల దోశలను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా రామ్‌కు పేరుంది. మేక్‌డోనాల్డ్స్, కెఎఫ్‌సీ వంటి బ్రాండ్లతో సమానంగా రామ్‌కి బండికి గుర్తింపు రావాలన్నది ఆయన ఆకాంక్ష. నాంపల్లిలో నాలుగు చక్రాల బండి మీద టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించిన రామ్ నేడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పూర్తిస్థాయి రెస్టారెంట్‌ను రామ్స్ దోశ హౌజ్ పేరుతో ప్రారంభించాడు. అయినప్పటికీ నాంపల్లిలో తన బండిని ఇంకా కొనసాగిస్తుండడం విశేషం.
Ramki-dosa

2864
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles