ముర్గికీ ఇఫ్తార్


Thu,July 24, 2014 12:30 AM

కొక్కొరొకో.. అంటూ కూత పెట్టే కోడిని.. ఇఫ్తార్ విందులో పసందుగా.. వండి వడ్డించేస్తే.. లొట్టేలేస్తూ తినాల్సిందే! పచ్చని హరియాలీ.. టేస్టీ బాదామి.. చిక్కటి కుర్మా.. ఎంచక్కని కబాబ్స్‌తో.. ఈవినింగ్స్ కడుపు నిండిపోతుంది.. రంజాన్ స్పెషల్ వంటకాలతో.. ఈ మెనూ సిద్ధంగా ఉంది.. ఆరగించడానికి మీరు రెడీయా?!

kabab

చికెన్ కబాబ్

కావలసిన పదార్థాలు :
చికెన్ - కేజీ, ఉల్లిపాయ - 1, నిమ్మరసం - 4 టేబుల్ స్పూన్స్, ఆవాలపేస్ట్ - ఒక టీ స్పూన్, మిరియాలపొడి - ఒక టీ స్పూన్, జీలకర్రపొడి - ఒక టీ స్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు, ఆలివ్ ఆయిల్ - 4 టేబుల్ స్పూన్స్, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఈలోపు నీటిలో కుంకుమపువ్వును నానేసి ఆ తర్వాత ప్రై చేసి పక్కనపెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ ముక్కలు వేసి జీలకర్రపొడి, మిరియాలపొడి, ఆవాలపేస్ట్, ఉల్లిపాయ మిశ్రమం, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత స్వీవర్స్‌కి గుచ్చి గ్రిల్‌లో పెట్టి చికెన్ ఉడికే వరకు బేక్ చేయాలి.

badami

ముర్గ్ బాదామి

కావలసిన పదార్థాలు :
చికెన్ - 750గ్రా., కారం - ఒక టీ స్పూన్, నిమ్మరసం - 1 1/2 టేబుల్ స్పూన్స్, పెరుగు - 2 కప్పులు, గరంమసాలా - ఒక టీ స్పూన్, లవంగాలు - 5, యాలకులు - 5, దాల్చిన చెక్క - చిన్నముక్క, బిర్యానీ ఆకులు - 2, నెయ్యి - 3 టేబుల్ స్పూన్స్, బాదం - 50 గ్రా., ఉల్లిగడ్డలు - 2, పచ్చి మిరపకాయలు -3, వెల్లుల్లిపాయలు - 4 రెబ్బలు, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - సగం కట్ట, కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
చికెన్‌ని బాగా కడిగి అందులో కారం, గరంమసాలా, పెరుగు, నిమ్మరసం, ఉప్పు కలిపి ఉంచాలి. దీన్ని గంటపాటు అలాగే ఉంచాలి. బాదంను నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను చిన్నముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టి లవంగాలు, దాల్చినచెక్క, యాలకులను వేయించాలి. దీంట్లో నెయ్యి వేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అల్లం, వెల్లుల్లి కూడా వేసి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇందులో మారినేట్ చేసిన చికెన్‌ని వేసి మూతపెట్టేయాలి. సన్నని మంటమీద పావుగంట పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత బాదం పేస్ట్ వేసి కలిపి అవసరమైతే ఒక కప్పు నీళ్లు పోయాలి. మరో ఐదునిమిషాలు అలాగే ఉడకనిచ్చి కొబ్బరిపాలు కూడా పోసేసి మూతపెట్టేయాలి. రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర, బాదంలతో గార్నిష్ చేసి దించేయాలి. టేస్టీ ముర్గ్ బాదామి రెడీ!

korma

చికెన్ కుర్మా

కావలసిన పదార్థాలు :
చికెన్ - అరకేజీ, పెరుగు - పావు కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్, షాజీరా - ఒక టీ స్పూన్, పసుపు - పావు టీ స్పూన్, కారం - ఒక టీ స్పూన్, ఉల్లిగడ్డలు - 2, పచ్చిమిరపకాయలు - 2, టమాటాలు - 2, జీలకర్రపొడి - అర టీ స్పూన్, గరంమసాలా పౌడర్ - ఒక టీ స్పూన్, ధనియాలపొడి - అర టీ స్పూన్, మిరియాలపొడి - అర టీ స్పూన్, కొబ్బరి తురుము - పావు కప్పు, జీడిపప్పులు - 4, నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర - ఒక కట్ట, పుదీనా - అరకట్ట, నూనె, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
చికెన్‌ని శుభ్రంగా కడిగి అందులో పెరుగు, షాజీరా, పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఈ మారినేట్ చేసిన మిశ్రమాన్ని అరగంటపాటు పక్కనపెట్టాలి. కుక్కర్ పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి ఆ ఫ్లేవర్ తగ్గేవరకు కలుపుతుండాలి. ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచాలి. టమాటాలను వేయాలి. నూనె పైకి వచ్చేంతవరకు ఆగి అందులో జీలకర్రపొడి, ధనియాలపొడి, గరంమసాలా, మిరియాలపొడి వేసి కలపాలి. చిక్కగా అయ్యేంతవరకు సన్నని మంట మీద అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు మారినేట్ చేసుకున్న చికెన్‌ని వేసి ఒక కప్పు నీళ్లు పోయాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈలోపు కొబ్బరితురుము, జీడిపప్పులను పేస్ట్‌లా చేసుకోవాలి. మూతతీసి దీన్ని ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేసి రెండునిమిషాలు ఉండనివ్వాలి. దించేముందు కొత్తిమీర, పుదీనా వేయాలి. రోటీ, నాన్, చపాతీ, పూరీలకు ఈ కూర బాగుంటుంది.

hariyali

ముర్గ్ హరియాలీ

కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ, అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 2 టీ స్పూన్స్, ఉల్లిపాయలు - 100గ్రా., పచ్చిమిర్చి - 15, పుదీనా - 2 కట్టలు, కొత్తిమీర - 4 కట్టలు, జీడిపప్పు పేస్ట్ - 3 టేబుల్ స్పూన్స్, గసగసాలు - 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు - 4రెమ్మలు, పెరుగు - ఒక కప్పు, గరంమసాలా - ఒక టీ స్పూన్, మెంతికూర - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
చికెన్‌ని శుభ్రంగా కడగాలి. గసగసాలను మెత్తగా నూరాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకులను కడిగి నూనెలేకుండా వేయించాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలతో కలపాలి. దీంతోపాటు పెరుగు, ఉప్పు, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి. ఒక అరగంటపాటు పక్కనపెట్టాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోయాలి. ఉల్లిపాయముక్కలను రంగు మారేవరకు వేయించాలి. దీంట్లో కలిపి ఉంచుకున్న చికెన్‌ని వేయాలి. సన్నని మంట మీద పావుగంటసేపు ఉడికించాలి. ఇందులో గసగసాల పేస్ట్, బాదంపేస్ట్, గరంమసాలా వేసి కలపాలి. ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. చివరగా మెంతికూర చల్లుకొని దించేయాలి. వేడి..వేడి.. ముర్గ్ హరియాలీ మీ నోరూరించకమానదు!

3882
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles