మీ గురించి మీ సొమ్ము ఏం చెబుతున్నది?


Fri,December 14, 2018 11:06 PM

money
డబ్బు..డబ్బు నువ్వు ఏమి చేస్తావంటే..నేను అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తాను. భార్య-భర్తల మధ్య చిచ్చు పెడుతాను అని అంటున్నది. ఇది ఒక సినిమా డైలాగ్. కానీ ప్రస్తుతం మానవుడి జీవితం డబ్బు చుట్టే తిరుగుతున్నది. ఉదయం లేచినప్పటీ నుంచి రాత్రి పడుకునే వరకు ఏ వస్తువు కావాలన్న..ఏదైనా కొనాలన్న డబ్బే బ్రహ్మపదార్థం. దైనందిక జీవితంలో డబ్బే ప్రధానంగా మారిపోయింది. డబ్బు ఉంటే బంధువులు, స్నేహితులు అందరు దగ్గరకు వస్తారు..ఒకవేళ నీ దగ్గర ఇదే లేకపోతే కనీసం నీ కుటుంబ సభ్యులు కూడా పలుకరించరు. అదే డబ్బు మీ గురించి ఏమి చెబుతున్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. బ్యాంకులో ఉన్న డబ్బు వివరాలు తెలియాలంటే ఒక్క స్టేట్‌మెంట్ తీసుకుంటే సరిపోతుంది..కానీ అలాంటి దాంతో ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచనలు ఎంటివో ఇప్పుడు కులంకశకంగా చర్చిద్దాం..


అత్యవసర సమయంలో సిద్ధంగా ఉన్నారా..?

అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.. ఆసుపత్రిలో చికిత్స చేయాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంది..మరోవైపు జీవితం స్థిరపడుతున్న తరుణంలో ఉద్యోగం ఊడింది.. పైనుంచి ఏదో పడి ఇంటి పైకప్పుకు రంద్రం పడింది..వరదల తాకిడితో కారు పూర్తిగా పాడైంది..ఆరోగ్య బీమా పరిధిలోకి రాని వ్యాధికోసం చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది..మీ స్నేహితుడు భారీ కష్టాలతో ఉన్నాడు, ఆయనకు అత్యవసరంగా రుణం కావాలి..ఇలాంటి సంక్షోభ సమయాన్ని తట్టుకునే శక్తి కేవలం డబ్బు కలిగిన మానవుడికే సాధ్యం. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనడానికి ముందుగానే సిద్ధం కావాలి మరి. వీటన్నింటిని నుంచి బయటపడే ఒకేఒక మార్గం బీమా. జీవితాన్ని, ఆరోగ్యాన్ని, వాహనాలను, ఇంటిని కాపాడుకునేది దీనిద్వారానే. ఆర్థిక అత్యవసర పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఆయుధంగా ఉన్న బీమా పరిధిలోకి రాని పలు రోగాలు లేదా ఉద్యోగం పోవడం లాంటితో చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంటే ఏ క్షణాన ఏమవుతుందో ఎవరికి తెలియదు..అకస్మాత్తుగా ప్రమాదం జరిగిందనుకో దీనికోసం భారీగా డబ్బులు వెచ్చించాల్సి రావచ్చును. ఇందుకోసం ముందుచూపుగా మూడు నుంచి ఆరు నెలల పాటు తమ సంపాదనను బ్యాంకులోగాని, ఏ ఇతర సంస్థల్లో దాచుకోవాలి. ముఖ్యంగా బ్యాంకుల్లో డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఇది కేవలం అపాయంలో ఉన్నప్పుడు ఆదుకునే డబ్బు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. ఇతర పొదుపు, పెట్టుబడులు లేదా క్యాపిటల్ ఖర్చులతో గందరగోళం సృష్టించుకోవద్దు. ఇలా చేసిన పొదుపు సొమ్మును ఇబ్బందికర పరిస్థితుల్లోనే వాడుకోవాలి సుమా.


మీ కుటుంబం కోసం ఏమి చేస్తున్నారు..?

ఆర్థికంగా స్థిరపడటానికి తీసుకుంటున్న చర్యల వల్ల మీ కుటుంబ సభ్యులకు అనుకోకుండా జరిగే విపత్కర పరిస్థితులనుంచి తట్టుకునే శక్తి లభిస్తున్నది. వారికి ఆర్థిక సంక్షోభం తలెత్తిందా? లేదా వివిధ రూపాల్లో నష్టపోయారా? ఇలాంటి ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం మరవద్దు. ఒకవేళ మరణిస్తే సమ్ అస్యూర్డ్ కింద వచ్చే సొమ్ముతో ఎలాంటి ఢోకా ఉండదు. ఉదాహరణకు 30 ఏండ్ల వయస్సు కలిగిన పొగత్రాగని వేతనం పొందుతున్న ఒక్కరికి సమ్ అస్యూర్డ్ కింద రూ.50 లక్షలు లభించేవారికి వార్షిక ప్రీమియం రూ.4,200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సమ్ అస్యూర్డ్ కింద కోటి రూపాయలు పొందేవారు రూ.7,200 చెల్లిస్తే సరిపోతున్నది. వారి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా జీవిత బీమాను ఎంపిక చేసుకునే అవకాశం పాలసీదారుడికి ఉంటుంది.


మీ జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారు..?

జీవితంలో పెట్టుకున్న లక్ష్యాలు మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అవి మన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటాయి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే డబ్బు కూడా కీలకమే మరి. సహజంగా పెట్టుకున్న లక్ష్యాలతో తమ జీవితం మరింత వృద్ధిలోకి రావడానికి డబ్బుకోసం పెట్టుకున్న నిర్వహణ నైపుణ్యాలు కూడా దోహదపడుతాయి. ఉదాహరణకు మీరు విదేశాల్లో రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన పీజీ చేయాలనుకుంటున్నారనుకో..ఇందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికను ముందుగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలో అడుగుపెట్టే సమయంలో మీ చేతిలో డబ్బు ఉండాలి..లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.


రుణం తీసుకుంటున్నారా..?

మీరు రుణం తీసుకునే ఆలోచనలో ఉన్నారా? మీ జీవనశైలిలో, వినిమయంలో ఎంతమేర తీసుకున్నారు? ఒకవేళ మీరు ఆస్తులు లేదా ఇండ్లను కొనుగోలు చేయడానికి రుణం తీసుకున్నారా? ఎంతమేర తీసుకున్నారు..దీనిని తిరిగి ఎలా చెల్లింపులు జరుపుతున్నారో బేరీజు వేసుకుంటున్నారా? ఇలాంటి వారికోసం నాదో సలహా. మీరు సంపాదిస్తున్న వాటిలో 30-40 శాతం వరకు రుణాలను చెల్లించడానికి వెచ్చించాలి. మీ ప్రాధాన్యతలను కఠినంగా నిర్దేశించుకున్న తర్వాతనే రుణం తీసుకోవడానికి ముందుకు రావాలి..లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. తిరిగి రుణాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు మాత్రమే రుణాలు చెయ్యాలి.


మీకంటూ బడ్జెట్ ఉందా..?

దేనికైన ఒక ప్రణాళిక ఉండాలి. జీవితగమనంలో రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చుల నిమిత్తం ఒక బడ్జెట్‌ను కేటాయించుకోండి. ఇలాంటి ప్రణాళికలతో చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి ఉపయోగంగా ఉంటుంది. పదవీ విరమణ చేసిన తర్వాత లేదా ఇంటిని కొనుగోలు చేయడానికి ఇప్పటి నుంచే కొంతమేర డబ్బును పొదుపు చేసుకోవడం మరిచిపోకండి. ముందుగా పొదుపు చేయండి..ఆ తర్వాత ఖర్చు చేయండి అనే సిద్ధాంతాన్ని పాటించండి.


- అదిల్ శెట్టి, బ్యాంక్‌బజార్.కామ్ సీఈవో

640
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles