మావోల కోటనుంచి.. మొదటి మెడికల్ సీటు


Tue,August 28, 2018 11:10 PM

అదంతా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం. అన్నల అడుగుజాడల్లోనే ఆ గ్రామాలు నడవాలి. అక్కడి పిల్లలకు పాఠాలు చెప్పేందుకు రావాలంటే ఉపాధ్యాయులు భయపడుతుంటారు. పైగా పేదరికం. తండ్రి చనిపోవడంతో మరింత దీనావస్థకు చేరుకున్నారు. అయినా, ఇవన్నీ మాయాను ఓడించలేకపోయాయి. ధైర్యం, పట్టుదలతో చదివి మెడికల్ సీటు సంపాదించింది.
Maya-Kashyap
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా ఏరియా.. ఇది మావోయిస్టుల కంచుకోట. ఇక్కడ నక్సల్స్‌కు కేంద్రబిందువైన ద్రోణపాల్ ప్రాంతమంటే ఎవ్వరికైనా భయమే. ఇక్కడి గ్రామాల్లోని పిల్లలకు చదువు చెప్పేందుకు టీచర్లు కూడా భయపడుతుంటారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పాఠాలు చెబుతారు. అలాంటి ప్రాంతం నుంచి మాయా కశ్యప్ అనే 19యేండ్ల యువతి మొదటిసారిగా మెడికల్ సీటు సంపాదించింది. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో మాయా ఓవరాల్‌గా 12,315వ ర్యాంకు, రాష్ట్రవ్యాప్తంగా 154వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెకు అంబికాపూర్ మెడికల్ కాలేజ్‌లో సీటు వచ్చింది.


షెడ్యూల్డ్ కులానికి చెందిన మాయా ఈ స్థాయి వరకూ వచ్చేందుకు ఎన్నో కష్టాలను అధిగమించింది. చిన్నప్పుడు చదువుకునేందుకు పాఠశాలలు లేకపోవడంతో వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకున్నది. ఈ క్రమంలో తండ్రి చనిపోవడంతో ఆమె సోదరుడు, తల్లి కలిసి మాయా చదువుకయ్యే ఖర్చును భరించేవారు. పేదరికంతో మాయా పరీక్షల ఫీజులకు, పుస్తకాలకు డబ్బులు లేకపోతే బంధువులు, స్నేహితుల దగ్గర అడిగి ఫీజులు చెల్లించేవారు. వారి కష్టాలను అర్థం చేసుకున్న మాయ.. చదువుల్లో చాలా చురుగ్గా రాణించేది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎంతో కష్టతరమైందిగా భావించే నీట్ పరీక్షలకు ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సిద్ధపడి మంచి ర్యాంక్ సాధించింది. ఇలా, ఎన్ని కష్టాలు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. త్వరలోనే డాక్టర్ కూడా అవ్వబోతున్నది.

371
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles