మహిళా మాణిక్యాలు


Thu,June 2, 2016 12:23 AM

formationday
ఒకనాడు తెలంగాణకు అవార్డుల్లేవ్.. రివార్డుల్లేవ్. ప్రతిభ ఉన్నా గుర్తించే.. గౌరవించే పాలకుల్లేక ఆణిముత్యాలు.. మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి రాలేదు. ఇవాళ.. ప్రతిభ ఉన్న అందరికీ గుర్తింపు లభిసున్నది. ప్రతిభకు పట్టంగట్టి.. వాళ్లందరినీ ఒకచోటకు చేర్చి తెలంగాణ సర్కార్ రాష్ట్ర ఆవిర్భావ రోజున అవార్డులతో సత్కరిసున్నది. మూడో వసంతంలోకి మురిపెంగా అడుగెడుతున్న శుభసందర్భాన పలు రంగాల్లో రాణిస్తున్న 62 మంది నేడు ఘన సత్కారం అందు కుంటున్నారు. సాహిత్యం.. సంగీతం.. కళలు.. సేవారంగం.. జర్నలిజం వంటి రంగాల్లో ఉత్తమ సేవల్ని గుర్తించి ఈ అవార్డులు ఇచ్చారు. ఈ శుభ సందర్భంలో అవార్డులు అందుకుంటున్న మహిళల అంతరంగాల సమాహారం ఇది.

బాధ్యత పెంచింది..


సాహసరంగంలో (అడ్వేంచర్ యాక్టివిటి) రాష్ట్రప్రభుత్వం అవార్డు ఇస్తుందని ఉహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఎంతో కష్టమైనప్పటికీ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తనకు ఈ అవార్డు ఆనందాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో వృత్తి, ప్రవృత్తిలో ఈ అవార్డు మరింత బాధ్యత పెంచుతోంది.
radhika
మహిళలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్రీడల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాల ప్రోత్సాహం, సహకారం అందిస్తోంది. క్రీడల్లో నీకెందుకులే అన్నట్లు కాకుండా అటు ప్రభుత్వం, ఇటు పోలీసు ఉన్నతాధికారులు ప్రోత్సాహం ఇచ్చారు. డీజీపీ అనురాగ్ శర్మ, రాజీవ్ త్రివేది, సుదీప్ లక్డాకియా, తరుణ్‌జోషి లాంటి ఉన్నతాధికారులు తనను వెన్నుతట్టి ప్రోత్సహించారు. కూన్ పర్వతం ఎక్కేందుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు నైతిక మద్దతు కూడా అందించింది. తాను కూన్, ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సాహసరంగంలో రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేయడం ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
- జీఆర్ రాధిక, అదనపు ఎస్పీ, ఆదిలాబాద్

గత ప్రభుత్వాలు చేయలేదు..


MUDIGANTI-SUJATHA-REDDY
సాహిత్య రంగంలో నన్ను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఎనలేని ఆనందాన్నిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రచయితలను, కళాకారులను ఆదరిస్తుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనం. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు ఇలాంటి అవార్డులు ఇవ్వలేదు. బంగారు తెలంగాణలో నేను కూడా పాలుపంచుకోవడం సంతోషానిస్తున్నది. కళలకు, సాహిత్యానికి ఇవి మంచి రోజులుగా భావిస్తున్నాను. వీటి ఆదరణ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. బంగారు తెలంగాణ కోసం పాటు పడాలి.
- ముదిగంటి సుజాతా రెడ్డి, రచయిత్రి

సమష్టి కృషి ఫలితం..


balbeerkour
మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా బోధించి, విద్యార్థులను వారికిష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తున్నాం. మా సేవలను గుర్తించిన, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికచేయడం ఆనందంగా ఉంది. పాఠశాల సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ పురష్కారం దక్కింది. మంచి ఫలితాలు సాధించాలన్న తపనతో పాటు, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో సమష్టిగా కృషి చేశాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. ఈ పురస్కారం మాపై బాధ్యతను మరింత పెంచింది. భవిష్యత్‌లో మా సిబ్బంది సహకారంతో రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి శక్తి వంచనలేకుండా కృషి చేస్తా. ఒక మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న మా సేవలను గుర్తించి, పురస్కారానికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రికి, శాఖాపరంగా పేరును ప్రతిపాదించిన అధికారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సహకరించిన మా సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నా.
- గోల్డి బల్బీర్‌కౌర్ (ఉత్తమ ఉపాధ్యాయురాలు), కరీంనగర్ జిల్లా గంగాధర మాడల్ స్కూల్

రుణపడి ఉంటం..


padmavathi
సమైక్య రాష్ట్రంలో ఆదరణ కరువైన మాకు ఉద్యమ సమయంలో ఆదరించి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగావకాశం కల్పించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటా. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చే దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో మా గొంతును వినిపించి, ప్రజలను చైనత్యపరుస్తా. తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం నుంచి ఉద్యమ పాటలతో కదం తొక్కినం. నా ప్రస్థానాన్ని పరిగణనలోకి తీసుకొని ఉత్తమ ఉద్యమ గాయనిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం ఆనందంగా ఉంది.
- మామిండ్ల పద్మావతి, ఉత్తమ ఉద్యమ గాయని, కరీంగనర్ జిల్లా కానిపర్తి

మా పాట కొనసాగుతది..


VIJAYA
యావత్ తెలంగాణ కళాకారులందరూ ముఖ్యమంత్రికి రుణ పడి ఉంటారు. ఉద్యమ సమయంలో మేం చేసిన సేవలను గుర్తించి, మా కుటుంబాలకు అండగా నిలవడమేకాకుండా, రాష్ట్రస్థాయి ఉద్యమ గాయనిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. ఇన్నాళ్లూ ఉద్యమ పాటలు పాడిన మేం, ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా గళాన్ని ఉపయోగిస్తున్నం. ముఖ్యమంత్రి మాపై శ్రద్ధచూపకపోతే తెలంగాణ కళాకారులు అంతా ఆగమైపోయేవాళ్లు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
- తేలు విజయ (ఉత్తమ ఉద్యమ గాయని), కరీంనగర్

రెండు పండుగలు


kavitha-rao
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్ట్‌గా అవార్డుకు ఎంపిక కావడం ఒక పండుగ. రాష్ట్రం ఆవిర్భవించిన రోజే నా జన్మదినం కావడం ఇంకో పండుగ. నా పదేళ్ల కెరీర్‌లో 2009 అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, 2012 మరో అవార్డు అందుకున్నాను. ఎందుకో ఈ సారి ఈ అవార్డు అందుకోవడం గొప్ప అనుభూతినిస్తున్నది. మహిళా జర్నలిస్టుగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక ఘట్టాల్లో రిపోర్టింగ్ చేశాను. ఈ అవార్డు అప్పుడు పడ్డ శ్రమకు ఫలితంగా భావిస్తున్నాను. ఇంతకు ముందు అవార్డులు వచ్చినా ఈసారి అందుకోవడం కొంత భిన్నంగా అనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ జర్నలిస్టులకు పెద్దపీట వేస్తున్నది. జర్నలిస్టులకు కూడా అవార్డులు ప్రకటించి సత్కరించడం గొప్ప విషయం.
- కవితా రావు, ఉత్తమ మహిళా జర్నలిస్ట్

వారి ప్రోత్సాహమే..


GANGAMANI
మాది నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామం. ఊళ్లో అంగన్‌వాడీ సెంటర్‌ను నిర్వహిస్తున్నాను. మా సెంటర్‌లో 40మంది పిల్లలుంటారు. వాళ్ల ఆలనాపాలనా చూస్తాను. ప్రతి నిత్యం పిల్లలకు పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అక్షరాలతో పాటు ఆటలు, పాటలు సృజనాత్మక విషయాలు చెబుతూ ఉంటాను. గ్రామానికి చెందిన గర్భిణులు సైతం సెంటర్‌కు వచ్చి పౌష్టికాహారం తీసుకుంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. నేను సెంటర్‌ను సక్రమంగా నడుపుతున్నానని కేంద్రాన్ని సందర్శించిన అధికారులు చెప్పేవారు. తరుచూ మెచ్చుకునేవారు. వారు అలా ప్రోత్సహించడం వల్లే నాకు రాష్ట్రస్థాయి గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్‌సార్ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను తీసుకునేందుకు వెళుతుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది. ఇది జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి. నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు..
- ఎం. గంగామణి, రాష్ట్రస్థాయి ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త గంగామణి

2595
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles