మహిళల్లో గుండెజబ్బులెక్కువే!


Wed,May 18, 2016 03:19 AM

SLEEPగుండెపోటు అనగానే అది ఎక్కువగా పురుషుల జబ్బుగానే భావిస్తారు. కాని మహిళల్లో కూడా గుండెజబ్బులు సర్వసాధారణమే. నిజానికి స్త్రీలలో మరణాలకు గల కారణాల్లో ఇది కూడా అతి ముఖ్య కారణం. ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్న స్త్రీలలో ప్రతిముగ్గురిలో ఒకరు గుండెజబ్బు వల్లే మరణిస్తున్నారు.
గుండె జబ్బులకు ప్రధాన కారణం కరొనరీ ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి, రక్తనాళాలు సన్నబడడం. ఈ సమస్య వల్లనే గుండెపోట్లు వస్తాయి. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఇది ఓ పదేళ్ల తరువాత వస్తుంది. సాధారణంగా మెనోపాజ్ తరువాత మహిళలు గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. సహజంగానే మహిళల రక్త నాళాలు సన్నగా ఉండడం వల్ల ఈ రిస్కు మరింత ఎక్కువ.

మహిళల్లో గుండెపోటు లక్షణాలు
సాధారణంగా గుండెపోటు అంటే ఎడమవైపు ఛాతిలో నొప్పి అనుకుంటాం. సాధారణంగా ఛాతి మధ్య భాగంలో పిసికినట్టుగా, ఏదో భారంగా ఉండే నొప్పి, మెడ లేదా చేయి లేదా దవడ వైపుకి పాకుతూ ఉంటే అది గుండెనొప్పిగా పరిగణించాలి. ఈ నొప్పితో పాటుగా చెమటలు, ఊపిరాడనట్టుగా కూడా ఉంటుంది. అయితే 50 శాతం మంది మహిళల్లో ఈ లక్షణాలుండవు. అధిక అలసట, ఊపిరాడకపోవడం, అజీర్తిగా అనిపించడం, పొట్ట పై భాగంలో అసౌకర్యంగా ఉండడం, దవడ నొప్పి గాని, గొంతు లేదా చేయి నొప్పి గాని ఉంటాయి. ఛాతిలో నొప్పి అసలే ఉండకపోవచ్చు. చాలామంది మహిళలు ఈ లక్షణాలన్నీ పెద్ద విషయంగా పరిగణించరు. కాని ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు.

రిస్క్ కారకాలు
వయసు పెరగడం, కుటుంబ చరిత్ర, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగతాగడం, స్థూలకాయం, ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతాయి. ఇవన్నీ మహిళల్లో కూడా పెరగడం వల్ల ఇప్పుడు మహిళల్లో కూడా గుండెజబ్బుల రిస్కు పెరుగుతున్నది. మానసిక ఒత్తిళ్లు పురుషుల కన్నా ఎక్కువగా మహిళల్లో గుండెజబ్బులకు కారణమవుతాయి.

మెనోపాజ్... గుండెజబ్బు..
ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల సాధారణంగా మహిళలకు గుండె జబ్బుల నుంచి రక్షణ ఉంటుంది. కాబట్టి మెనోపాజ్ తరువాత గుండె సమస్యల రిస్కు పెరుగుతుంది. అయితే మధుమేహం ఉన్నవాళ్లు, పొగతాగేవాళ్లలో ఈస్ట్రోజన్ రక్షణ కవచం కూడా పెద్దగా పనిచేయదు. మెనోపాజ్ తరువాత కొలెస్ట్రాల్, గ్రైగ్లిజరైడ్స్ పెరిగి, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు అవకాశం కూడా ఎక్కువే. అందువల్ల వీటికి సంబంధించిన వైద్య పరీక్షలు రెగ్యులర్‌గా చేయించుకోవాలి.

ఏం చేయాలి?
గుండెపోటు లక్షణాలను గుర్తుపట్టలేకపోవడం ఒక ఎత్తయితే, సామాజిక కారణాల వల్ల మహిళలు తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయడం మరొక ఎత్తు. వెరసి మహిళల్లో గుండెపోట్లు ఎక్కువ అవుతున్నాయి. గుండెపోటుకు సకాలంలో చికిత్స అందకపోవడం వల్ల గుండె త్వరగా దెబ్బతింటోంది. రొటీన్‌గా చేయించుకోవాల్సిన చెకప్స్ కూడా పురుషుల లాగా స్త్రీలు చేయించుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలి. మహిళలు కూడా వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. కనీసం వారానికి 5 రోజులైనా వాకింగ్, జాగింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. ఆహారంలో ఉప్పు తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలను తగ్గించాలి. బీపీ, డయాబెటిస్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
RAMESHGUDAPATI

1681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles