మరణానికి ముగింపు


Mon,August 27, 2018 11:24 PM

-2045 కల్లా చావు లేని మనిషి
-ముసలితనం లేని వృద్ధులు
ఇక చావు అనేది మన ఇష్టం.. మీరు కరెక్టే చదివారు. మీకు నచ్చినప్పుడే చచ్చిపోవచ్చు. అప్పటి దాకా యవ్వనంతో జీవించండి..!! ప్రపంచాన్నంతటినీ జయించిన మహాయోధుడు కూడా వింటే వణికి పోయే ఒకే ఒక్క పదం మరణం. ఎప్పటికైనా చావు తప్పదని తెలిసినా, ఇంకా బతకాలని ఆరాట పడటం మనిషి బలహీనత. చావుని ఇష్టపడి ఆహ్వానించే మానవుడు ఒక్కడు కూడా ఉండడు. అలాంటిది ఇచ్ఛా మరణం వరంగా దొరికితే.. అసలు చావనేదే లేకుండా ఉండగలిగితే... అది కూడా నిత్యయవ్వనంగా..! ఇప్పుడు ఒక శుభవార్త... ఓ హెచ్చరిక! త్వరలో ఇది నిజం కాబోతున్నది. రాబోయే ముప్పయేళ్ల లోపు ఈ కల సాకారం అవుతుంది. ఊహించిన దానికంటే చాలా ముందుగా. ఇద్దరు జెనెటిక్ ఇంజినీర్లు సాధించబోతున్న అద్భుతం ఈ అమరత్వం. మానవాళి యావత్తునూ కుదుపేయనున్న సంచలనం.
Great-warrior
ఒకనాటి అసాధ్యాలన్నీ నేడు సుసాధ్యాలవుతున్నాయి. టీవీ, విమానం, చంద్రమండల యాత్ర, మొబైల్‌ఫోన్.. ఇలా. అలాగే నేటి అసాధ్యాలు కూడా మున్ముందు సుసాధ్యాలయితే.. ఎయిడ్స్, క్యాన్సర్‌లకు మందు, అంగారక జీవనం, గ్రహాంత వాసుల పరిచయం, కాలంలోకి ప్రయాణం.. అవుతాయి. ఖచ్చితంగా అవుతాయి. కానీ ఈ జాబితాలో రెండు అసాధ్యాలు లేవు. ఒకటి: మృత్యువుని జయించడం, రెండు: వృద్ధాప్యాన్ని గెలవడం. ఎందుకో మీకూ తెలుసు. ఇవి ఎప్పటికీ నెరవేరవనీ, ప్రకృతి విరుద్ధమనీ!


బార్సిలోనాలో తమ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరు జన్యుశాస్త్రవేత్తలు ఈ సంచలన విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. జాస్ లూయిస్ కార్డిరో, వృత్తిరీత్యా అమెరికాలోని ఎమ్‌ఐటీ (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ప్రొఫెసర్. డేవిడ్ వుడ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రవేత్త. వీరిద్దరూ రాసిన పుస్తకమే డెత్ ఆఫ్ డెత్. తమ పరిశోధనల వివరాలను వారు ఇందులో పొందుపరిచారు.


వారు తెలిపిన దాని ప్రకారం, మనుషులు ఇక నుంచి కేవలం ప్రమాదాల వల్ల తప్ప సహజ కారణాలతో, ఆనారోగ్యంతో చనిపోయే ప్రసక్తే లేదు. అలాగే, ముసలితనాన్ని కూడా ఒక అనారోగ్యంగా పరిగణించగలిగితే, దాని నివారణకు కూడా పరిశోధనలు ఊపందుకుంటాయి. వీటికై పెద్ద మొత్తంలో నిధులు కూడా సమకూరుతాయి. అసలు జీవించి ఉండగలగడమే అతిపెద్ద మానవహక్కు. మరణించడమనేది, మానవజాతి సంతోషంగా పరిఢవిల్లడానికి ఉన్న ఒకే ఒక అమానవీయమైన, బాధాకరమైన అడ్డంకి. జీవితమే లేకపోతే ఇక హక్కుల ప్రస్తావన ఎక్కడిది? అని వుడ్ విశదీకరించాడు.


ఇతర జన్యుమార్పిడి పద్ధతులతో పాటు నానోటెక్నాలజీ దీనిలో కీలకంగా మారుతుంది. పాడైన కణజాలాన్ని తిరిగి ఉత్తేజంగా మార్చడం, మృతకణాలను శరీరం నుండి తొలగించడం, చెడు జన్యువులను ఆరోగ్యవంతంగా మార్చడం, అలాగే, ముఖ్యమైన అవయవాలను ౩డి ప్రింటింగ్ ద్వారా పునఃసృష్టించడం వంటి చర్యలు ఈ వ్యవహారంలో అంతర్భాగంగా ఉంటాయి. నేను చనిపోవడాన్ని ఇష్టపడటం లేదు. పైగా ౩౦ సంవత్సరాల తర్వాత ఈనాటి కన్నా యవ్వనంగా ఉంటాను అని వుడ్ నవ్వుతూ అన్నాడు.


ఈ ఇద్దరు ఇంజినీర్ల విశ్వాసాన్నిబట్టి, క్యాన్సర్ కూడా నయమయేట్టు ప్రయోగాలు సాగుతున్నాయి. ఈ పదేళ్లలో అది సాధ్యమవచ్చు. చాలామందికి తెలియని విషయమేమిటంటే, క్యాన్సర్ కణాలకు చావు లేదు. ఈ విషయం 1951లోనే కనుగొనబడింది. హెన్రిటా లాక్స్ అనే ఒక అమెరికా- ఆఫ్రికన్ యువతి, గర్భాశయ క్యాన్సర్ వల్ల చనిపోగా, ఆమె శరీరం నుంచి తీసిన క్యాన్సర్ కణితి ల్యాబ్‌లో ఇంకా బతికే ఉంది. ఇదే క్యాన్సర్ నివారణా ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. అలాగే, గూగుల్ లాంటి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయోగాల్లో పాలుపంచుకోవచ్చు. ఎందుకంటే, వైద్యరంగంలో పెనుమార్పులు సంభవించనున్నాయని వాళ్లు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఒక అతిశీతల కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే 10 ఏళ్లలో క్యాన్సర్‌ను నయం చేసే పరిశోధనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనల వేగాన్ని బట్టి చూస్తే, 2040కల్లా దాదాపు అన్ని మొండివ్యాధులకూ చికిత్సలుంటాయి.


తాము ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టామనీ, కాకపోతే ప్రస్తుతం ఇవి చట్టవిరుద్ధమెన ప్రయోగాలు కనుక జన్యుమార్పిడి ప్రయోగాలపై పెద్దగా చట్టాలు లేని కొలంబియాలో వాటిని కొనసాగిస్తున్నామని కార్డిరో, వుడ్ ప్రకటించారు. తన మొదటి పేషెంట్, ఇప్పుడే వృద్ధాప్య ఛాయలు ప్రారంభమైన ఎలిజబెత్ పారిష్‌పై ఆమె పూర్తి సమ్మతితో ఈ ప్రయోగాలు నడుస్తున్నాయని, ఇప్పటికైతే ఎలాంటి దుష్ప్రభావాలు లేవని, ఆమె కణజాలంలోని టెలిమీర్లు గతంలోకంటే 20 ఏళ్లు యవ్వనంగా మారాయని వారు తెలిపారు.


అయితే, ఇవన్నీ విజయవంతమైతే, ఈ భూగోళం జనంతో నిండిపోయి కిటకిటలాడే పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న మాటను ఈ శాస్త్రవేత్తలు కొట్టి పడేసారు. ఈ భూమ్మీద ఇంకా చాలా ఖాళీ ఉందని, అసలే ఇప్పుడు అందరు ఒకర్నో, ఇద్దర్నో కంటూంటే ఇంకా జనాభా ఎక్కడిదని వారి వాదన. పైగా అప్పటికల్లా మనం అంతరిక్షంలో కూడా నివాసం ఏర్పరచుకుంటామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జపాన్, కొరియాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలాగే కొనసాగితే వంద, రెండు వందల ఏళ్లలో ఈ దేశాలు అంతరిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.


ఈ సాంకేతికత వినియోగంలో ఖర్చు భారీగా ఉంటుందేమోనన్న ప్రశ్నకు, ప్రారంభంలో ఎక్కువే ఉన్నా, పెట్టుబడులు పెరిగి, భారీస్థాయిలో చికిత్సలు మొదలైతే పోటీని తట్టుకోవడం కోసం ధరలు తగ్గించక తప్పదనీ, స్మార్‌ఫోన్లను ఉదాహరణగా చూపారు. స్పెయిన్ దేశం మానవాళికి అమరత్వాన్ని ప్రసాదించి, తాము పిచ్చివాళ్లం కామని ప్రపంచానికి నిరూపించాలని స్పానిష్ తల్లిదండ్రులకు జన్మించిన డేవిడ్ వుడ్ ఆకాంక్ష. డెత్ ఆఫ్ డెత్ అనే ఈ పుస్తకం ముందుగా స్పానిష్, ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్ భాషల్లో వెలువడి, తర్వాత ప్రపంచభాషలలో లభ్యం కానుందని వీరు తెలిపారు.


ఎలా సాధ్యం?

సాధారణంగా వృద్ధాప్యమనేది డిఎన్‌ఏ తోకలుగా పిలువబడే టెలిమీర్లు క్రమంగా కుంచించుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఈ టెలిమీర్లు, మన కణంలోని క్రోమోజోముల చివరన టోపీల్లాగా ఉంటాయి. మన షూలేసుల చివరన ఉండే ప్లాస్టిక్ క్యాప్ లాగా అన్నమాట. అసలు మనమేంటి అని నిర్ణయించే డిఎన్‌ఏ ఈ క్రోమోజోముల్లోనే ఉంటుంది. క్రోమోజోమును, తద్వారా డిఎన్‌ఏను కాపాడే బాధ్యత ఈ టెలిమీర్లదే. కాలక్రమేణా తన బాధ్యతను నెరవేర్చే క్రమంలో, ఈ టెలిమీర్లు కుంచించుకుపోయి, క్రోమోజోము, డిఎన్‌ఏ తద్వారా కణం పాడవుతుంటాయి.


అదే శరీరంలోకి ఇంకా పొగ, కాలుష్యం, ఆల్కహాల్ లాంటి విషపదార్థాలు చేరితే ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. ఇదే ముసలితనానికి అసలు కారణం. ఒకవేళ టెలిమీర్లను నాశనం కాకుండా అపగలిగితే, వాటిని తిరిగి పూర్వపు ఆకృతికి తీసుకు రాగలిగితే, క్రోమోజోము, డిఎన్‌ఏ, కణం అన్నీ ఎప్పటికీ భద్రంగా ఉంటాయి. అంటే, వృద్ధాప్యమనేదే మన దరికి రాదు. ఆ రకంగా మరణం కూడా.
- సిహెచ్. శ్రీనివాస్

382
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles