మన సంస్కృతి మహోత్సవం


Wed,January 4, 2017 01:24 AM

తెలంగాణ.. ఉద్యమాలకే కాదు కళలకూ పుట్టినిల్లు. భాషా,సంస్కృతులు పరిఢవిల్లిన నేల. అరవై ఏళ్ల పరాయి పాలనలో మన అస్తిత్వమే మనది కాకుండా పోయింది. ఆ అంతరాన్ని పూడ్చడానికి తరగని గనిలాంటి మన సంస్కృతిని ఒడిచిపట్టుకుని ఓనమాల నుంచి తిరిగి పునర్జీవింపజేయాల్సి ఉంది. ఇక్కడి కళల ఊటబావికి మోటబొక్కెనేసి సాంస్కృతిక సాగు చేయాల్సి ఉంది.
Kalakarulu
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ దిశగా అడుగులు పడ్డాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు, వైతాళికులు, కవులకు సముచితస్థానమిచ్చి తెలంగాణ మట్టి సుగంధాలను ప్రపంచానికి పంచుతున్నది.ఒగ్గుకథ, చిందుయక్షగానం, హరికథలు, బుర్రకథలు, కోలాటం, చిరుతల భజన ఇలా ఒక్కటని కాదు. ఎన్నెన్నో కళలు, కళల కాణాచియైన ఈ మట్టి మాగాణంలో పురుడుపోసుకున్న కళాకారులెందరో. అరవైయేండ్ల పరాయి పాలనలో వివక్షకు గురయిన మన అస్తిత్వానికి తిరిగి పురుడుపోసేందుకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసింది. గడచిన ఏడాది కాలంగా ఆ శాఖ ఎన్నో కార్యక్రమాలతో కళలను, కళాకారులను బతికించేందుకు కృషి చేసింది.. చేస్తూనే ఉంది.

తెలంగాణ సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ ప్రతీది ఒక పండుగే. గత జనవరి 14,15,16 తేదిల్లో తెలంగాణ అంతర్జాతీయ కైట్ పెస్టివల్ నిర్వహించింది. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సలాం హైదరాబాద్ పేరుతో 22 భాషలకు చెందిన 120 మంది కవులతో కవిసమ్మేళనం నిర్వహించింది. తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ రంగాల వారికి నగదు ఆవార్డులు అందించింది. దాశరథి జయంతి రోజున కవి గోరటి వెంకన్నకు దాశరథి ఆవార్డు.. కాళోజీ జయంతి సందర్భంగా బాపురెడ్డికి కాళోజీ ఆవార్డు అందజేసింది.
SWAMY
కృష్ణా పుష్కరాలకు 12000 మంది కళాకారులతో పది ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండకోటలో 800మంది కళాకారులచే ప్రదర్శనలు.. వినాయక నవరాత్రులు, బసవేశ్వర జయంతి, అఖిలభారతీయ కవయిత్రుల సమ్మేళనం, థియేటర్ పోగ్రామ్స్.. ప్రతీ శనివారం రవీంద్ర భారతిలో సినివారం నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని తెలంగాణ జానపద జాతర పేరుతో అన్ని జిల్లాల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తెలంగాణ కళారాధన పేరుతో 52 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు .. మే 10 నుంచి 16 వరకు నిర్వహించింది.
GROUPS

మహా బతుకమ్మ!


రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శాఖ అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహించింది. మహాబతుకమ్మ పేరుతో అక్టోబర్ 8న ఎల్బీ స్టేడియంలో 10,029 మందితో బతుకమ్మ ఆడి గిన్నిస్‌బుక్ రికార్డును సొంతం చేసుకుంది. అలాగే ఐదు రోజుల పాటు రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌హాలులో బతుకమ్మ ఫిల్మోత్సవం పేరుతో చిత్రాలను ప్రదర్శించింది.

డెక్కనీ కల్చరల్ పెస్టివల్


జానపద కళలైన చిందు యక్షగానం, ఒగ్గుకథ, గ్రామీణ కళల కోలాటం, చిరుతల రామాయణం, హరికథ, గిరిజన కళలు కొమ్ముకోయ, గుసాడీ, లంబాడీ, చెంచు, పేరిణీ, లాస్యం, ఖవ్వాలీ, ముషాయిరా వంటి కళారూపాలను ప్రదర్శించింది. పేరిణీ నృత్యానికి జీవం పోసే ఉద్దేశంతో నెలరోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించింది.

ఎల్లలు దాటిన తెలంగానం


రాష్ర్టేతర, అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగంగా హర్యానాలో నిర్వహించిన సూరజ్‌ఖుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్‌మేళాలో పాల్గొని మన కళారూపాలను ప్రదర్శించారు. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో తెలంగాణ కల్చరల్ కార్నివాల్ పేరుతో రోజూ 300 మంది కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేసిన ఘనత సాంస్కృతిక శాఖదే. అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ నేతృత్వంలో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చి మన వైభవాన్ని చాటారు.

కళలకు వేదిక!


MAMIDI
గ్రామీణ వృత్తి కళారూపాలు, జానపద, శాస్త్రీయ, ఉర్దూ, గిరిజన కళలను పోత్సహిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఆదరణకు నోచుకోని కళలకు ఒక వేదిక దొరికింది. సినివారం ఔత్సహిక దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. మా శాఖ చొరవతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలుగు ప్రాచీనహోదాపై హైకోర్టులో విజయం సాధించాం. డెక్కనీ కల్చరల్ పెస్టివల్ ద్వారా గ్రామీణ కళాకారులను వెలుగులోకి తెచ్చాం. నెలనెలా వెన్నెలలో పద్యనాటకాలను, సురభి కళాకారులను పోత్సహిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తాం.
-మామిడి హరికృష్ణ సంచాలకులు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ

కళాకేంద్రాల ఏర్పాటు


వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రం నిర్మాణానికి రూ. 65 కోట్లు కేటాయించగా, హైదరాబాద్‌లో 14 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్లతో తెలంగాణా కళాభారతి నిర్మాణం చేపట్టనుంది. గజ్వేల్‌లోనూ రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఆడిటోరియం ఏర్పాటు చేయనుంది. ఇవేకాక ప్రతి జిల్లాలో ఆడిటోరియం, కళాభారతిల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కొమురం భీం, పీవీ నరసింహారావు, ఈశ్వరీ బాయి, కొండా లక్ష్మణ్ బాపూజీ, సురవరం ప్రతాపరెడ్డి , ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, పైడి జయరాజ్, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రకటించింది. భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన బృహత్తర కార్యక్రమం పుస్తకాల ముద్రణ. గతంలో కొత్తసాలు పేరుతో సంకలనాన్ని తీసుకువచ్చింది. బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడువనం పేరుతో కేవలం తంగేడు పువ్వు మీద 166 మంది కవులతో కవితా సంకలనం తీసుకురాగా రాష్ట్ర అవత రణను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన మరో సంకలనం తొలిపొద్దు. 442 మంది కవులు రాసిన కవితా సంకలనం ఇది. ఇక ఇటీవల మట్టిముద్ర పేరుతో మరో కవితా సంకలనం తీసుకురావడం సాంస్కృతిక శాఖకే చెల్లింది.
GIRLS

పింఛన్‌లు, ఉద్యోగాలు


వృద్ధ కళాకారులను ఆదుకునేందుకు నెలకు రూ.1,500 చొప్పున 2049 మందికి పింఛన్ సౌకర్యం కల్పించింది. అలనాటి తెలంగాణ హీరో కాంతారావు భార్య హైమావతికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల, ఒగ్గుకథ పితామహుడు చుక్కా రామయ్యకు ప్రత్యేక పింఛన్ అందిస్తున్నది. తెలంగాణ సారస్వత పరిషత్‌కు సంవత్సరానికి 10లక్షలు, పోతన విజ్ఞాన పీఠానికి రూ.5 లక్షలు, త్యాగరాయగానసభ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు రూ.5లక్షల చొప్పున అందించింది. 550 మంది కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథి కింద ఉద్యోగాలు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే.
-మధుకర్ వైద్యుల

2229
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles