మన తెలంగాణ జలపాతాల వీణ!


Fri,July 20, 2018 01:38 AM

బొగత


1BogathaWaterfall
భద్రాచలం అడవులలో ప్రకృతి సహజంగా ఏర్పడింది బొగత జలపాతం. దీన్ని చీకులపల్లి ఫాల్స్ అనీ అంటారు. 30 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం కనువిందు చేస్తుంది.

ఇలా వెళ్లండి..

రైల్లో కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడు వెళ్లాలి. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే చీకులపల్లి కాజ్‌వే వస్తుంది. మరో మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే బొగత జలపాతం.

కుంటాల

2kuntala
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ప్రకృతిసిద్ధంగా వెలిసిన జలపాతం కుంటాల. కేవలం తెలంగాణ నుంచే కాక వివిధ రాష్ర్టాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. బండల మీద నుంచి పాల నురగల్లా పరుగులెత్తే జలపాతాలు మనసును ఇట్టే దోచుకుంటాయి.

ఇలా వెళ్లండి..

నిర్మల్ నుంచి 30 కిలోమీటర్లు ఆదిలాబాద్ వైపుగా ప్రయాణిస్తే నేరడిగొండ మండల కేంద్రం ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపుగా వెళితే 56 కిలో మీటర్లు ఉంటుంది. ఇరు వైపుల నుండి వచ్చేవారికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మండల కేంద్రం నుండి జలపాతానికి 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేరడిగొండ నుంచి ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి.

భీమునిపాదం

3Bheemuni-jalapatham
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానాగారం గ్రామం శివార్లలో ఉన్న కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతాలు ఉన్నాయి. పర్యాటకులను విశేషంగా అలరిస్తున్న ఈ జలపాతాలు 60 అడుగుల ఎత్తు నుంచి దూకుతూ ఆకట్టుకుంటాయి.

ఇలా వెళ్లండి..

వరంగల్ నుంచి 60 కి.మీ. ప్రయాణిస్తే భీముని పాదం చేరుకోవచ్చు. గూడురు మండల కేంద్రం నుంచి 9 కి.మీ. దూరం ఉంటుంది.

మల్లెలతీర్థం

4mallela
దట్టమైన నల్లమల అడవుల మధ్యలో 500 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం మల్లెలతీర్థం. పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారట. లోయల మధ్య ఉండే ఈ జలపాతం దూరం నుంచే కళ్లు తిప్పుకోనంత అందంగా ఉంటుంది. ఈ జలపాతం నుంచి ప్రవహించే నీళ్లతో రెండు జలాశయాలు ఏర్పడ్డాయి. 300 అడుగుల లోతు వరకు నడుచుకుంటూ వెళ్లి, వంద అడుగులు లోపలికి దిగాలి. ఆ తర్వాత 300 అడుగుల మెట్లు దిగితే మల్లెలతీర్థం పూర్తిస్థాయిలో కనిపిస్తుంది.

ఇలా వెళ్లండి..

హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ప్రధాన రహదారికి మన్ననూర్ మీదుగా వటువర్లపల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే మల్లెలతీర్థం చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 166 కి.మీ, మహబూబ్‌నగర్ నుంచి 153 కి.మీ, శ్రీశైలం నుంచి 60 కి.మీ, అచ్చంపేట నుంచి 50 కి.మీ దూరంలో మల్లెలతీర్థం జలపాతం, పుణ్యక్షేత్రం ఉన్నాయి.

సబ్బితం

5sabbetham
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టుశింగారం గ్రామ శివారులో సబ్బితం (గౌరిగుండాల) జలపాతం పారుతున్నది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సందర్శకులతో పాటు, ఇతర రాష్ర్టాల నుంచి సందర్శకులు వచ్చి చూసి వెళుతుంటారు.

ఇలా వెళ్లండి..

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న సబ్బితం గ్రామ పంచాయతీ పరిధిలో 3 కిలో మీటర్ల దూరంలో ఉంది. రైలు ప్రయాణం చేసి వచ్చేవారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు బస్సు లేదా ఆటో, ఇతర వాహనాల ద్వారా జలపాతం దగ్గరికి చేరుకోవచ్చు. పెద్దపల్లి నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి గుండా 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే సబ్బితం గ్రామం వస్తుంది. బస్టాప్ నుంచి కుడివైపు పొలాల వైపు వెళ్లే మట్టిబాట నుంచి 3 కిలో మీటర్లు ప్రయాణిస్తే సబ్బితం జలపాతం వస్తుంది.

గుండాల

6Gundal
ఉమ్మడి పాలమూరు జిల్లా కృష్ణానదికి ప్రవేశ ద్వారం. కొండలు, కోనలు దాటి కృష్ణానది పరుగులెత్తుతూ గుండాల జలపాతానికి పురుడు పోసింది. జూరాల ప్రాజెక్టుకు దిగువన కొద్దిదూరంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. గుండాల జలపాతం సమీపంలోనే జూరాల జలవిద్యుత్ కేంద్రం ఉన్నది. ప్రస్తుతం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఈ జలపాతం ఉన్నది.

ఇలా వెళ్లండి..

ఆత్మకూరు మండల కేంద్రం నుంచి 4 కి.మీ. దూరంలో గుండాల జలపాతం ఉంది. మహబూబ్‌నగర్ నుంచి 64 కిలోమీటర్లు, వనపర్తి జిల్లా కేంద్రం నుంచి అయితే 36 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఆత్మకూరు చేరుకున్న తర్వాత ఆటోల సదుపాయం ఉంటుంది. హైదరాబాద్, కర్నూలు నుంచి రైలులో వచ్చేవారు శ్రీరాంనగర్, వనపర్తిరోడ్ రైల్వేస్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆత్మకూరు వరకూ బస్సు సౌకర్యం ఉంది.

పొచ్చెర

7pochera
బోథ్ మండలంలో ఉన్న మరో జలపాతం ఇది. స్థానిక పెద్దవాగు, కడెం నది, గోదావరి జలాల కలయికతో ఇది ప్రాణం పోసుకుంది. నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల నడుమ నేరేడికొండ గ్రామంలో ఈ జలపాతం పరుగులు తీస్తున్నది. కుంటాల జలపాతానికి సమీపంలోనే ఇది ఉంది.

ఇలా వెళ్లండి..

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 53 కిలోమీటర్ల దూరంలో పొచ్చెర జలపాతం ఉంది. నిర్మల్ నుంచి 45 కిలోమీటర్ల దూరం. 44వ నంబర్ జాతీయ రహదారి (7వ నంబర్ జాతీయ రహదారి) నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉన్నది. బోథ్‌కు వెళ్లే మార్గంలో మూడు కిలోమీటర్లు ప్రయాణించి, అక్కడి నుంచి కుడివైపునకు కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే పొచ్చెర జలపాతం దగ్గరకు చేరుకోవచ్చు.


కొరటికల్

8koritical
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో మరో జలపాతం కూడా ఉంది. ఇది కూడా సహజ సిద్ధంగా ఏర్పడిందే. నేరడిగొండ మండలంలోని రాజురా గుట్టల నుండి వచ్చే నీరు వాంకిడి వాగు గుండా ప్రవహించి కొరటికల్ జలపాతంలో కలుస్తుంది.

ఇలా వెళ్లండి..

నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్లే దారిలో కొరటికల్ జలపాతానికి వెళ్లే దారి ఉంది. జాతీయ రహదారి నుంచి 20 కిలోమీటర్ల దూరం. ఆదిలాబాద్ నుండి వస్తే 65 కి.మీ దూరంలో కొరటికల్ గ్రామ సమీపంలో ఉంది. నేరడిగొండ మండల కేంద్రం నుండి నిర్మల్ వైపుగా వెళితే కేవలం 10 కిలోమీటర్లు ఉంటుంది.

కనకాయ్

9kanakayi-waterfalls
ఆదిలాబాద్‌లోని మరో అందమైన జలపాతం ఇది. బజార్‌హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామ పంచాయతీకి హామ్లెట్ గ్రామమైన బలన్‌పూర్ సమీపంలో ఈ జలపాతం ఉన్నది. కడెం, బండ్రెవ్, కొల్హరి, భోస్రా తదితర వాగుల నుంచి పారే నీరు కనకాయ జలపాతంగా మారుతుంది. ఎత్తైన సప్తగుండాల(కనకాయ్) జలపాతం నుంచి జాలువారే నీరు కనులవిందు చేస్తుంది.

ఇలా వెళ్లండి..

ఆదిలాబాద్ చేరుకున్న తర్వాత ఇచ్చోడ మండలం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజార్‌హత్నూర్ మండలానికి చెందిన గిర్నూర్ సమీపంలో ఈ జలపాతం ఉంది. గిర్నూర్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కనకాయ జలపాతం చేరుకోవచ్చు.

రామునిగుండం

10ramuni-gundala
త్రేతాయుగంలో శ్రీరాముడు గోదావరి పరీవాహక ప్రాంతంలోని దండకారణ్యంలో భార్య సీతతో సంచరిస్తూ వనవాస కాలంలో ఈ కొండపై కొంతకాలం సేద దీరినట్లు ఇతిహాసం. అతని దాహార్తి కోసం అందులో కొన్ని పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, జీడిగుండం, ధర్మగుండం ఇలా 108 గుండాలను ఏర్పాటు చేసినట్లు కథనం ఉంది. ఆ గుండాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. సీతమ్మ స్నానం కోసం ఏర్పడిన కొలనును నేడు సీతమ్మ కొలనుగా పిలుస్తుంటారు.

ఇలా వెళ్లండి..

కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకోవాలి. ప్రైవేటు వాహనాలు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. రామగుండం బైపాస్‌రోడ్డు (బీ పవర్‌హౌస్ గడ్డ) వద్ద దిగి నేరుగా కొండపైకి 2 కి.మీ. దూరం నడుచుకుంటూ వెళ్లాలి. రైలు ప్రయాణంతో వచ్చేవారు రామగుండం రైల్వేస్టేషన్లో దిగి ఆటోల ద్వారా చేరుకోవచ్చు.

జాడి మల్కా పూర్

11jadi-malkapur
పచ్చటి ప్రకృతి నడుమ మనసు గాలిలో తేలేలా, కోకిల రాగాలకు లయబద్ధంగా తాండవించేదే జహీరాబాద్ సమీపంలోని జాడిమల్కాపూర్ జలపాతం. మొగుడంపల్లి మండలం, జాడిమల్కాపూర్‌లో ఈ జలపాతం ఉన్నది. తెలంగాణ, కర్ణాటకల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్ని చూడడానికి పక్క రాష్ట్రం ప్రజలు కూడా వస్తుంటారు.

ఇలా వెళ్లండి..

హైదరాబాద్ నుంచి జహీరాబాద్‌కు 100 కి.మీ. దూరం. అక్కడి నుంచి మొగుడంపల్లి దగ్గరే. అక్కడి నుంచి గోవింద్‌పూర్ మీదుగా పర్వతాపూర్ దాటి విటునాయక్ తండాకు చేరుకోవాలి. ఆ తండా దాటిన తర్వాత మిర్జాంపల్లి తండా రోడ్డు పక్క నుంచి జాడిమల్కాపూర్ జలపాతానికి దారి ఉంది. జహీరాబాద్ నుంచి 30 కి.మీ. దూరంలో ఈ జలపాతం కనువిందు చేస్తుంది. కర్నాటక నుంచి వచ్చేవారు జహీరాబాద్ వచ్చే దారిలో సంగాపూర్ తండా నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

పెద్దగుండం

12pedda-gundam
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గం అంటేనే జలపాతాలకు పుట్టినిల్లు. జలవిహారం చేయాలనుకునే వారికి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న జలపాతాలు ఆహ్వానం పలుకుతాయి. బోథ్ సమీపంలోని ఇచ్చోడ మండలంలో ఓ సరికొత్త జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తుంది. ఇచ్చోడ మండలంలోని కోకస్‌మన్నూర్ గ్రామ శివార్లలో అద్భుతమైన ఈ జలపాతం ఉంది.

ఇలా వెళ్లండి..

బోథ్ జాతీయ రహదారి నుంచి పడమర వైపుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో కోకస్‌మన్నూర్ గ్రామం ఉంది. అక్కడి నుంచి మరో రెండుకిలోమీటర్ల దూరం వరకు వాహనాలు వెళ్తాయి. ఆ తర్వాత దాదాపు అరకిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అడవులు, పెద్ద పెద్ద బండరాళ్లు దాటిన తర్వాత పెద్దగుండం జలపాతాల ధ్వని మిమ్మల్ని ఆహ్వానిస్తుంటుంది. గతేడాది పర్యాటక అభివృద్ధి శాఖామాత్యులు కేటీఆర్ ఆదేశాల మేరకు అక్కల చంద్రమౌళి బృందం పెద్దగుండం జలపాతాలను సందర్శించి వెలుగులోకి తెచ్చింది.

ముక్తిగుండం

13Mukthigundam
గోదావరి నది ఉపనది అయిన కడెం నది మీద ఈ జలపాతం ప్రవహిస్తున్నది. దీనికే గాడిద గుండం అని కూడా పేరు. దట్టమైన అటవీమార్గం గుండా ప్రయాణిస్తే ఈ జలపాతానికి చేరుకోవచ్చు.

ఇలా వెళ్లండి..

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే జాతీయ రహదారికి దగ్గరలో ఈ జలపాతం ఉంది. హైదరాబాద్ నుంచి నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ముక్తిగుండం జలపాతాల దగ్గరకు చేరుకోవచ్చు.

రథంగుట్ట

14Ratham-gutta
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రథంగుట్ట వద్ద జలపాతాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. రథంగుట్ట పైనుంచి 30 అడుగుల ఎత్తు నుండి నీరు జాలు వారుతున్నది.

ఇలా వెళ్లండి..

రథంగుట్ట జలపాతం మణుగూరుకు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కాలినడక ద్వారానే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఖమ్మం మీదుగా మణుగూరు చేరుకోవచ్చు. భద్రాచలం వరకూ రైలు సౌకర్యం ఉన్నది. ఏటూరు నాగారం మీదుగా అయితే 335 కిలోమీటర్లు ప్రయాణించాలి. హైదరాబాద్ నుంచి నేరుగా మణుగూరుకు బస్సు సౌకర్యం ఉంది.

బోడకొండ, లోయపల్లి

15Bodakonda-village
ఎత్తైన గుట్టల మీద నుంచి జాలువారే ఇక్కడి జలపాతాలు రోడ్డుకు దగ్గరగా కనిపిస్తాయి. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతంలో బోడకొండ, లోయపల్లి జలపాతాలు ఉన్నాయి.

ఇలా వెళ్లండి..

హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం 20 కి.మీ దూరం. అక్కడి నుంచి నాగార్జున సాగర్ హైవే మీదుగా పది కిలోమీటర్లు ప్రయాణిస్తే గున్‌గల్ గ్రామం వస్తుంది. అక్కడ ఎడమవైపు తిరిగి మరో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే బోడకొండ జలపాతం చేరుకోవచ్చు. మరో ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లి, రెండు కిలోమీటర్లు కాలినడకన వెళితే లోయపల్లి జలపాతం చూడొచ్చు.

పాండవలొంక

16pandava-lanka
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట గ్రామంలో ఉన్న పాండవలొంక జలపాతం పర్యాటక కేంద్రంగా ఆహ్లాదాన్ని పంచుతున్నది. గతంలో పాండవులు వనవాసం చేసినప్పుడు ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఇక్కడే శివాలయం నిర్మించారని, గ్రామస్థులు కథలు కథలుగా చెప్పుకుంటారు. గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవలొంక సమీపంలో ఎత్తైన కొండ ప్రాంతం నుండి, పెద్దలోయలోకి పైనుండి నీళ్ళు దూకుతాయి. ఇక్కడ పెద్దలోయలో పురాతన శివాలయంతో పాటు హనుమాన్ విగ్రహం ఉంది.

ఇలా వెళ్లండి..

పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ముత్తారం (మంథని) రహదారి గుండా వెళ్తే జాఫర్‌ఖాన్‌పేట వస్తుంది. అక్కడి నుంచి కాలినడకన దాదాపు 4 కిలోమీటర్ల దూరం నడక మార్గాన ప్రయాణిస్తే పాండవలొంక జలపాతం చేరుకోవచ్చు.

మిట్టె

17mitte-waterfall
మిట్టె జలపాతంలో ఏడు జలపాత పాయలు ఉంటాయి. రామగుండం, సీతాగుండం, లక్ష్మణగుండం, స్యామ్‌గుండం, సవతిగుండం తదితర పేర్లు దట్టమైన అటవి ప్రాంతంలోని ఈ జలపాతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం జలపాతాన్ని విక్షించడానికి అనేక ప్రాంతాల నుండి సందర్శకులు వస్తుంటారు. జలపాతం అందాలు వారిని కట్టి పడేస్తాయి.

ఇలా వెళ్లండి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రం నుండి రెండు కిలో మీటర్ల దూరంలో గల సప్తగుండాల (మిట్టె) జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం చేరుకున్న తర్వాత అక్కడి నుండి జైనూర్ వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుండి సిర్పూర్ (యు) మండల కేంద్రం మీదుగా 20 కిలో మీటర్ల దురంలో పిట్లగూడ, లింగాపూర్ గ్రామాలు ఉంటాయి. అక్కడి నుండి రెండు కిలో మీటర్లు కాలి నడకన వేళ్తే అందమైన సప్తగుండాల జలపాతం ప్రత్యక్షమవుతుంది.

అజ్జలా పురం

18ajilapurtam
చుట్టూ కొండలు, వేల ఎకరాల్లో పరుచుకున్న గుట్టల నడుమ స్వేచ్ఛగా ప్రవహించే జలపాతమిది. ఇబ్రహీంపట్నం నుంచి 40 కి.మీ దూరంలో ఇది ఉన్నది.

ఇలా వెళ్లండి..

హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే దారిలో మాల్ అనే గ్రామం దగ్గర ఎడమవైపు తిరగాలి. ఇది దాదాపు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం. మాల్ నుంచి మరో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే అజ్జలాపురం గ్రామం చేరుకోవచ్చు. అక్కడి నుంచి కాలినడకన 2 కి.మీ ప్రయాణిస్తే జలపాతం కనువిందు చేస్తుంది.

ప్రవీణ్‌కుమార్ సుంకరి

3125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles