మనసున్న ప్రపంచ సుందరి


Sun,December 16, 2018 01:24 AM

మొత్తం 188 దేశాలకు చెందిన సుందరీమణులు తమ అందం, అభినయం, తెలివితేటలతో చివరివరకూ వచ్చారు. ఇక మిగిలింది ఫైనల్ రౌండ్. వేదికపై చివరి దశకు చేరుకున్న ఐదుగురు అందగత్తెలు ఉన్నారు. నరాలు తెగే ఉత్కంట. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎదురుగా న్యాయ నిర్ణేతలు.. ఒక్కొక్కరినీ ప్రశ్నలడుగుతున్నారు. వనెస్సా వంతు వచ్చింది. ఆమెకది చివరి ప్రశ్న.. తనను ప్రపంచానికి పరిచయం చేసే జీవిత ప్రశ్న. ప్రపంచ సుందరిగా మీ స్థాయిని ఇతరుల కోసం ఏ విధంగా ఉపయోగిస్తారు? అంటూ ఓ న్యాయనిర్ణేత వనెస్సాను అడిగాడు. అంతే.. ఎలాంటి తడబాటు, బిడియం, భయం లేకుండా ఓ సమాధానం.. న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని కట్టబెట్టారు.
vanessa-ponce
ప్రపంచ సుందరి కిరీటం అందం, అభినయం ఉంటేనే రాదు. తెలివితేటలు, చదువు, సమయస్ఫూర్తి, ధైర్యం, సమస్యలు-పరిష్కారాలపై అవగాహన.. అన్నింటికీ మించి సామాజిక బాధ్యత ఎరిగిన వారికే అది దక్కుతుంది. అందుకే అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టే.. మెక్సికోకు చెందిన వనెస్సా పోన్స్ డి లియోన్‌కు సొంతమైంది ఆ కిరీటం. అంతటి ప్రతిభావంతురాలైన సామాజిక కార్యకర్త వనెస్సా. చివరి రౌండ్‌లో జడ్జిలు అడిగిన ప్రశ్నకు..నేను మూడేళ్లుగా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నానో.. అవే ఇప్పుడూ కొనసాగిస్తాను. అదే స్థానాన్ని పదిలం చేసుకుంటా. అన్ని వేళల్లోనూ ప్రేమ, దయ, జాలి కలిగి, జాగ్రత్తలు తీసుకుంటూ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సహాయం చేయడం మాత్రం మానుకోం. అన్నార్థులకు సహాయం అందించడానికి ఎల్లవేళలా ముందుంటా అంటూ ముగించింది. ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మారుమోగాయి. న్యాయనిర్ణేతల ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోయాయి. నిండైన ఆత్మవిశ్వాసంతో మనస్ఫూర్తిగా సమాధానం చెప్పిన వనెస్సాకే విశ్వసుందరి కిరీటాన్ని అందించారు.

మాటల్లోనే కాదు.. చేతల్లోనూ తను మిస్ పర్‌ఫెక్ట్. సామాజిక కార్యక్రమాలు, చదువు, ఆటలు, సాహస క్రీడలు, డాన్స్, పాటలు.. ఏ రంగమైనా సులువుగా సమయస్ఫూర్తితో దూసుకెళ్లిపోతుంది వనెస్సా. ఇక సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది. మైగ్రేంట్స్ ఎన్ ఎల్ కమినో అనే బాలికల పునరావాస కేంద్రం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉన్నది. ఇది ఒయాక్సకా పాంతంలో ఉన్నది. ఒయాక్సకా మెక్సికోలో వెనుకబడిన కరవు ప్రాంతం. ఇలాంటి చోట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, బాలికల బాగోగులు చూసుకుంటున్నది. ఈ సంస్థ ద్వారా ఎంతోమంది బాలికలకు పునరావాసం కల్పించి, ఉచితంగా చదువు చెప్పిస్తున్నది. అంతేకాకుండా తాను ఈ కేంద్రాన్ని ఎప్పుడు సందర్శించినా.. అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు బహుమతులు తీసుకెళ్తుంటుంది వనెస్సా. వీరే కాకుండా అనాథ పిల్లలను చేరదీసి వారి పోషణ, చదువును భరిస్తున్నది. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అక్కడ ప్రత్యక్షమై.. తన వలంటీర్లతో కలిసి చేతనైనా సాయం చేస్తుంటుంది. బాధితులకు పునరావాసం కల్పించే ఏర్పాటు చేస్తున్నది. తక్షణం అందాల్సిన భోజనం, నీరు, దుస్తులను అందించి ఊరట కలిగిస్తుంది. వలస ప్రజలు ముఖ్యంగా బాలికల హక్కుల కోసం కృషిచేస్తున్నది. వనెస్సా వయసు చిన్నదే అయినా.. మనసు చాలా పెద్దది. పైకి కనిపించే అందం ఒక ఎత్తైతే.. దయ, కరుణ, మానవత్వం కలిగిన ఆత్మసౌందర్యంలో తనకు తానే సాటి.
vanessa-ponce2
సాహస క్రీడలంటే వనెస్సాకు చాలా ఇష్టం. ముఖ్యంగా స్క్యూబా డైవింగ్. సముద్రం లోపలికి వెళ్లి.. అక్కడి ప్రదేశాలను తిలకించడమంటే ఈమెకు మహా సరదా. డైవింగ్ డ్రెస్ వేసుకొని సముద్రంలో విహరించడం వనెస్సా ప్రత్యేకత. ఇక వాలీబాల్ గేమ్‌లో అడుగుపెట్టిందంటే.. ప్రత్యర్థులకు చెమటలే. మెరుపు వేగంతో బాల్‌ను కొడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. తన హైట్‌కు తగ్గట్టుగానే వాలీబాల్ గేమ్‌లోనూ రాణించింది. మానసిక ప్రశాంతత కోసం అల్టిమేట్ ఫ్రిస్బీ గేమ్ ఆడుతుంది వనెస్సా. ప్రత్యేర్థులకు ఫ్రిస్బీ దొరక్కుండా పట్టుకోవడంతోనూ నైపుణ్యం సంపాదించింది వనెస్సా. ఆటలతో పాటుగా డ్యాన్స్‌లు, పాటలు పాడడమంటే చాలా ఇష్టం. మెక్సికోలోని ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నది వనెస్సా. నేషనల్ యూత్ ఇన్‌స్టిట్యూట్‌లో స్పీకర్‌గా పనిచేస్తున్నది. తను మంచి ఫొటోగ్రాఫర్ కూడా. మంచి ఫొటోలను తన కెమెరాలో బంధిస్తుంటుంది. ఎటు వెళ్లినా తన బ్యాగ్‌లో కచ్చితంగా కెమెరా ఉండాల్సిందే.

మెక్సికోలోని గ్వానాజువాటో నగరంలో 1992 మార్చి 7న పుట్టింది వనెస్సా. చిన్నప్పటి నుంచి చదువుల్లోనూ ఫస్టే. తాజాగా గ్వానాజువాటో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే మోడలింగ్‌లో అవకాశాలను వెతుక్కున్నది. అందగత్తె వనెస్సాకు మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో.. పలు పోటీల్లో పాల్గొనేది. అలా మొదటిసారి 2014లో మెక్సికో నెక్ట్స్ టాప్ మోడల్ సీజన్-5 కిరీటం గెలుచుకున్నది. అదే స్ఫూర్తితో అందాల పోటీల్లో రాణిస్తూ ఈ యేడాది మేలో జరిగిన మిస్ వరల్డ్ మెక్సికో టైటిల్ గెలుచుకొని.. మిస్ వరల్డ్ పోటీల్లో అడుగుపెట్టింది. ఈ పోటీల్లో దాదాపు 188 దేశాల అందగత్తెలను ఓడించి.. 68వ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నది. అయితే, మెక్సికో దేశానికి ఇంతవరకూ మిస్ వరల్డ్ టైటిల్ దక్కలేదు. వనెస్సాతో ఆ లోటు తీరడంతో మెక్సికన్లు సంబురాలు చేసుకున్నారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా థాయిలాండ్ భామ నికోలెనా పిచాపా లిమ్స్‌న్యూక్ (20), రెండో రన్నరప్‌గా బెలారస్ సుందరి మారియా వాసిల్వెంచి నిలిచారు. మారియా వసిల్విచ్ (బెలారస్), కదీజా రాబిన్సన్ (జమైకా), క్విన్ అబేనక్యో (ఉగాండా)లు చివరి స్థానాల్లో నిలిచారు. గతేడాది ప్రపంచ సుందరిగా నిలిచిన మానుషి చిల్లార్ (ఇండియా) వనెస్సాకు కిరీటాన్ని అలంకరించింది. ఆ సమయంలో మానుషికి చేతులెత్తి నమస్కరించింది వనెస్సా. ఈ దృశ్యాన్ని చూసిన ఇండియన్స్‌కు ఆమె ఫిదా అయ్యారు. అయితే భారత్ తరఫున పాల్గొన్న అనుకీర్తి వ్యాస్ మాత్రం 19వ స్థానంతో సరిపెట్టుకుంది.
vanessa-ponce1

వెనెస్సా మాట్లాడుతూ..

దీన్ని నమ్మలేకపోతున్నా. ఇది నిజమా! ఈ కిరీట ధారణకు యువతులందరూ అర్హులే. వారందరి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మెక్సికో ప్రజలందరికీ ఈ గెలుపు అంకితం. నేను వాళ్లను గర్వపడేలా చేశాననే భావిస్తున్నా
- వనెస్సా పోన్స్ డి లియోన్, ప్రపంచ సుందరి

మిస్‌వరల్డ్ పోటీల ప్రత్యేకతలు..

చరిత్రలో మెక్సికోకు తొలి మిస్ వరల్డ్ కిరీటం దక్కింది.
చైనా తీర ప్రాంత నగరం సాన్యాలో ప్రపంచ సుందరి పోటీలు జరగడం ఇది ఎనిమిదో సారి. ప్రస్తుతం జరిగినవి 68వ పోటీలు.
తొలిసారిగా 2003లో ఈ పోటీలకు సాన్యా నగరం ఆతిథ్యం ఇచ్చింది.
అమెరికా స్టార్ డోనెల్ మంజేనా తన పాటలు, స్టెప్పులతో అలరించింది.
ఈ యేడాది 188 దేశాలకు చెందిన యువతులు పోటీల్లో పాల్గొన్నారు.
1951లో బ్రిటన్‌కు చెందిన ఎరిక్ మెర్లే ఈ పోటీలకు రూపకల్పన చేశారు. అదే ఏడాది జులై 29న మొదటిసారి లండన్‌లో పోటీలు నిర్వహించారు. మొట్టమొదటి ప్రపంచ సుందరిగా స్వీడన్‌కు చెందిన కికి హకన్సన్ నిలిచారు.
ఈ పోటీలు మొదలైన 15 ఏళ్ల తర్వాత భారతీయ యువతి 1966లో రీటా ఫారియా మొదటిసారిగా ప్రపంచ సుందరిగా నిలిచారు.
ఆమె తర్వాత ఐదుగురు భారతీయ యువతులు ఈ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.
1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్.

డప్పు రవి

1036
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles