మధురమైన మామిడితో..

Tue,March 21, 2017 02:02 AM

mangoఎండాకాలం వచ్చిందంటే.. మండే ఎండలతో పాటు అందరికీ మామిడిపండు కూడా గుర్తొస్తుంది. ఇప్పటికే మార్కెట్లో మామిడిపళ్లు నోరూరిస్తున్నాయి. పండ్లు ఈ మూడు నెలలు మాత్రమే నోరూరిస్తే.. కాయలు మాత్రం తొక్కు రూపంలో ఏడాదంతా.. తోడుంటాయి. అందుకే ఈసారి మామిడి పండ్ల కంటే ముందు మామిడికాయల వంటలతో మీ ముందుకొచ్చాం. ఉదయాన్నే నిమ్మకాయతో చేసుకునే పులిహోరకు కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చి ఈ సీజన్‌లో మ్యాంగో రైస్ టేస్ట్ ఎంజాయ్ చేయండి. దీంతో పాటే నోరూరించే చట్నీలు, కేకులూ తెచ్చాం.

స్వీట్ మ్యాంగో చట్నీ


SWEET-MANGO-CHUTNEY
కావాల్సినవి :మామిడికాయ : 1, బెల్లం : ఒక కప్పు, ఆవాలు : అర టీస్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, పసుపు : పావు టీస్పూన్, కారం : అర టీస్పూన్, నూనె : ఒక టేబుల్‌స్పూన్
తయారీ :
స్టెప్ 1 :కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మామిడికాయ ముక్క, కరివేపాకు, పసుపు, కారం, బెల్ంల వేసి వేయించాలి.
స్టెప్ 2 : సన్నని మంట మీద కాసేపు వేగిన తర్వాత నీళ్లు పోసి ఉడికించాలి.
స్టెప్ 3 :అవి మెత్తగా ఉడికాక.. వేరే గిన్నెలో వేసి కాసేపు చల్ల్లారనివ్వాలి. దీన్ని నిల్వ చేసుకోవచ్చు.
స్టెప్ 4 : ఈ చట్నీతో దోశలు తింటే ఆ టేస్టే వేరు.

మ్యాంగో పరాట


RAW-PAPAYA
కావాల్సినవి :మామిడికాయ తురుము : ఒక కప్పు, పొప్పడి పండు తురుము : ఒక కప్పు, పచ్చిమిర్చి : 2, పసుపు : చిటికెడు, అల్లం : ఒక టీస్పూన్, శనగపిండి : ఒక టీస్పూన్, గోధుమపిండి : ఒక కప్పు , కొత్తిమీర : చిన్న కట్ట, ఉప్పు, నూనె : తగినంత
తయారీ :
స్టెప్ 1 :కడాయిలో నూనె పోసి పచ్చిమిర్చి, పొప్పడిపండు తురుము, మామిడికాయ తురుము, పసుపు, ఉప్పు, అల్లం, వేసి ఒక నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2 :మరో గిన్నెలో శనగపిండి, కరివేపాకు, గోధుమపిండి వేసి కొన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
స్టెప్ 3 : ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న చపాతీల్లా చేసుకున్న తర్వాత మామిడికాయ మిశ్రమాన్ని కొద్దిగా వేసి మళ్లీ చపాతీని ఒత్తుకోవాలి.
స్టెప్ 4 :ఇలా పిండి మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పెనం మీద కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని వేడిగా తినేయాలి.

మ్యాంగో స్పాంజ్ కేక్


MANGO-SPONGE-CAKE
కావాల్సినవి :
మామిడికాయ గుజ్జు : ఒక కప్పు
చక్కెర : 20 గ్రా.
కోడిగుడ్డు : 1
వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్
మైదా : అర కప్పు
బేకింగ్ సోడా : చిటికెడు
బేకింగ్ పౌడర్ : కొద్దిగా
గోధుమపిండి : ఒక టేబుల్‌స్పూన్
రవ్వ : ఒక టేబుల్‌స్పూన్
చాకో చిప్స్ : 2 టేబుల్‌స్పూన్స్
బటర్ : 30 గ్రా.
తయారీ :
స్టెప్ 1 :ఒక గిన్నెలో బటర్, చక్కెర వేసి బాగా కలుపాలి. ఇందులో కోడిగుడ్డు వేసి మెల్లగా మిక్స్ చేయాలి.
స్టెప్ 2 : ఆ తర్వాత మామిడికాయ గుజ్జు, వెనీలా ఎసెన్స్ వేసి మరికాసేపు కలుపాలి.
స్టెప్ 3 :ఇప్పుడు మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, గోధుమపిండి, రవ్వ, చాకో చిప్స్ వేసి.. అన్నీ బాగా కలిసేలా చేయాలి.
స్టెప్ 4 : బటర్ పూసిన బేకింగ్ ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. అంతే కేక్ రెడీ!

మామిడికాయ అన్నం


MANGO-COCONUT-RICE
కావాల్సినవి :
అన్నం : 2 కప్పులు
మామిడికాయ తురుము : ఒక కప్పు
కొబ్బరి తురుము : ఒక కప్పు
జీలకర్ర : ఒక టీస్పూన్
ఆవాలు : ఒక టీస్పూన్
పచ్చిమిరపకాయలు : 3
ఎండుమిర్చి : 2
పల్లీలు : ఒక టేబుల్‌స్పూన్
శనగపప్పు : ఒక టేబుల్‌స్పూన్
మినప్పప్పు : ఒక టేబుల్‌స్పూన్
కరివేపాకు : ఒక రెమ్మ
నూనె : 3 టేబుల్‌స్పూన్స్
ఉప్పు : తగినంత
తయారీ :
స్టెప్ 1 : కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి.
స్టెప్ 2 : ఇందులోనే కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలుపాలి. దీంట్లో మామిడికాయ తురుము, కొబ్బరి తురుము వేయాలి.
స్టెప్ 3 : ఇవి బాగా వేగాక.. వండిన అన్నాన్ని ఇందులో వేసి సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు ఉంచాలి.
స్టెప్ 4 :ఈ అన్నాన్ని ప్లేట్‌లోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది.

మామిడికాయ చట్నీ


BOILED-RAW-MANGO-CHUTNEY
కావాల్సినవి :
మామిడికాయలు : 2ఉల్లిగడ్డ : 1
పచ్చిమిర్చి : 3
వెల్లుల్లిపాయలు : 5
కొత్తిమీర : చిన్న కట్ట
జీలకర్ర : ఒక టీస్పూన్
ఉప్పు : తగినంత
తయారీ :
స్టెప్ 1 : గిన్నెలో నీళ్లు పోసి మామిడికాయలను అందులో వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.
స్టెప్ 2 :ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
స్టెప్ 3 :ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసి ముక్కలు చేసుకోవాలి. వీటిని, ఉడికించిన అన్నిటినీ కలుపాలి. చివరగా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
స్టెప్ 4 :వీలైతే పోపు వేసి ఈ పచ్చడిని లాగించొచ్చు. చపాతీల్లోకి ఈ పచ్చడి వేసుకుంటే బాగుంటుంది.
సంజయ్ తుమ్మ సెలబ్రిటీ చెఫ్

868
Tags

More News

మరిన్ని వార్తలు...