మధుమేహంతో కిడ్నీకి ప్రమాదమా?


Fri,November 16, 2018 11:05 PM

నా వయసు 48 సంవత్సరాలు. పన్నెండేండ్లుగా నాకు షుగర్ వ్యాధి ఉంది. నేను ఉద్యోగ రీత్యా కొన్నిసార్లు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే సుదీర్ఘ ప్రయాణం చేసినప్పుడల్లా నా కాళ్లకు వాపులు వస్తున్నాయి. రక్త పరీక్ష చేయించగా క్రిమాటిన్ 10 మిల్లీగ్రాములు, యూరియా 28 మిల్లీగ్రాములు ఉన్నట్లు తేలింది. మూత్ర పరీక్షలో ప్రొటీన్ 3+ అని తేలింది. ఈ రకమైన మధుమేహ వ్యాధి వల్ల కిడ్నీలకు ప్రమాదమని అంటున్నారు తెలిసినవాళ్లు. ఇది నిజమేనా? షుగర్ వ్యాధితో ప్రాణాపాయం ఉందా? ఎలాంటి చికిత్స చేయించుకోవాలి? తెలియజేయగలరు.
- ఆర్. చక్రధర్, కూకట్‌పల్లి

Councelling
చక్రధర్ గారూ.. ముందు మీరు ఆందోళన తగ్గించుకోండి. వ్యాధి తీవ్రతను బట్టి దాని ప్రభావం గురించి చెప్పొచ్చు. ప్రాణాంతకం అంటూ ఏదీ ఉండదు. ప్రతిదానికీ పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మీరు దిగులును పక్కనబెట్టి వ్యాధి నియంత్రణ గురించి ఆలోచించండి. ఇక మీరు తెలిపిన రిపోర్టు ప్రకారం మీకు యూరిన్‌లో ప్రొటీన్ అధికంగా ఉంది. ఇది షుగర్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లమా (డయాబెటిక్ నెప్రోపతి) లేక ఇతర కారణాల వల్ల వచ్చే ప్రాబ్లమా తెలుసుకోవాలి. కాబట్టి మీరు కంటి డాక్టర్ దగ్గర రెటీనా పరీక్ష చేయించుకోండి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతిన్నట్లయితే (డయాబెటిక్ రెటినోపతి) యూరిన్‌లో అధికంగా ప్రొటీన్ పోవడానికి కూడా షుగర్ కారణం అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు కిడ్నీ దెబ్బతినే ప్రమాదమూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవడం మీరు ముందుగా చేయాల్సిన పని. తినకముందు 110 మిల్లీగ్రాము లోపు.. తిన్న తర్వాత 160 మిల్లీగ్రామం లోపు ఉండేట్లు చూసుకోవాలి. బీపీ 115/75 లోపల ఉండేట్లు చూసుకోవాలి. ఇవి కాకుండా ఉప్పు తినే శాతం తగ్గించుకోవాలి. పొగతాగడం.. ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాల్సిందే. పెయిన్ కిల్లర్ మందులను వాడాల్సి వస్తే మాత్రం డాక్టర్ సలహా మేరకు వాడాలి తప్ప.. సొంత ప్రయోగాలు చేయకూడదు. ఇవన్నీ చేస్తూ డాక్టర్ చెప్పిన డైట్ పాటించి.. వ్యాయామం చేయండి మీకు మీ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి. ఆల్ ది బెస్ట్!
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles