మట్టిపాత్రలో.. మధుర రుచులు!


Thu,September 6, 2018 01:16 AM

వానొచ్చినప్పుడు తొలకరి పడితే వచ్చే మట్టి వాసన భలే కమ్మగా ఉంటుంది. అంతెందుకు, ఎండాకాలంలో కొత్త కుండలో నీళ్లు తాగుతుంటే మరిన్ని తాగాలనిపిస్తుంది. మన తాతల తరమంతా మట్టిపాత్రల్లోనే వండుకున్నారు కదా! మట్టిలోని మాధుర్యాన్ని, మట్టిపాత్రల్లోని వంట కమ్మదనాన్ని మీకు రుచి చూపించాలనే.. ఈ వారం మట్టిపాత్రలో వండిన మధురమైన రుచులను మీకందిస్తున్నాం.. ఆస్వాదించండి!

చింతకాయ చేపల పులుసు

fish-pulusu

కావాల్సినవి :

చేపలు : 300 గ్రా.
చింతపండు : నిమ్మకాయ సైజు
పచ్చిమిరపకాయలు : 8
కొత్తిమీర : ఒక కట్ట
వెల్లుల్లి రెబ్బలు : 10
అల్లం ముద్ద : 1 1/2 టీస్పూన్
పసుపు : పావు టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు
వెన్న : 2 టీస్పూన్స్
జీలకర్ర : అర టీస్పూన్
నూనె : 2 టేబుల్‌స్పూన్స్
ఉప్పు : తగినంత.

తయారీ :

ముందుగా చింతపండు నానెయ్యాలి. చేప ముక్కలు శుభ్రం చేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. మట్టిపాత్ర పెట్టి కాస్త వేడెక్కాక నూనె పోసి దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక.. పసుపు, ఉప్పు వేసి కలుపాలి. ఆ తర్వాత అల్లం ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు కలుపాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టాలి. ఈ రసాన్ని మగ్గిన చేపముక్కల కూరలో పోసి ఉడికేంత వరకు సన్నని మంటపై ఉంచాలి. ఇందులో వెన్న, ఉప్పు, కారం వేసి దించేయాలి. పై నుంచి కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేస్తే ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ తింటారు.

పులిహోర కోడి పులావ్

pulihora-kodipulav

కావాల్సినవి :

స్మతీరైస్ : పావు కేజీ, చికెన్ : 300 గ్రా., నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, చింతపండు : నిమ్మకాయ సైజు, పచ్చిమిర్చి : 6, పసుపు : పావు టీస్పూన్, యాలకులు : 4, లవంగాలు : 4, దాల్చినచెక్క : చిన్న ముక్క, పుదీనా : అరకట్ట, కొత్తిమీర : అరకట్ట, కరివేపాకు : 2 రెమ్మలు, ఉల్లిగడ్డలు : 2, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 1/2 టీస్పూన్, జీడిపప్పులు : అరకప్పు, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత.

తయారీ :

దుగా చింతపండు నానబెట్టాలి. బియ్యం కడిగి పెట్టుకోవాలి. మట్టికుండ పెట్టి దాంట్లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగాక.. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి కాసేపు వేగనివ్వాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి వేసి కలుపాలి. ఆ తర్వాత చికెన్ వేసి మగ్గనివ్వాలి. అప్పుడు చింతపండు పులుసు పోసి కాసేపు ఉడుకనివ్వాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి ఎసరులా పెట్టుకోవాలి. దీంట్లో కడిగి ఉంచిన బియ్యాన్ని వేయాలి. ఉప్పు, కారం, పులుపు సరిచూసుకొని కొత్తిమీర, పుదీనా వేసి సన్నని మంట మీద పెట్టి మూతపెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ పులావ్‌ని పెరుగుతో కలిపి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

వంకాయ రొయ్యల ఇగురు

vankaya-royyalu

కావాల్సినవి :

వంకాయలు : 4, రొయ్యలు : 200 గ్రా., పచ్చిమిరపకాయలు : 6, ఉల్లి పేస్ట్ : ఒక కప్పు, గరం మసాలా : అర టీస్పూన్, కొత్తిమీర : ఒక కట్ట, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 1/2 టీస్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, కరివేపాకు : 2 రెమ్మలు, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు, కారం : తగినంత.

తయారీ :

రొయ్యల పొట్టు తీసి కడిగి పెట్టుకోవాలి. వంకాయలను నాలుగు ముక్కలు కోసి ఉప్పు నీళ్లల్లో వేసుకోవాలి. ఇప్పుడు మట్టిపాత్ర పెట్టి.. నూనె పోయాలి. అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి దోరగా వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఆగి వంకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు వేసి కలిపి సన్నని మంటమీద మూత పెట్టి ఉడుకనివ్వాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత కారం, గరం మసాలా వేసి కొంచెం నీరు పోసి మూత పెట్టేయాలి. ఐదు నిమిషాలు ఉంచి దించేస్తే సరి. అన్నంతో వడ్డిస్తే అదుర్స్ అంటారు.

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్‌లైన్, సికింద్రాబాద్

1083
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles