భావితరాల కోసం!


Sat,September 15, 2018 11:30 PM

ప్లాస్టిక్, కాలుష్యం, చెత్త కారణంగా చెరువులు, సరస్సులు, నదులు సముద్రాలన్నీ కలుషితం అవుతున్నాయి. తాగునీరు కరువయ్యే రోజులు వస్తున్నాయి. ఆ ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన ఈ చిన్నారులు నీటిలోని కాలుష్య శాతాన్ని తెలిపి, మురికి నీటిని శుభ్రపరిచి, తిరిగి వాడుకునే విధానాన్ని కనుగొన్నారు. భావితరాలకు నీటి కొరత రాకుండా చూసేందుకు తమవంతు ప్రయోగాలు చేసి, విజయవంతం అయ్యారు.
plastic
భూమ్మీద చాలా నీరు ఉంది. కానీ, తాగడానికి, ఇంట్లో అవసరాలకి మాత్రం నీటి కొరత ఎప్పుడూ ఉంటుంది. చెరువులు, సరస్సుల్లోని నీరు కాలుష్యం కారణంగా వాడుకోవడానికి వీలు లేకుండా పోతున్నది. గ్రామాలు, పట్టణాల్లోని చాలామందికి నీరు దొరక్క కలుషిత నీటిని వాడుతూ రోగాల భారిన పడుతున్నారు. సరస్సులు అధికంగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. మంచినీటి సరస్సులు కాలుష్యంతో నిండిపోవడంతో బెంగళూర్‌కు చెందిన ఈ విద్యార్థులు.. నీటిని శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నో ప్రయోగాలు, మరెన్నో అధ్యయనాలు చేసి నీటిలో కాలుష్య శాతాన్ని తెలిపే యంత్రాన్ని కనుగొన్నారు.

ఆలోచన వచ్చింది ఇలా..!


బెంగళూర్‌కు చెందిన ప్రణవ్ శికర్‌పూర్, సిద్ధార్థ్ విశ్వనాథ్‌లు స్కూల్ స్టూడెంట్స్. ఒకరోజు సరస్సులో ఆడుకోవడానికి వెళ్లి అక్కడున్న నీటిని బాగా గమనించారు. ఆ నీరు బాగా కలుషితమైపోయి, మురికిగా ఉండడంతో ఆ ఆలోచన విరమించుకొని, ఉపాధ్యాయులను సంప్రదించారు. వారి సూచనల మేరకు నీటిలో కాలుష్య శాతాన్ని తెలిపే యంత్రాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు. దాని ద్వారా నీటి కాలుష్య శాతాన్ని తెలుసుకొని, నీటిని శుద్ధి చేసి, అవసరాలకు వాడుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చని ముందడుగు వేశారు. ఇందుకు పలు పాఠశాలల్లో జరిగే సైన్స్ ఫెయిర్స్‌లో పాల్గొని, అక్కడి విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రయోగాలు పరిశీలించారు. చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండే పరికరాన్ని కనుగొనాలని ఫ్లోబోట్ 2.0కు రూపకల్పన చేశారు.

కచ్చితమైన ఫలితాలు..


ఫ్లోబోట్ 2.0 అనేది వాటర్ క్వాలిటీ మానిటరింగ్ డివైజ్. దీని ద్వారా కలుషిత నీరు ప్రమాద స్థాయిలను అప్పటికప్పుడే తెలుసుకోవచ్చు. ల్యాబ్‌ల చుట్టూ తిరగకుండా, రిపోర్టులు వచ్చే వరకూ ఆగకుండా దీని ద్వారా నీటిలో ఎంత శాతం కాలుష్యం ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ఇలాంటి పరికరాన్నే రూ.30 లక్షలతో రూపొందించింది. ఆదేమో ఒక గది అంత పెద్దగా ఉంటుంది. కానీ, మన విద్యార్థులు తయారు చేసిన ఈ పరికరం అంతే కచ్చితమైన ఫలితాలను ఎలాంటి శ్రమ లేకుండా అందిస్తుంది. దీనిని ఒక సరస్సులో తిప్పడం వల్ల దానిలో ఎంత కాలుష్యం ఉన్నదీ, దాని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అంచనా వేసి వెంటనే చెప్పేస్తుంది. బెంగళూర్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పట్టెంహల్లి, అలాహల్లి, చుంచుఘట్ట, హులిమవు, కగ్గడస్పుర సరస్సుల్లో దీని ద్వారా మంచి ఫలితాలు రాబట్టారు. ఈ విద్యార్థుల విశేష కృషికి గానూ ఈ ఏడాది మేలో ప్రఖ్యాత అశోక యూత్ వెంచర్ అవార్డు వరించింది. వారికి మన తరపున కృతజ్ఞతలు తెలుపుదాం.
plastic1

రూ.15వేలతో డివైజ్ తయారీ!


ఫ్లోబోట్ 2.0ను తయారు చేసేందుకు ఈ విద్యారులిద్దరూ ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు చేశారు. సందేహాలు వచ్చినప్పుడల్లా ఉపాధ్యాయుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగారు. మొత్తంగా ప్రయోగానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని కేవలం 15వేల రూపాయలతో ఫ్లోబోట్ 2.0 డివైజ్‌ను రూపొందించారు. దానిని దగ్గర్లోని సరస్సుల్లో ప్రయోగించి త్వరితగతిన ఫలితాలు రాబట్టారు. దానిని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ టీవీ రామచంద్ర ముందు ప్రయోగించారు. ఆయన వారిని అభినందించి, పలు సూచనలు చేయడంతో స్మార్టెస్ట్ ఫ్లోబోట్‌ను లక్షన్నర విరాళాలు సేకరించి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రూపొందించారు.

928
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles