బేబీ ఫుట్‌బాల్ లీగ్


Sat,July 21, 2018 11:33 PM

ఫుట్‌బాల్ ఆడే పిల్లలకు శుభవార్త. పెద్దలకు క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్, ఫుట్‌బాల్, కబడ్డీ, హాకీ క్రీడలకు పలు లీగ్‌లు ఉన్నట్లే.. మీ కోసం కూడా బేబీ ఫుట్‌బాల్ లీగ్ ఒకటి ఉన్నది. ఈ లీగ్ మేఘాలయలో గత సోమవారమే ప్రారంభమైంది. పిల్లల్లోని ప్రతిభను వెలికితీసే ఈ విశేషకార్యాన్ని అక్కడి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ లీగ్ నిబంధనలు, ప్రత్యేకతలు, లక్ష్యాలు ఏంటో తెలుసుకుందామా?
baby-football
ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫీవర్ ఇంకా ప్రపంచాన్ని ఊపేస్తూనే ఉన్నది. అయితే మన దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా.. ఇండియా జట్టు కనీసం అర్హత కూడా సాధించలేదు. దీంతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్ ప్రాతినిధ్యమే లక్ష్యంగా మేఘాలయలో ఓ చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే మేఘాలయ బేబీ లీగ్. ఇది చిన్నారుల ఫుట్‌బాల్ లీగ్. మొక్కై వంగనిదే మానై వంగునా అనే నానుడిని నిజం చేస్తూ.. చిన్నతనంలో పిల్లలకు ఫుట్‌బాల్ పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ లీగ్ షిల్లాంగ్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గత సోమవారం ప్రారంభమైంది.


4 నుంచి 13 యేండ్ల వారు అర్హులు!

ఈ మహత్తర కార్యక్రమంలో చిన్నారులను భాగస్వామ్యం చేస్తూ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయాన్ని ఎంతోమంది స్వాగతిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పిల్లల వయసును అధికారికంగా ప్రకటించారు. 4 నుంచి 13 యేండ్ల మధ్య వయసున్న పిల్లలు ఈ లీగ్ ఆడేందుకు అర్హులు. లీగ్‌లో ప్లేయర్లను వయసుల వారీగా ఎంపిక చేశారు. 4 నుంచి 12 యేండ్ల వయసున్న వారికి మ్యాచ్ సమయం 10 నిమిషాలు ఉంటుంది. 13 యేండ్లు ఉన్నవారికి మ్యాచ్ 25 నిమిషాలు ఉంటుంది. ఒక్కో జట్టు దాదాపు 40 మ్యాచ్‌ల వరకూ ఆడాల్సి ఉంటుంది.


baby-football2

సెలవు రోజుల్లో మ్యాచ్‌లు

పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం, సెలవు రోజుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముద్దులొలికే చిన్నారులు రంగు రంగుల జెర్సీలు ధరించి మ్యాచ్‌లలో సందడి చేస్తున్నారు. చిన్నవారే అయినా క్రీడాస్ఫూర్తితో తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు పిల్లల తల్లిదండ్రులతో పాటు పలువురు పిల్లలు, పెద్దలూ ఆసక్తి చూపుతున్నారు. స్టేడియంలో రేసుగుర్రాల్లా పరుగెడుతూ.. బాల్ కోసం పోటీ పడుతున్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.


అధికారంగానే పోటీలు!

భావితరాన్ని, ఇండియా ఫుట్‌బాల్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ పోటీలను అధికారికంగానే నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను నిర్వహించాలని మేఘాలయ స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మొదట ఆలోచన చేసింది. ఈ నిర్ణయాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు తెలుపడంతో వారు ఆమోదించి, సహకారాన్ని అందించారు. ఆర్థిక సహాయ సహకారాలు అందించేందుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. వీరే కాకుండా స్థానికంగా ఉండే పలు ఫుట్‌బాల్ క్లబ్‌లు వారికి చేతనైన సహాయం చేస్తున్నాయి. అయితే, ఈ లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన బాల బాలికలను ఎంపిక చేసి, వారికి మెరుగైన శిక్షణ ఇప్పించి, పలు కేటగిరీల్లో దేశం తరఫున ఆడించనున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని, క్రీడాస్ఫూర్తిని అలవాటు చేస్తున్నారు.


baby-football3

మట్టిలో మాణిక్యాల కోసం!

ఈ బేబీ లీగ్ ప్రధాన ఉద్దేశాల్లో కిందిస్థాయిలో క్రీడాకారులను ఎంపిక చేసి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం ఒకటని మేఘాలయ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎంఎఫ్‌ఏ) సీఈఓ అర్కీ నన్‌గ్రమ్ అంటున్నారు. భవిష్యత్‌లో దేశం తరఫున ఆడేందుకు ఈ లీగ్ మంచి వేదిక అని అర్కీ అంటున్నారు. మీరు ప్రతిరోజూ శిక్షణ తీసుకుంటే.. మీతో ఎవ్వరూ పోటీ పడలేరని, ఫుట్‌బాల్‌లో బాగా రాణించి దేశం పేరు నిలబెట్టాలని ఈ బాల క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగుల్చుతున్నారు. మేఘాలయ స్ఫూర్తితో త్వరలోనే బెంగళూరు, ఒడిశాల్లో కూడా ఇలాంటి బేబీ ఫుట్‌బాల్ లీగ్‌లను ప్రారంభించనున్నారు.


ఈ లీగ్ నియమ నిబంధనలు కూడా చాలా కచ్చితంగానే ఉన్నాయి. మహిళా ఫుట్‌బాల్ జట్టు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బాలికలకు ప్రాధాన్యం ఇచ్చారు. వారిని కూడా ఫుట్‌బాల్‌లో ప్రోత్సహించేందుకు లీగ్ మొత్తంలో 10 శాతం బాలికలు ఉండాలని నిబంధన పెట్టారు. అంతేకాకుండా లింగ వివక్షను రూపుమాపేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పోటీల్లో పాల్గొనేందుకు చాలామంది బాలికలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ముందే అనుకున్నట్లుగానే లీగ్ మొత్తంలో 10 శాతం బాలికలు ఉండేలా జట్లను సిద్ధం చేశారు.
- రవికుమార్ తోటపల్లి

286
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles