బెర్లిన్ భాటలో భాగ్యనగరం


Sat,August 11, 2018 01:15 AM

ఆకాశాన్నంటే టవర్లు.. అద్దంలా మెరిసే రహదారులు.. నగరమంతటా పచ్చటి తోరణాలు.. స్పీడుగా దూసుకెళ్లే మెట్రో రైలు.. రయ్‌మంటూ వెళుతూ ఆహ్లాదాన్నిచ్చే ప్రభుత్వ బస్సులు.. రోడ్డు మీదే అద్దెకు సైకిళ్లు.. వాక్ టు వర్క్ కాన్సెప్టు.. జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులోహైదరాబాద్ ఇదేవిధంగా సాక్షాత్కరించే అవకాశముందని రాష్ట్రానికి చెందిన బిల్డర్లు, డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.
berlicn-city
విశ్వనగరాలనేవి రాత్రికి రాత్రే ఏర్పాటు కావు. అవి అభివృద్ధి చెందాలంటే కొన్నేళ్లు పడుతుంది. తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రణాళికాబద్ధంగా అడుగులు ముందుకేస్తేనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్ నగరాన్ని చూస్తే.. భవిష్యత్తులో మన నగరాన్ని తలపిస్తుందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం నగర రహదారులను వెడల్పు చేయడమే కాకుండా సుందరీకరణ చేస్తున్నది. ఆకాశహర్మ్యాలు, అండర్‌పాస్‌లను అందుబాటులోకి తెస్తున్నది. హరితహారం మీద అధిక దృష్టి సారిస్తున్నది. ఫలితంగా, బెర్లిన్‌లో ఉన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరుగుతున్నది. అక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులో ఉన్నది. మన మెట్రో కూడా రెండేండ్లలోపు పూర్తయ్యే అవకాశమున్నది. నగరం నలువైపులా మెట్రో రైలును విస్తరిస్తున్నది. బెర్లిన్ తరహాలో విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నది.
berlin-city1
బెర్లిన్ నగరంలో ప్రధాన రహదారుల మీద సైకిళ్లను విరివిగా వినియోగిస్తున్నారు. వాక్ టు వర్క్ కాన్సెప్టు గణనీయంగా వృద్ధి చెందింది. మన వద్ద మెట్రో రైల్వే స్టేషన్ల చేరువలో సైకిళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మెట్రో స్టేషన్లలోనే వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్స్ థియేటర్లను అభివృద్ధి చేస్తున్నది. రానున్న రోజుల్లో నాగోలు, ఉప్పల్, మియాపూర్ వంటి మెట్రో స్టేషన్లలో ఐటీ భవనాలు, హోటళ్లు వంటివి ఏర్పాటు చేయడానికి మెట్రో రైల్ ప్రణాళికల్ని రచించింది. బెర్లిన్ తరహాలో ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. భాగ్యనగరంలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగవుతుంది. వాక్ టు వర్క్ కాన్సెప్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టౌన్‌షిప్పులను అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.
pradeep

బెర్లిన్.. భవిష్యత్తు హైదరాబాద్!

ప్రతి నగరానికో ప్రత్యేకత ఉన్నట్లే.. బెర్లిన్‌లో గ్రీన్ కవర్ మెరుగ్గా ఉన్నది. ఈ నగరంలో దాదాపు 4.50 లక్షల చెట్లు ఉన్నాయని తెలిసింది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హరితహారం మీద అధిక దృష్టి పెడుతున్నది. ఈ ఫలితాలు భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి. బెర్లిన్‌లో 60 శాతం ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థ మీదే ఆధారపడుతున్నారు. దాదాపు వందేండ్ల క్రితమే ఇక్కడ మెట్రో రైలు వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మన వద్ద కూడా మొదట మూడు మార్గాలు, ఆతర్వాత నగరం చుట్టూ మెట్రోను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని రచించింది.

-బెర్లిన్‌లో స్థానికులు సైకిళ్లను విరివిగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ప్రజల ఆలోచనలో క్రమక్రమంగా మార్పు వస్తున్నది. ప్రధానంగా, ఐటీ సంస్థల ఉద్యోగులు మెట్రో, ఎంఎంటీఎస్‌ను ఎక్కువగా వాడుతున్నారు. వీరి సంఖ్య పెరగాలంటే, ఐటీ కంపెనీలతో మాట్లాడి.. ప్రజారవాణాను వినియోగించే వారికి ప్రభుత్వం మొదట్లో కొన్ని ప్రోత్సాహకాల్ని ప్రకటించాలి. మెట్రో రైలు దిగిన వెంటనే షటిల్ బస్సు సేవలను ప్రారంభించాలి. ఈ అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నది. ఫ్లయ్‌ఓవర్లు, అండర్‌పాస్‌లను అభివృద్ధి చేస్తున్నది. బెర్లిన్ సిటీలో వాక్ టు వర్క్ కాన్సెప్టు విశేషంగా అభివృద్ధి చెందింది. మన వద్ద కూడా ఈ తరహా టౌన్‌షిప్పులకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది.
-2019లోపు మిషన్ భగీరథ పూర్తి కాగానే.. తెలంగాణ ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. హైదరాబాద్‌ని విశ్వనగరం చేసేందుకు గల అవకాశాలన్నింటినీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.
- ప్రదీప్‌రెడ్డి, ఎండీ, ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్

jakka-venkat

క్రెడాయ్ తెలంగాణకు గొప్ప అవకాశం

ప్రస్తుతం బెర్లిన్‌ని చూస్తే భవిష్యత్తులో భాగ్యనగరం కూడా ఇదేవిధంగా రూపాంతరం చెందుతుందనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశ్వనగరాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నాం. బెర్లిన్‌లో కాలుష్యమనేది లేనే లేదు. ఎక్కడ చూసినా భారీ చెట్లు ఉండటమే కారణం. అక్కడి ప్రజలు ప్రణాళికాబద్ధమైన జీవనానికి అలవాటుపడ్డారు. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు కాకుండా.. బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా సీసీ టీవీ కెమెరాలే కనిపించాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద హడావిడి లేనే లేదు. ప్రజారవాణా వ్యవస్థను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. ప్రతి వీధిలో ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రం ఉంది. రోడ్డు పక్కన షాపింగ్ చేసేవారు.. రోడ్ల మీద నిర్థారిత ప్రాంతంలో కార్లను నిలుపుకోవడం, స్వయంగా వెళ్లి పార్కింగ్ టికెట్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. క్రెడాయ్ నాట్‌కాన్ సదస్సులు ఎప్పుడూ విదేశాల్లోనే జరుగుతుంటాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది దేశాల్లో నాట్‌కాన్‌లు జరిగాయి. వాటిని మన దేశానికి చెందిన ఏదో ఒక స్థానిక క్రెడాయ్ సంఘం నిర్వహిస్తుంటుంది. వచ్చే ఏడాది నాట్‌కాన్‌ను నిర్వహించే అవకాశం క్రెడాయ్ తెలంగాణకు లభించింది. ఇందుకు క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ కూడా సహకరిస్తుంది. ఏ దేశంలో సదస్సును నిర్వహించాలనే విషయంలో కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటాం.
- గుమ్మి రాంరెడ్డి, అధ్యక్షుడు, క్రెడాయ్ తెలంగాణ
gummi-ramreddy

మనతో పోల్చితే అద్దెలూ ఎక్కువే

బెర్లిన్‌లో కాలుష్యమనేది ఎక్కడా కనిపించలేదు. అద్దెల విషయానికి వస్తే.. పలు ప్రాంతాల్లో ఫుల్లీ ఫర్నీచర్డ్ స్టూడియో అపార్టుమెంట్ కోసం 300 యూరోలను పెట్టుకోవాల్సి ఉంటుంది. డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ కోసం 500 యూరోల దాకా ఖర్చు అవుతుంది. లొకేషన్‌ను బట్టి అద్దెలు మారుతాయి. కొత్తగా డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లను కొనడానికి లక్షన్నర యూరోలైనా చేతిలో పట్టుకోవాలి. ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. వాణిజ్య సముదాయాల అద్దెలు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి. చదరపు అడుక్కీ ఎంత లేదన్నా రూ.250 దాకా ఉంది. మన గచ్చిబౌలిలో చ.అ.కీ. రూ.60 పెడితే.. మంచి వాణిజ్య సముదాయంలో కమర్షియల్ స్పేస్ లభిస్తుంది.
క్రెడాయ్ నాట్‌కాన్ సదస్సు వల్ల డెవలపర్లలో సరికొత్త స్ఫూర్తి కలుగుతుంది. కొత్త విషయాలు, ఆధునిక పరిజ్ఞానం, నిర్మాణ రంగంలో విజయగాథలు, చేయకూడని పొరపాట్లు.. ఇలా ప్రతి ఒక్క విషయం నేర్చుకోవడానికి వీలుంటుంది. ఇతరుల నుంచి స్ఫూర్తి పొందేందుకు దోహదపడుతుంది. బెర్లిన్‌ని చూస్తుంటే భవిష్యత్తులో మన భాగ్యనగరం కూడా ఇంచుమించు ఇదేవిధంగా అభివృద్ధి చెందే వీలుంది. ప్రభుత్వం రోడ్ల మీద వైర్లు వంటివి కనిపించకుండా, ఎక్కడికక్కడ డక్టులను ఏర్పాటు చేస్తున్నది. ఎస్సార్డీపీలో భాగంగా రహదారులను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నది.
- జక్కా వెంకట్‌రెడ్డి, ఎండీ, ఏవీ కన్‌స్ట్రక్షన్స్

902
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles