బాలి చూడాలి!


Thu,July 5, 2018 11:31 PM

పరవళింపజేసే ప్రాంతాలు ఇవే!
సెలవులుంటాయి కాబట్టి విహారయాత్రలకు ఎక్కువగా వేసవిని ఎంచుకుంటారు అని చాలామంది అనుకుంటారు. కానీ వర్షాలు పడుతున్న సమయంలోనూ విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు విదేశీయులు. ఇప్పుడు భారతీయులు కూడా ఈ జాబితాలో చేరారని ఓ నివేదిక చెబుతున్నది. జూలై, ఆగస్టులలో విహారయాత్రలకు వెళ్లేందుకు ఏయే ప్రదేశాలు బాగుంటాయనే అంశాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తూ బుకింగ్‌లు చేస్తున్నారని హోటల్స్ డాట్‌కామ్ పేర్కొంటున్నది. దేశీయంగా గోవా, అంతర్జాతీయంగా బాలి వెళ్లేందుకు ఎక్కువమంది భారతీయులు ఇష్టపడుతున్నారని, ఆయా ప్రాంతాల్లో హోటల్ వసతి కోసం శోధిస్తున్నారని ఆ పోర్టల్ వివరించింది. ఈ నేపథ్యంలో బాలిలో విహరించాలనుకునేవారి కోసం.. అక్కడ తప్పక చూడాల్సిన ఆరు ప్రదేశాల వివరాలు.
bali
బాలి ద్వీపం విశేషం ఏంటంటే.. 90 శాతం ముస్లింలు ఉన్న ఇండోనేషియాలో ఉన్న ఈ ద్వీపంలో మాత్రం 90 శాతం హిందువులే ఉంటారు. అడుగడుగునా హిందువుల గుళ్లు కనిపిస్తాయి. అగరుబత్తీల ఘుమఘుమలు, నిత్యం వెలిగే దీపాలు, బాదం ఆకులతో చేసిన దొప్పల్లో ప్రసాదాలు బాలి ద్వీపంలో వీధివీధినా కనిపిస్తూ సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతినికలిగిస్తాయి. అందుకే బాలి ద్వీపాన్ని దేవుళ్ల ద్వీపం అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత మాత్రమే కాదండోయ్.. సాహసక్రీడలు, క్లబ్బులు, పబ్బులు, ఆయుర్వేద కేంద్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, నోరూరించే రుచులు మిమ్మల్ని కొత్తలోకానికి తీసుకెళ్తాయి. 45 లక్షల జనాభా ఉండే బాలి ద్వీపానికి ఏటా వచ్చే సందర్శకుల సంఖ్య ఆ ద్వీప జనాభా కంటే రెండింతలు ఎక్కువ ఉంటుందట. కుటుంబంతో, స్నేహితులతో, ఆప్తులతో వెళ్లి ఆనందించగల ఈ పర్యాటక ప్రాంతవాసులు అతిథులను దైవసమానులుగా చూస్తారు. వారి ఆచారాలు, విశ్వాసాలను గౌరవిస్తే.. వారి ఇంట్లోనే ఆతిథ్యమిస్తారు. స్థానిక రుచులను పరిచయం చేస్తూ, గౌరవ మర్యాదలతో మైమరిపింపజేస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు బాలి ద్వీపానికి క్యూ కడుతుంటారు. నాలుగైదు రోజులు అక్కడ గడిపి నూతన ఉత్తేజంతో తిరిగి స్వస్థలాలకు చేరుకుంటారు.

Uluwatu_Temple

ఉలవటు ఆలయం

విష్ణుమూర్తి కొలువు దీరిన ఈ ఆలయం.. సముద్రం అంచులో ఉన్న పర్వత శిఖరంపై ఉంటుంది. డెన్పసార్ అనే ప్రాంతం నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సముద్రాన్ని చీల్చుతూ పొడుచుకు వచ్చినట్టుగా ఉండే రెండు పచ్చని పర్వతాల్లో ఒకదాని మీద ఈ ఆలయం నిర్మించారు. ఆలయ ప్రాంగణంలోని కుంభకర్ణుడి భారీ విగ్రహం ఆకట్టుకుంటుంది. ఇక్కడ ప్రతిరోజూ రామాయణాన్ని నృత్యరూపంలో ప్రదర్శిస్తారు. సాయంత్రం సమయంలో ఉలవటు సమీపంలో గడిపితే ఆ అనుభూతిని జీవితాంతం గుర్తు పెట్టుకోవచ్చు.

ubud-monkey-forest-in-bali

కోతుల సంరక్షణ కేంద్రం

బాలిలో ఉబుడ్ సమీపాన ఈ వానర సంరక్షణ కేంద్రం ఉంది. సఫారీలో తిరుగుతూ కోతులు చేసే చిలిపి చేష్టలను చూడొచ్చు. పర్యాటకుల చేతిలో ఉన్న వస్తువులు లాక్కెళ్లిపోతాయి కూడా. ఏదైనా తినుబండారాలు ఇస్తున్నప్పుడు చేసే కోతి చేష్టలు నవ్వు తెప్పిస్తాయి.

besakih

వానదేవుడి గుడి

డెన్పసార్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో తనహ్‌లాట్ ఆలయం ఉంది. సముద్రం అంచున ఉండే ఈ గుడి వానదేవుడిది. అలలు ఆలయ ప్రధాన ద్వారం వరకు వస్తాయి. కానీ నీళ్లు మాత్రం ఆలయం లోపలికి రావు.

Goa-Gajah-Elephant-Cave

ఏనుగు గుహ

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గుహలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. గుహ ప్రవేశ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది. లోపలికి వెళ్లాక విశాలంగా ఉంటుంది. ఇక్కడ కొలనులు, కొన్ని ఆలయాలు ఉంటాయి. గుట్టల మీద నుంచి చుట్టూ ఉన్న గ్రామాలను చూస్తే ముచ్చటగా ఉంటాయి. గుట్టలను మడులుగా చేసి వరి పండించే విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

కింటామణి, బాటూర్ అగ్నిపర్వతాలు

బాలీలోని కరంగసెమ్ రీజెన్సీలో ఉన్న రెండు ప్రాంతాలు తప్పకుండాచూడాల్సినవి. అవి కింటామణి, బాటూర్ అగ్నిపర్వతాలు. 1800 సంవత్సరం నుంచి ఇప్పటివరకు బాటూర్ అగ్నిపర్వతం 24సార్లు పేలింది. ఇక కింటామణి పర్వతం మీద పెంచే వెదురు చెట్ల సొగసు చూడతరం కాదు. అక్కడి నుంచే బాలి ప్రజలు ఫర్నీచర్‌కు కావాల్సిన వెదురు సేకరిస్తారు.

అగుంగ్ పర్వత శ్రేణులు

ఈ పర్వతాల్లో పురబెసకి అనే ఆలయం ఉంది. ఇది మొత్తం 23 ఆలయాల సమూహం. అందుకే దీన్ని మదర్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. శివుడు, విష్ణువు, సరస్వతి తదితర దేవతల ఆలయాలు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారని అక్కడి చరిత్రకారులు చెబుతున్నారు.

సాహసాల అడ్డా

డెన్పసార్, ఉబుడ్ నగరాల్లో ఉండే రిసార్టులు విలాసవంతంగా ఉంటాయి. వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు గదులు అద్దెకు దొరుకుతాయి. దగ్గర్లోనే ఉండే సెమిన్యాక్, నూసాదువా, సానుర్ బీచ్‌లు వినోద కేంద్రాలు. సముద్ర తీరంలో ఆడే సాహసక్రీడలైతే లెక్కలేనన్ని ఉంటాయి. స్య్కూబా డైవింగ్, వాటర్ స్కేయింగ్, పారా సెయిలింగ్, బనానా రైడ్, సర్ఫింగ్, సముద్రంలో దూసుకెళ్లే బైక్ రైడింగ్ వంటి సాహసక్రీడలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయి.

ఎప్పుడు వెళ్లాలి?

బాలికి ఎప్పుడైనా వెళ్లవచ్చు. డిసెంబర్, జనవరిలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. కాబట్టి రిసార్టులు, హోటల్ గదుల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరిలలో ఇక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. ఈ సమయంలో చూడడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ.. పర్యటించడానికి వాతావరణం అంతగా అనుకూలించదు. జూలై, ఆగస్టులలో కూడా బాలిలో విహరిస్తే బావుంటుంది.

ఎలా వెళ్లాలి?

బాలి ద్వీపం వెళ్లాలంటే వీసా అవసరం లేదు. బాలీ రాజధాని అయిన డెన్పసార్‌లో దిగి అనుమతి తీసుకుని పర్యటించవచ్చు. కాకపోతే పాస్‌పోర్ట్‌లో కనీసం ఆరు నెలల గడువు ఉండాలి. హోటల్ బుకింగ్ వివరాలు, తిరుగు ప్రయాణం టిక్కెట్లు చూపించాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి డెన్పసార్‌కు విమానంలో వెళ్లవచ్చు. అక్కడికి వెళ్లిన తర్వాత సమీప ప్రాంతాల్లో విహరించడానికి అద్దెకు బైకులు, స్కూటర్లు దొరుకుతాయి.

ప్యాకేజీల వివరాలు

హైదరాబాద్ నుంచి ఒక్క టికెట్‌కి రూ. 11000 నుంచి 18 వేల వరకు ఉంటుంది. వేసవిలో ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు బాలి టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తుంటారు. ఈ ప్యాకేజీలో వెళ్తే బస, ఏర్పాట్లు, ఆహారం కూడా అందులోనే ఉంటాయి. ఆహారం ప్రత్యేకంగా కావాలంటే అందుకు విడిగా చార్జ్ చేస్తారు. ఈ ప్యాకేజీ ఒక్కొక్కరికి రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి

810
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles