బాబు డల్‌గా ఎందుకయ్యాడు?


Thu,April 20, 2017 12:03 AM

మా బాబు వయసు 19 ఏళ్లు. ఎప్పుడూ అల్లరిగా, చలాకీగా తిరిగేవాడు.. ఈ మధ్య చాలా డల్ అయిపోయాడు. ఏమైందంటే చెప్పడం లేదు. దేనికీ సరిగ్గా సమాధానం చెప్పడు. నాకే కోపం వస్తోంది. మనసులో ఉన్నది చెబితే కదా తెలిసేది. ఒకసారి సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాం. కొద్ది రోజులు బాగానే ఉన్నట్టనిపించాడు. కాని మళ్లీ మామూలే. ఒంటరిగా ఉంటున్నాడు. నిజంగానే మావాడికి సమస్యేమీ లేదా? ఇప్పుడేం చేయమంటారు?
వనజ, వరంగల్

canstock
మీ బాబులో డిప్రెషన్‌కి సంబంధించిన లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి చికిత్సకు వెళ్లినా మామూలవలేదంటే మీరు చికిత్స మొత్తం ఇప్పించి ఉండరు. లేకపోతే చికిత్సా విధానమైనా మార్చాల్సి ఉంటుంది. మరింత మెరుగైన విధానాలను ఎంచుకోవాలి. సాధారణంగా డిప్రెషన్‌కు గురైన వ్యక్తుల్లో సగం మంది ఆత్మహత్య భావాలను కలిగి ఉంటారు. వీరికి సైకాలజీ థెరపీలతో పాటు కొన్నిసార్లు మందులు కూడా అవసరం అవుతాయి. కొందరు ఎల్లప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు చాలా విచారంగా ఉంటారు. తమలో తాము ఆలోచిస్తూ, ఒంటరిగా గడిపే ప్రయత్నం చేస్తారు. తమకు తాము హాని చేసుకునే ఆలోచనతో ఉంటారు. అతడిని నిర్లక్ష్యం చేయకండి. మీరు మరింత ఓపికగా వ్యవహరించాలి. ప్రతిదానికీ విమర్శించకండి. ఒంటరిగా అసలు విడిచిపెట్టకండి. ఎవరో ఒకరు తనతో ఉండేందుకు ప్రయత్నించండి. ఏదో ఒక రకంగా తనతో గడపండి. ఎప్పుడూ తనపై ఓ కన్నేసి ఉంచండి. మరింత ప్రేమగా మాట్లాడండి. మరింత శ్రద్ధ పెట్టండి. తనకే సమస్య వచ్చినా మీరున్నారని అనిపించేలా వ్యవహరించండి. తనకు ఇష్టమైన చోటికి తీసుకెళ్లండి. అయితే ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా చూసుకోండి. బాత్రూమ్‌లు కడిగే వస్తువులు కూడా ఎక్కడున్నాయో తెలియకూడదు. అతడిని మీరెప్పుడూ కనిపెట్టుకుని ఉన్నట్టు తెలిసేలా వ్యవహరించండి. మీకు తెలియకుండా అతనేమీ చేయలేడనే నమ్మకం కలిగించండి. మీ కుటుంబ చరిత్రలో ఎవరైనా డిప్రెషన్‌కి లోనైన వాళ్లున్నా సులువుగా డిప్రెషన్‌కు గురవుతారు. బాబుకు మందులు కూడా అవసరం పడొచ్చు. కాబట్టి మీరు ఏదో ఒకరకంగా నచ్చజెప్పి మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లండి. రెగ్యులర్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పించండి. మీ బాబు తప్పకుండా నార్మల్ అవుతాడు.
డాక్టర్ కీర్తి రెడ్డి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
కేర్ హాస్పిటల్స్,
హైదరాబాద్.

455
Tags

More News

VIRAL NEWS