బంగారు చందన


Sat,October 6, 2018 11:08 PM

ఆ చిన్నారి పేరే చందన. కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించిన అంతర్జాతీయ యవనికపై తెలంగాణ పౌరుషాన్ని చాటింది. ఏషియన్ గేమ్స్‌లో పతకమే తన లక్ష్యమని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్న చిచ్చర పిడుగు పెండెం చందన గురించి..
pendem-chandana
పెండెం చందన మంచిర్యాల పట్టణం భగవంతం వాడకు చెందిన చిన్నారి. మిమ్స్ పాఠశాలలో చదువుతున్నది. చుట్టుపక్కల పిల్లలతో పాటు తనకు కరాటే క్లాస్‌లు చెప్పించాలని వాళ్ల అమ్మ, నాన్న తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్నే మలుపు తిప్పింది. ఆత్మరక్షణ కోసం నేర్పించిన ఆ కరాటే ఇప్పుడు ఆ చిన్నారి ప్రతిభను వెలికి తీసే పతకాలు సాధించే స్థాయికి తీసుకువచ్చింది. చందన తండ్రి సతీష్ ఆటో మెకానిక్. తల్లి శారద సాధారణ గృహిణి.


మలుపు తిప్పిన పోటీలు

చందన బెల్లంపల్లిలో కరాటే పోటీల్లో పాల్గొంటున్నప్పుడు కరాటే మాస్టర్ వేముల సతీష్ దృష్టిలో పడింది. ఆమె చురుకుదనం, ప్రతిభ గమనించిన ఆయన చందనను కిక్ బాక్సింగ్ వైపు మళ్లించారు. దీంతో చందన కిక్ బాక్సింగ్ మీద దృష్టి సారించింది. అందులో అద్భుత ప్రతిభను కనబరిచి పలు పతకాలు సాధించింది. చందన బరిలో దిగితే పతకం మనదే అనే స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చింది. కరాటేలో ఎంత నేర్పు, ఓర్పుగా పతకాలు తెచ్చిందో, కిక్‌బాక్సింగ్‌లో కూడా అన్ని పతకాలు సాధించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.


రెండు అంతర్జాతీయ స్వర్ణాలు

అదే ఊపులో గత నెల 13 నుంచి 25 వరకు ఇటలీలోని వెనిస్ నగరంలో జరిగిన కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది. మ్యూజికల్ పాయింట్ ఫైటింగ్‌తో పాటు, వెపన్ ఫామ్‌లో చందన ఈ పతకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది జాతీయ స్థాయి టోర్నమెంట్‌లలో కేవలం ఒక్కదాంట్లో మినహా అన్నింటిలో ఆమె పతకాలు సాధించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించడం మామూలు విషయం కాదంటున్నారు క్రీడా నిపుణులు. ఇంత చిన్న వయసులోనే రెండు అంతర్జాతీయ స్థాయి పతకాలు తెచ్చిందంటే.. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతుందని వారంటున్నారు.


pendem-chandana2

ఆసియా క్రీడలే లక్ష్యం

అంతర్జాతీయ వేదికల్లో పతకాలు సాధించిన పెండెం చందన ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే లక్ష్యమని ముద్దుముద్దుగా చెబుతున్నది. ఆ క్రీడలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కాబట్టి తనను ఆ దిశగా తీర్చిదిద్దుతామని కోచ్ వేముల సతీష్ చెబుతున్నారు. కేవలం పది, పదిహేను రోజుల శిక్షణతో చందన పతకాలు సాధించిందని రెండేళ్లు కష్టపడితే పతకం కష్టమేమీ కాదని ఆయన భరోసాతో చెబుతున్నారు. చందన కూడా అంతే ధీమాతో తాను పతకం సాధిస్తానని అంటున్నది. అయితే, తన స్థోమతకు మించిన భారం కాబట్టి చందనను ఆదుకుంటే ఖచ్చితంగా ఆసియా క్రీడల్లో పతకం సాధిస్తామని చందన తండ్రి సతీష్ చెబుతున్నారు. ఎన్నో పోటీల్లో విజయాలు సాధించిన మన తెలంగాణ చిన్నారి పెండెం చందన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, పతకాలు తీసుకువచ్చి రాష్ర్టానికి గర్వకారణంగా నిలబడాలని మనమూ ఆశిద్దాం.
-కోల అరుణ్‌కుమార్, మంచిర్యాల ప్రతినిధి


ఈ విజయం వెనక..

తండ్రి ఓ మామూలు మెకానిక్. కానీ, తన కూతురు విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. కూతురు ఇటలీ వెళ్లేందుకు మూడు లక్షల వరకు ఖర్చు చేశారు. మధ్య తరగతి కుటుంబం.. రెక్కాడితే కానీ, డొక్కాడని పరిస్థితి. కానీ తన కూతురు లక్ష్యం కోసం వెనకడుగు వేయకుండా అప్పు చేసి మరీ ఇటలీకి పంపించాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చందన పతకాలు సాధించింది. ఇక తల్లి శారద గృహిణి. కానీ తను కూడా చందన ప్రాక్టీస్‌లో నిత్యం వెన్నంటే ఉంటుంది. తనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది. ఇక కోచ్ వేముల సతీష్. ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ చందనకు కోచింగ్ ఇచ్చేందుకు రాత్రి దక్షిణ్ రైలుకు వచ్చి తనకు కోచింగ్ ఇచ్చి వెళ్లేవారు. చందన విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఇలా ప్రతి ఒక్కరూ చందన విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

700
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles