ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్లు వద్దు


Sat,December 15, 2018 01:24 AM

-రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్లే ముద్దు

loans
గృహ రుణం కోసం ప్రయత్నిస్తున్నారా?.. అయితే ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్‌పై సులభంగా, వేగంగా అప్పులిస్తామంటూ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతోపాటు ఆన్‌లైన్ వడ్డీవ్యాపారులు చేసే ప్రకటనల్ని చూసే ఉంటారు. వీటి జోలికి మాత్రం వెళ్లకండి. వెళ్లారో వడ్డీపేరుతో సదరు సంస్థలకు ఎక్కువ మొత్తం ముట్టజెప్పాల్సిందే. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా రుణదాతలు వేసే ఎత్తుగడే ఇది. అందుకే దీనికి మీరు చిత్తు కావద్దని చెబుతున్నాం. తక్కువ వడ్డీరేట్లు అని చెబుతూ.. అధిక వడ్డీ రుణంలోకి మిమ్మల్ని నెట్టేయడమే ఈ తరహా వడ్డీరేట్ల అసలు వ్యూహం. నెలనెలా అసలు రుణ చెల్లింపులు పెరుగుతూ, వడ్డీరేట్లు తగ్గే విధానం (రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్)తో పోల్చితే ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ (ప్రతినెలా అసలు రుణం, వడ్డీరేటు, ఈఎంఐ ఒకేలా ఉండటం)కింద 1.7 నుంచి 1.9 రెట్లు వరకు రుణగ్రహీతలు అధికంగా చెల్లించాల్సి వస్తుందని లోన్‌ట్యాప్ వ్యవస్థాపక సీఈవో సత్యం కుమార్ చెబుతున్నారు.


ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ విధానం

ఈ విధానంలో మొత్తం రుణ కాలపరిమితికి తీసుకున్న అప్పుపై వడ్డీరేటును లెక్కిస్తారు. అందువల్ల వడ్డీరేటు, అసలు రుణం కలిపి ఈఎంఐ.. రుణం తీరేదాకా ఒకేలా ఉంటుంది.


ఏడాది కాలపరిమితితో 12 శాతం వడ్డీరేటుపై లక్ష రూపాయల రుణానికి నెలసరి వాయిదా (ఈఎంఐ)ల ముఖచిత్రం


రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్

ఈ పద్ధతిలోనూ ఈఎంఐ ఒకేలా ఉన్నా.. తీసుకున్న రుణంలో నెలసరి అసలు చెల్లింపులు పెరిగి, వడ్డీరేటు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఈఎంఐ తక్కువగా ఉండటాన్ని గుర్తించవచ్చు.

ఏడాది కాలపరిమితితో 12 శాతం వడ్డీరేటుపై లక్ష రూపాయల రుణానికి నెలసరి వాయిదా (ఈఎంఐ)ల ముఖచిత్రం


పై రెండు పట్టికలను గమనిస్తే క్షీణించే వడ్డీరేట్ల పద్ధతి కంటే ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ విధానంలో కస్టమర్లకు దాదాపు 44 శాతం ప్రయోజనం ఉందని గుర్తిస్తామని పైసాబజార్‌డాట్‌కామ్ వ్యవస్థాపక సీఈవో నవీన్ కుక్రేజా అన్నారు. రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ పద్ధతి పారదర్శకంగా ఉంటుందని, రుణగ్రహీతలకు లాభదాయకమని మైలోన్‌కేర్‌డాట్‌ఇన్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ గుప్తా హితవు పలికారు. మార్కెట్‌లో చాలావరకు ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్‌కే ప్రజాదరణ ఉన్నదన్న ఆయన అందుకు కారణం రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ పద్ధతిని అర్థం చేసుకోవడం కస్టమర్లకు కాస్త కష్టతరంగా ఉండటమేనని పేర్కొన్నారు. 10 శాతం ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్‌పై మూడేండ్ల కాలపరిమితికిగాను లక్ష రూపాయల రుణం తీసుకుంటే.. ఈఎంఐ రూ.3,611గా ఉంటుందని, మీరు చెల్లించే వడ్డీరేటు 17.92 శాతమని గుప్తా వివరించారు. ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కస్టమర్లను రుణం తీసుకోవడానికి బ్యాంకర్లు, ఫైనాన్సింగ్ సంస్థలు తదితర రుణదాతలు వేసే జిమ్మిక్కు అని మనీట్యాప్ వ్యవస్థాపకుడు, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ కునాల్ వర్మ అన్నారు. సాధారణంగా రుణగ్రహీతలకు ఆర్థిక సాయం అత్యవసరంగా ఉంటుందని, అలా ఉన్నవారంతా కూడా రుణదాతల వలలో పడిపోయి చివరకు ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తూ ఉంటుందన్నారు.


ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్ లోపాలు

రుణ వ్యయం అధికంగా ఉంటుందని, మొత్తం రుణం, బకాయిలపై వడ్డీరేటు ఎంతకీ తగ్గదని మార్ట్‌గేజెస్ స్కేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్ట్‌నర్ అమిత్ ప్రకాశ్ సింగ్ అంటున్నారు. అంతేగాక మార్కెట్ పరిస్థితుల ఆధారిత వడ్డీరేట్లలో తగ్గింపుల ప్రయోజనం కూడా రుణగ్రహీతలకు అందదని అంటున్నారు. కాబట్టి నెలనెలా రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ పద్ధతిలోనే గృహ రుణాలు తీసుకోవడం చాలా ఉత్తమమని సూచిస్తున్నారు. రుణాలపై ఆధారపడి ఇండ్లను కొనేవారు అధికంగా మధ్యతరగతి వేతన జీవులేనన్న ఆయన రుణం తీసుకునే ముందు వడ్డీరేట్ల గణన విధానాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం మంచిదని హితవు పలుకుతున్నారు.


ఫ్లాట్ ఇంట్రెస్ట్ రేట్స్

తీసుకున్న మొత్తం రుణంపైనే వడ్డీరేటును లెక్కించి కాలపరిమితి ప్రకారం నెలనెలా వసూలు చేస్తారు
రుణగ్రహీతల్ని ఇట్టే ఆకర్షించి తప్పుదోవ పట్టిస్తాయి
ముఖ్యంగా ఈఎంఐ ఆధారిత లోన్లలో నష్టపోతాం
వీటిని అర్థం చేసుకోవడం చాలా తేలిక


రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ రేట్స్

బకాయిపడిన రుణం ఆధారంగా వడ్డీరేటును లెక్కిస్తారు
చెల్లించినకొద్దీ వడ్డీరేట్లూ తగ్గుతాయి
పారదర్శకతతో కూడిన ఈ రుణం.. రుణగ్రహీతలపై వ్యయ భారాన్ని తగ్గిస్తుంది
వీటిని అర్థం చేసుకోవడం కాస్త కష్టతరం

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles