ఫ్యాట్ టు ఫిట్ -10


Sat,April 26, 2014 12:32 AM

స్థూలకాయం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. బీపీ, మధుమేహం వంటి రోగాలు చుట్టుముడతాయి. అందుకే ఎప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు యోగా ఒక్కటే సరైన మార్గం. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఏ సమస్యలూ దరిచేరవు. ఈవారం యోగాలో పవనముక్తాసనంలో వేరియేషన్‌లు చూద్దాం..

PAVANA-MUKTASANAM

ఏకపాద పవనముక్తాసనం

ముందుగా వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకొని కుడికాలిని మోకాలి వద్ద మడవాలి. గాలి వదులుతూ కాలిని రెండు చేతులతో పట్టుకొని తలను, భుజాలను నేల మీద నుంచి పైకి లేపాలి. తర్వాత తలను మోకాలికి ఆన్చాలి. అలా ఐదు సెకన్లపాటు ఆపి.. నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కు తీసుకురావాలి. గాలి వదులుతూ కాలిని యథాస్థితికి తేవాలి. ఈ విధంగా రెండు కాళ్లతో మూడుసార్లు రిపీట్ చేయాలి.

PAVANA-MUKTASANAM1

ద్విపాద పవనముక్తాసనం

ముందుగా వెల్లకిలా పడుకొని గాలిపీల్చుకుంటూ రెండు కాళ్లను మోకాలివద్ద మడవాలి. గాలి వదులుతూ కాళ్ళను రెండు చేతులతో పట్టుకోవాలి. అదే సమయంలో తలను, భుజాలను నేలమీద నుంచి పైకి లేపి తలకు రెండు మోకాళ్ళను ఆన్చాలి. అలా ఐదుసెకన్ల పాటు ఆపి.. నెమ్మదిగా గాలిపీలుస్తూ తలను వెనక్కి తీసుకురావాలి. గాలి వదులుతూ కాళ్లను యథాస్థితికి తేవాలి. ఈ విధంగా మూడుసార్లు రిపీట్ చేయాలి.

ROLLING

పవనముక్తాసనం లెగ్ రొటేషన్

వెల్లకిలా పడుకోవాలి. గాలి పీల్చుకుంటూ కుడికాలిని మడిచి ముందుకు తేవాలి. గాలివదులుతూ తలను మోకాలికి ఆన్చి అదే స్థితిలో ఎడమకాలిని పైకి లేపి ఐదుసార్లు కుడివైపు, ఐదుసార్లు ఎడమవైపు రొటేట్ చేయాలి. ఎడమకాలు కింద పెట్టి గాలిపీలుస్తూ తలను వెనక్కి వంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కుడికాలును కింద ఆన్చాలి. ఇదేవిధంగా గాలి పీల్చుకొని ఎడమకాలిని మడిచి ముందుకు తేవాలి. గాలి వదులుతూ తలను మోకాలికి ఆన్చి, అదేస్థితిలో కుడికాలును పైకి లేపి ఐదుసార్లు కుడివైపు, ఐదుసార్లు ఎడమవైపు రొటేట్ చేయాలి. ఆ తర్వాత కుడికాలును కిందపెట్టి, గాలిపీలుస్తూ తలను వెనక్కి తీసుకెళ్లాలి. నెమ్మదిగా గాలి వదులుతూ ఎడమకాలును కూడా కిందపెట్టాలి.

ఉపయోగాలు :

-పొట్టచుట్టూ ఉండే కొవ్వును తగ్గిస్తుంది.
-పాంక్రియాస్ (క్లోమగ్రంథి)ని ఉత్తేజితం చేస్తుంది. కనుక డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
-కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
-నడుము భాగాన్ని ఉత్తేజితం చేసి, పునరుత్పత్తి అవయవాల పనితీరును క్రమపరుస్తుంది.

జాగ్రత్తలు :

-మెడనొప్పి, బీపీ ఉన్నవారు తలను పైకెత్తకుండా ఉండాలి.
-స్లిప్‌డిస్క్, సయాటికా ఉన్నవారు నిపుణుల ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి.

గమనిక

-యోగాకి ముందు వార్మప్ ఎక్సర్‌సైజెస్ (సూక్ష్మ వ్యాయామాలు) తప్పనిసరిగా చేయాలి.

8087
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles