ఫేక్ యాప్‌లతో జాగ్రత్త!


Tue,July 31, 2018 11:21 PM

చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్ అన్నీ డౌన్‌లోడ్ చేసి టకాటకా వాడేస్తుంటాం. ఈ మధ్య మునివేళ్ల మీద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోతున్నది. ఈ అదును చూసి ఫేక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ క్రియేట్ చేసి అమాయకుల డబ్బు దండుకుంటున్నారు ఆన్‌లైన్ మోసగాళ్లు. మొబైల్ బ్యాంకింగ్ చేసేవాళ్లు ఫేక్ బ్యాంకింగ్‌యాప్‌లతో జాగ్రత్తగా ఉండండి.
fake-app
2018 సంవత్సరానికి గానూ.. ఈటీఎస్‌ఈటీ ఓ నివేదిక వెల్లడించింది. దాని ప్రకారం నకిలీ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో క్రెడిట్‌కార్డులు వాడే వారి క్రెడిట్ పరిమితిని పెంచుతాం అంటూ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. సదరు వినియోగదారునికి సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తారు. వాటి ద్వారా ఆ వ్యక్తి క్రెడిట్‌కార్డు పరిమితిని పెంచుతూ, పెరిగిన మొత్తాన్ని నకిలీ యాప్ ద్వారా డబ్బు దొంగిలిస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో ఇలాంటి యాప్స్ చాలా ఉన్నాయి. ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి బ్యాంకింగ్ యాప్స్‌ని ఆశ్రయించే వారు జాగ్రత్తగా ఉండకపోతే మీ నెత్తి మీద శఠగోపం పెట్టేస్తారు ఆన్‌లైన్ మాయగాళ్లు. ఫేక్ బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా మీ కార్డును వాడేస్తూ అందులో ఉన్న డబ్బులన్నీ దోచేస్తారు. ఇప్పటికే ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నకిలీ ఫేక్ బ్యాంకింగ్ యాప్స్‌ను గుర్తించారు.


ఇలా నొక్కేస్తారు..

క్రెడిట్‌కార్డులు, డెబిట్‌కార్డుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు నిల్వలు ఉన్న వినియోగదారుల వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత వివిధ యాప్స్‌ని ఫ్లాట్‌ఫామ్‌గా చేసుకొని ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈజీగా మనీ ట్రాన్సాక్షన్స్ చేయండి అంటూ యాప్ సజెస్ట్ చేస్తారు. ఒక్కసారి ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసి మీ అకౌంట్ వివరాలు, కార్డు నంబరు, సీవీవీ, గడువు తేదీ వంటివి ఎంటర్ చేస్తే చాలు.. మీ అకౌంట్, కార్డు పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. మీకు తెలియకుండానే మీ అకౌంట్, కార్డులోంచి డబ్బులు డ్రా చేసేస్తుంటారు. జూన్, జులై నెలల్లో ఈ ఫేక్ యాప్‌లు విస్తృతంగా గూగుల్ ప్లేస్టోర్‌లో విడుదలయ్యాయి. మూడు యాప్స్ ద్వారా ఒకే వ్యక్తి వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించాడు. లక్షలాది యాప్స్ లభించే గూగుల్ ప్లేస్టోర్‌లో సైతం నకిలీ యాప్స్ ప్రత్యక్షమవడంతో గూగుల్ ప్లేస్టోర్ తక్షణ చర్యలు చేపట్టింది. మిషన్ మోడ్ ఆపరేట్ చేయడం ద్వారా ప్లేస్టోర్‌లో కొలువైన నకిలీ యాప్‌లను పూర్తిగా తీసేసే పనిలో పడింది.


జాగ్రత్తగా ఉండండి..

-వ్యక్తిగత సమాచారం, కార్డు వివరాలు ఎవరికీ ఇవ్వొద్దు.
-అన్ని బ్యాంకులూ ఈ విషయమై ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులకు మెసేజ్‌ల రూపంలో సమాచారం చేరవేస్తూనే ఉన్నాయి.
-ఏ బ్యాంకు కూడా వినియోగదారుని పిన్ నెంబర్, కార్డు నంబర్, పాస్‌వర్డ్, అకౌంట్ నంబర్ వివరాలు మెసేజ్ రూపంలో గానీ, ఫోన్ చేసి గానీ అడుగదు.
-వీలైనంత వరకు యాప్‌ల ద్వారా బ్యాంకింగ్, ట్రాన్సాక్షన్స్‌ని తగ్గించండి. కుదరకపోతే.. నమ్మకమైన యాప్స్‌నే డౌన్‌లోడ్ చేసుకోండి.
-బ్యాంకుకు వెళ్లి వారిని అడిగి కానీ, లేదంటే వారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
నకిలీల బెడద నుంచి తప్పించుకోవచ్చు.


alert

ఏది నిజం?

మనకు కావాల్సిన యాప్ గురించి ప్లేస్టోర్‌లో టైప్ చేస్తే ఒకేలా ఉండే చాలా యాప్స్ కనిపిస్తాయి. అందులో ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టమే. పొరపాటున నకిలీ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే తెలిసీ, తెలియక మొబైల్‌ని ప్రమాదంలో పడేసినట్టే. అందుకే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసేముందు ఈ చిట్కాలు పాటించండి.

-సెర్చ్ రిజల్ట్ వచ్చిన తర్వాత యాప్ పేరుతో పాటు దాని లోగో, యాప్ డెవలపర్ వివరాలు గమనించాలి.
-కొన్నిసార్లు లోగో డిజైన్, యాప్ డెవలపర్ పేరు కూడా కాపీ కొట్టే అవకాశం ఉంది. అప్పుడు జాగ్రత్తగా స్పెల్లింగ్ గమనించాలి.
-ఎన్ని డౌన్‌లోడ్స్ ఉన్నాయో, యాప్ కింద రివ్యూస్ ఏమున్నాయో గమనించాలి.
-యాప్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ తప్పకుండా చదువండి.
-ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ యాడ్స్ రావడం గానీ, మీ ప్రమేయం లేకుండానే మరో వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్లడం లాంటివి గానీ జరిగితే ఆ యాప్‌ని వెంటనే డిలీట్ చేసేయండి. లేకపోతే మీ సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంది.
-డౌన్‌లోడ్ చేసుకునే ముందు యూజర్లు ఇచ్చిన రేటింగ్ కూడా గమనంలో ఉంచుకోవాలి. ఈ చిట్కాలు పాటిస్తూ నకిలీ యాప్స్ బారిన పడకుండా జాగ్రత్త పడండి.

616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles