ఫిట్‌నెస్‌కి కేరాఫ్ ‘ఫిటర్నిటీ’ అంటున్న నేహమొత్వాని


Sun,July 29, 2018 11:38 PM

ఈ రోజుల్లో చాలామంది ఫిట్‌నెస్‌ను కోరుకుంటున్నారు. అయితే ఫిట్‌నెస్ కోసం ఎలాంటి వర్కవుట్స్ మొదలుపెట్టాలి? ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉపయోగించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అన్నవి కూడా చాలా మందికి కలిగే అనుమానాలు. వీటన్నింటికోసం వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారిని సంప్రదించాలి. నేహ కూడా తన వ్యక్తిగత ఫిట్‌నెస్ అవసరాలను పూర్తి చేసేందుకు ఇలా ఎన్నో పాట్లు పడింది. అలాంటి ఇబ్బందులేం లేకుండా ఫిట్‌నెస్ ప్రేమికులు, ఔత్సాహికుల కోసం వన్‌స్టాఫ్ సొల్యూషన్‌గా ఆవిర్భవించిందే ఫిటర్నిటీ డాట్ కామ్. అదే ఫిట్‌నెస్‌ను బిజినెస్‌గా మార్చుకుని విజయభావుట ఎగురవేస్తున్న నేహమొత్వాని సక్సెస్‌మంత్ర.
neha-motwani
ఫిటర్నిటీ డాట్ కామ్ ప్రారంభించడానికి ప్రధాన కారణం తన వ్యక్తిగత ఫిట్‌నెస్ అవసరాలను పూర్తి చేసేందుకు పడ్డ పాట్లేనని, అలాగే తాను స్ఫూర్తి పొందానని అంటారు నేహ. ఫిట్‌నెస్ ప్రేమికులు, ఔత్సాహికుల కోసం వన్‌స్టాప్ సొల్యూషన్‌గా ఓ సంస్థ ఏర్పాటు చేయాలని భావించారామె. ఆ ఆలోచనే ఆచరణ రూపంగా ఆవిర్భవించిందే ఫిటర్నిటీ డాట్ కామ్.


చదువు, ఉద్యోగం

నేహ మొత్వాని.. ముంబైలో పుట్టి, పెరిగారు. ఆమె నర్సీ మొంజీ కాలేజీలో మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పట్టభద్రురాలు. యాక్సిస్ రిస్క్ కన్సల్టింగ్ (జెన్‌ప్యాక్ట్)లో కొంతకాలం పని చేశాక.. వెలింగ్కర్ ఇనిస్టిట్యూట్ నుంచి హ్యూమన్ రీసోర్స్‌లో ఎంబీఏ చేశారు నేహ. అయాన్ హెవిట్(Aon Hewitt)లో మూడేళ్లపాటు పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్, పునర్ వ్యవస్థీకరణ, టాలెంట్ ఎంపిక వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఓ సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోవాలనే కోరిక మొదలైంది.


సమస్య నుండే పరిష్కారం

ఫిట్‌నెస్ యాక్టీవిటీ మొదలు పెట్టాలనుకునే వారు సాధారణంగా 4 రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నేహ. ఫిట్‌నెస్ యాక్టివిటీలపై సమగ్ర సమాచారం అందుబాటులో లేకపోవడం, వర్కవుట్స్‌పై సమాచారం సేకరించడంలో ఇబ్బందులు, న్యూట్రిషన్, స్పోర్ట్స్‌ను ఎంచుకోవడం.. ఈ నాలుగు అంశాల్లోనూ చాలా గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి అవసరాల కోసం జస్ట్ డయల్ వంటి స్థానిక సెర్చ్ ఇంజిన్లనో, ఎవరైనా చెబితేనో లేదా అందుబాటులో ఉన్న ఫిట్‌నెస్ సెంటర్లపై ఆధారపడాల్సి వస్తున్నది. వాటిపై పూర్తిస్థాయి భరోసా లేకపోయినా నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతున్నది. తమకు నచ్చినదాన్ని ఎంచుకునే వరకూ పలు ప్రయోగాలు చేయాల్సి వస్తున్నది. ఇన్ని ఇబ్బందులున్న ఈ ఫిట్‌నెస్ రంగంలో జొమాటో వంటి సంస్థను తానెందుకు ప్రారంభించకూడదు అనుకున్నారు నేహ.


సర్వే చేసి..

ఐదు నగరాల్లో ఆరొందల మందిని సర్వే చేసి, పూర్తిస్థాయి మార్కెట్ రీసెర్చ్ చేయించుకున్నారు నేహ. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగానే ఫిటర్నిటీకి పునాదులు పడ్డాయి. త్రిపుల్ ఈ కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు నేహ. ఎక్సర్‌సైజ్ (వర్కవుట్స్), ఈట్(సరైన ఆహారం తీసుకోవడం), ఎక్స్‌ప్లోర్ (మానసిక స్థిరత్వం) ద్వారా ముందస్తుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే అంశంపై ఆధారపడి.. వెంచర్ ఏర్పాటు చేశారు. నిజానికి సరైన ఫిట్‌నెస్ ప్రోగ్రాంలను ఎంచుకోవడం పెద్ద సమస్య. అందుకే ఫైండర్ సర్వీసు మొదలుపెట్టాల్సి వచ్చిందట. అనేక ఫిల్టర్స్ గల ఓ సెర్చ్ ఇంజిన్ ద్వారా.. తగిన వర్కవుట్‌ను ఎంచుకోవచ్చు. అదే సమయంలో జిమ్ సెంటర్స్, స్టూడియోస్, ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులు, స్పోర్ట్స్ సెంటర్ల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి.. అందరికీ అందుబాటులో ఉంచామంటారు నేహ.


టీం ఫిటర్నిటీ

ఫోన్ ద్వారా ట్రయల్స్ బుక్ చేసుకోవడం, డీల్స్ అందించడం, కాంబో ప్లాన్స్, సరైన ప్రొడక్ట్స్ అందించడం ద్వారా కస్టమర్లకు పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నది ఫిటర్నిటీ. ఈ టీంలో ఐఐఎంలో పట్టభద్రులైన చైతన్య పాడి టెక్నాలజీ విభాగానికి హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాభివృద్ధికి జయం వోరా కృషి చేస్తున్నారు. కంటెంట్ రాయడం, నిర్వహణ బాధ్యతలను ఎడిటర్ యూతి భన్సాలి చూస్తున్నారు. ఇక మార్కెటింగ్ కార్యకలాపాలను మితేష్ అగారియా నిర్వహిస్తున్నారు. అదే రంగానికి చెందిన ఇతర విభాగాలతో కలిసి అభివృద్ది చెందాలనే వ్యూహం రచిస్తున్నారు. ప్రస్తుతం అనేక ఈ-కామర్స్ కంపెనీలు ఫిట్నెస్ ప్రొడక్టులను విక్రయిస్తున్నాయి. అయితే తగిన సర్వీసు ఎంచుకునే అవకాశమిచ్చే సెర్చ్ ఇంజిన్ గల ఏకైక మార్కెట్ ప్లేస్ ఫిటర్నిటీ మాత్రమే. మొత్తం 30 వేలకు పైగా సర్వీసులు, ఉత్పత్తులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయంటున్నారు నేహ.


గణనీయంగా పెరిగిన ఆదాయం

ప్రస్తుతం ఫిటర్నిటీకి 500లకు పైగా తమ సేవలను రిజిస్టర్ చేసుకున్న బి2బి పార్టనర్స్ ఉన్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది కూడా. జిమ్ ఓనర్లు, ట్రైనర్లు ఫిటర్నిటీ డాట్ కామ్‌ను ప్లాట్‌ఫాంగా చేసుకుని తమ బ్రాండ్‌లను వృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిట్‌నెస్ రంగానికి జొమాటోగా.. ఫిటర్నిటీ ఎదిగింది. తమ భాగస్వాముల కోసం అడ్వర్టయిజింగ్, ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం, ఫిట్నెస్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా క్లాసిఫైడ్లను లిస్టింగ్ చేయడం, ఉత్పత్తులను విక్రయించడం, ఫైండర్ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్స్, ఈ-స్టోర్ ద్వారా రూ.కోటికి పైగా ఆదాయాన్ని పొందుతుంది. ఏడాదిలో రూ. 12 కోట్ల ఆదాయాన్ని అందుకోవడం లక్ష్యంగా ఫిటర్నిటీ దూసుకుపోతున్నది.


neha-motwani2

అన్నీ ఒకేచోట!

ఫిట్‌నెస్ కోసం ఎంత తహతహలాడినా చాలామందికి అందుతున్న సమాచారం అరకొర మాత్రమే. అది కూడా పూర్తిగా నమ్మదగినదిగా ఉండడం లేదు. సైంటిఫిక్‌గా నిరూపితమైన, అనుభవజ్ఞులు చెప్పే వివరాలు అందరికీ అందుబాటులో లేవు. దీనిపై అంతగా సమాచారం కూడా అందుబాటులో లేకపోవడం, ఫిట్‌నెస్‌పై తమకు తగ్గట్లుగా ఆలోచనలున్నవారిని వెతికిపట్టుకోవడం కూడా చాలా కష్టం. ఈ సమస్యలే ఫిటర్నిటీ ప్రారంభానికి దారి తీశాయంటారు నేహ. అన్ని రకాల ఫిట్‌నెస్ పరిష్కారాలకు ఇది దారి చూపేలా ఉండాలని భావించారు ఆమె. విశ్వసనీయమైన సమాచారం, కమ్యూనిటీ ఫ్లాట్‌ఫాం, ఈ స్టోర్.. ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మరి కొన్నేళ్లలో ఫిట్‌నెస్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుంది. ఫిటర్నిటీ డాట్ కామ్‌కు ఇదో మంచి అవకాశం. ఫిట్‌నెస్ ఆప్షన్స్, సోషల్ యాక్టివిటీ, నమ్మదగ్గ ఉత్పత్తులు-సేవలు లభించే మార్కెట్ ప్లేస్ కావడంతో.. మా కంపెనీ అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అంటున్నారు నేహ.


neha-motwani3

కోట్లల్లో ఫిట్‌నెస్ మార్కెట్ విలువ

అంచనాల ప్రకారం 2015లో హెల్త్, ఫిట్‌నెస్ మార్కెట్ విలువ లక్ష కోట్లకు పైగానే. ప్రస్తుతం ఇది 25 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సాధిస్తున్నది. ఆదాయాలతో పాటు యువ జనాభా పెరగడం, ఆరోగ్యం- అప్పియరెన్స్ వంటి అంశాలపై అవగాహన ఊపందుకోవడం, మారుతున్న లైఫ్‌ైస్టెల్, నిలకడైన ఆరోగ్యం కోరుకోవడం వంటి కారణాలతో.. ఫిట్‌నెస్ మార్కెట్ విస్తరిస్తున్నది. ఇవన్నీ ఫిటర్నిటీకి అవకాశాలుగా మారాయి. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరిగిన కొద్దీ.. ఇలాంటి మార్కెట్ ప్లేస్‌లకు వ్యాపారం వృద్ధి చెందుతూనే ఉంటుంది.

545
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles