ఫిట్స్‌కి ఆపరేషన్ ఉందా?


Mon,February 12, 2018 01:08 AM

నా మిత్రుడికి 24 సంవత్సరాలు. గత 14 ఏళ్లుగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చాలామంది డాక్టర్లకు చూపించి, ఎన్ని రకాల మందులు వాడినా ఫలితం లేదు. వారానికి 4-6సార్లు ఫిట్స్ వస్తాయి. ఈమధ్య ఫిట్స్‌కు ఆపరేషన్ చేసి తగ్గిస్తున్నారని
స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. ఆపరేషన్ ద్వారా ఫిట్స్ తగ్గించేందుకు వీలవుతుందా?
- కిషన్, జగిత్యాల

itch_pain
మీ స్నేహితుడి సమస్యను ఎపిలెప్సీ అంటారు. ఇది సర్వసాధారణమైన సమస్య. వందమందిలో ఒకరికి ఉంటుంది. అందులో మూడోవంతు వ్యాధిగ్రస్థులకు ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు శస్త్రచికిత్స ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఫిట్స్ ఉన్న ఆ పేషెంట్ శస్త్రచికిత్సకు సరిపోతాడో లేదో ముందుగా మెదడుకు ఎంఆర్‌ఐ, ఎపిలెప్సీ ప్రొటోకాల్ వంటి పరీక్షలు చేసి తెలుసుకుంటారు. మొదట ఎంఆర్‌ఐ తీసిన తరువాత వీడియో ఈఈజీ పరీక్ష చేస్తారు. దీనికోసం పేషెంట్‌ను 24 గంటలు హాస్పిటల్‌లో ఉంచి, ఈఈజీ యంత్రంతో గమనిస్తారు. దాని ద్వారా అతనిలో వచ్చే మార్పులను ఆ వీడియోలో రికార్డు చేస్తారు. ఈ విధంగా ఎంఆర్‌ఐ, వీడియో ఇఇజి పరీక్ష రిపోర్టుల ఆధారంగా పేషెంట్‌కు ఆపరేషన్ సరిపోతుందో లేదో తెలుసుకోవచ్చు. ఆపరేషన్ చేయడం వల్ల చాలామందిలో అతి తక్కువ వ్యవధిలో ఫిట్స్ పూర్తిగా తగ్గిపోతాయి.

ఫిట్స్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా పడిపోవడం, దానివల్ల తల, వెన్నెముకకు గాయాలు కావడం సర్వసాధారణం. ఎపిలెప్సీకి వాడే మందుల వల్ల పేషెంట్లలో చురుకుదనం తగ్గుతుంది. ఇలాంటప్పుడు మందులు ఆపేసి, ఆపరేషన్ చేయడం వల్ల ఫిట్స్ తగ్గడమే కాకుండా వారిలో ఉత్సాహం పెరిగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కూడా మీ మిత్రుడిని మంచి ఎపిలెప్టాలజిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లండి. అతను ఆపరేషన్‌కు సరిపోతాడనుకుంటే ఆపరేషన్ చేయించడమే మంచిది.

డాక్టర్ టివిఆర్‌కె మూర్తి
సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

440
Tags

More News

VIRAL NEWS