ఫలహారం


Thu,December 4, 2014 12:26 AM

చలి గిలిగింతలు పెడుతుంటే.. వేడి వేడిగా ఎవరైనా తింటారు.. చల్లచల్లని సూప్.. తియ్యతియ్యని కేక్.. ఠండాఠండా పాప్‌సీ.. ఆరగిస్తే ఆ థ్రిల్లే వేరు. ఈ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్‌తో.. ట్రీట్ ఇస్తున్నాం. పండుగ చేస్కోండి..

orange

ఆరెంజ్ కేక్


కావలసిన పదార్థాలు
నారింజ : 3, కోడిగుడ్లు : 3, చక్కెర : 1 1/2 కప్పులు
ఆల్మండ్ మీల్ : 300 గ్రా. , బేకింగ్ పౌడర్ : ఒక టీ స్పూన్
వెన్న : తగినంత

తయారీ :
ఓవెన్‌ని 170 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద హీట్ చేసి పెట్టుకోవాలి. పాన్‌కి వెన్న కరిగించి రాయాలి. మరో పాన్‌లో నారింజలు వేసి నీళ్లు పోయాలి. దీన్ని స్టౌ మీద పెట్టి సన్నని మంటమీద 15 నిమిషాలు వేడి చేయాలి. నీళ్లు వంపేసి మళ్లీ కొన్ని నీళ్లు పోసి మరో 15 నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల నారింజ పొట్టులో ఉండే చేదు పోతుంది. ఇప్పుడు చిన్నగా కట్ చేసి గింజలు తీసేయాలి. ఆ ముక్కలను ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి మెత్తగా చేయాలి. ఇంకో గిన్నెలో కోడిగుడ్లు, చక్కెర వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని నారింజ మిశ్రమంలో వేయాలి. దీంతోపాటు ఆల్మండ్ మీల్, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. దీన్ని బేకింగ్ పాన్‌లో పోసి గంటసేపు బేక్ చేయాలి. బయటకు తీసి చల్లారనివ్వాలి. ఈ లోపు ఒక నారింజను కోసి రసం తీయాలి. ఇందులో చక్కెర వేసి వేడి చేయాలి. ఇది చిక్కటి సిరప్‌లా తయారవుతుంది. ఈ సిరప్‌ని కేక్ మీద పోసి ఆరగించేయొచ్చు.

Pomegranate_Mousse

దానిమ్మ మౌసీ పై


కావలసిన పదార్థాలు :
దానిమ్మరసం : 1 1/2 కప్పులు , గ్లూటెన్ (గోధుమ పిండి): చిన్న ముక్క
హెవీ క్రీమ్ : 2 కప్పులు, వైట్ చాక్లెట్ : 85 గ్రా. , చక్కెర : పావు కప్పు
ఫుడ్ కలర్ : 3 చుక్కలు, చాక్లెట్ : 85 గ్రా., దానిమ్మగింజలు : కొన్ని

తయారీ
రెండు స్పూన్ల దానిమ్మరసాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో గ్లూటెన్ వేసి పది నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఇంకో గిన్నెలో వైట్ చాక్లెట్, రెండు టేబుల్ స్పూన్ల హెవీ క్రీమ్ వేసి వేడిచేయాలి. చాక్లెట్ కరిగాక దించేయాలి. మరో గిన్నెలో మిగిలిన దానిమ్మరసాన్ని పోసి వేడి చేయాలి. అందులో గ్లూటెన్ మిక్స్ వేసి కలపాలి. చల్లారాక ఇందులో హెవీ క్రీమ్, చక్కెర, వైట్ చాక్లెట్ వేసి ఉండలు లేకుండా చిక్కగా అయ్యే వరకు కలుపుతుండాలి. ఇప్పుడు క్రాకర్ తీసుకొని అందులో ఫుడ్ కలర్ పోసి దానిపై నుంచి ఈ మిశ్రమాన్ని పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. మూడు గంటల తర్వాత తీసి చాక్లెట్, క్రీమ్, దానిమ్మ గింజలతో అందంగా డెకరేట్ చేసి సర్వ్ చేయాలి.

strawberry-soup

స్ట్రా బెరీ సూప్


కావలసిన పదార్థాలు :
స్ట్రాబెరీస్ : 500గ్రా.
కార్న్ సిరప్ : పావు కప్పు
చక్కెర : పావు కప్పు
పెరుగు : అర కప్పు
పాలు : ఒక కప్పు
నిమ్మరసం : ఒక టేబుల్ స్పూన్

తయారీ :
ఓవెన్‌ని 300 డిగ్రీల వద్ద ముందే హీట్ చేసి పెట్టుకోవాలి. స్ట్రాబెరీలను కడిగి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో కార్న్ సూప్ వేసుకొని ఓవెన్‌లో బేక్ చేయాలి. బయటకు తీసి కాసేపు చల్లారనివ్వాలి. దీన్ని గ్రైండ్ చేసుకొని చక్కెర, పెరుగు, పాలు, నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంట తర్వాత బయటకు తీసి స్ట్రాబెరీని చిన్నముక్కలుగా కట్ చేసి గార్నిష్ చేయాలి. చల్లచల్లని స్ట్రాబెరీ సూప్ రెడీ!

kiwi-fruit-homemade-popsicles

కివీ పాప్‌సీ


కావలసిన పదార్థాలు
కివీ పండ్లు : 2
అరటి పండ్లు : 2
అవొకాడో పండు : 1
కొబ్బరిపాలు : అర కప్పు
మాపుల్ సిరప్ : 2 టేబుల్ స్పూన్స్

తయారీ
కివీ, అరటి పండ్లు, అవొకాడోను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో కొబ్బరిపాలు, మాపుల్ సిరప్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పులో ఈ మిశ్రమాన్ని పోసి ఐస్‌క్రీమ్ పుల్లలను గుచ్చాలి. ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఉదయం వాటిని బయటకు తీసి ఐదు నిమిషాల తర్వాత పుల్లను పట్టుకొని పైకి లాగాలి. కూల్ కివీ పాప్‌సీ మీ నోరూరించక మానదు!

4857
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles