ప్రాణాలకు తెగించింది!


Sat,August 4, 2018 01:18 AM

అప్పుడే పాఠశాల ప్రారంభమైంది. పచ్చని అంచుగల తెల్లటి చీరెల్లో ఉన్న విద్యార్థినులతో 11వ తరగతి కళకళలాడుతున్నది. మొదటి పీరియడ్ చెప్పేందుకు వచ్చిన ఇంగ్లిష్ టీచర్.. వారి ప్రోగ్రెస్ పరిశీలిస్తున్నది. కిటికీ పక్కనే కూర్చొని, 50మీటర్ల దూరంలో ఉన్న చిన్న చెరువును చూస్తున్నది రూప్మా ప్రమాణిక్. టీచర్ ఒక్కొక్కరినీ ప్రోగ్రెస్ అడుగుతున్నది. ఇంతలో, రూప్మా హఠాత్తుగా క్లాస్‌లో నుంచి బయటికొచ్చి, ఆ చెరువు వైపు పరుగెత్తుతున్నది. టీచర్‌తో సహా, పిల్లలూ ఆమె వెంట పరుగెత్తారు. ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకింది రూప్మా.
Rumpa-SavedBoy
నీటిలో మునుగుతూ, తేలుతూ, నీళ్లు మింగుతున్న మూడేళ్ల బాలుడిని కాపాడేందుకు చీరెతో ఈదుతూనే వెళ్లి అందరూ చూస్తుండగానే రక్షించింది. ఒడ్డుపైకి తెచ్చి సపర్యలు చేసింది. పొట్ట ఒత్తి, నీళ్లు కక్కేలా చేసింది. ఇదంతా చూస్తున్న టీచర్లు, విద్యార్థులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ పిల్లాడి పేరు రాహుల్. ఆమె అతన్ని కాపాడే వరకూ తెలియదు రాహుల్ తన బంధువు అవుతాడని. ఈ ఘటన కోల్‌కతాకు 220 కిలోమీటర్ల దూరంలోని నారాయణ్‌గఢ్‌లో చోటుచేసుకున్నది. రూప్మా తండ్రి ఓ పేద రైతు, ఉదయం సాయంత్రం టిఫిన్ దుకాణం నడుపుతుంటాడు. ఆమె కాపాడిన బాలుడు తండ్రి బిదేశ్ సింగ్ ఓ దినసరి కూలి. రాహుల్ తల్లి స్నానం చేసేందుకు నీళ్లు పొయ్యిమీద పెట్టి మంట చూస్తుండగా.. రాహుల్ ఆడుకుంటూ చెరువు దగ్గరికి వెళ్లి అందులో పడిపోయాడు. క్లాస్‌లో ఉండి రాహుల్ పడిపోవడాన్ని గమనించిన రూప్మా ప్రమాణిక్ వెంటనే వెళ్లి అతడ్ని కాపాడింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల అసిస్టెంట్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు రూప్మాను అభినందనలతో ముంచెత్తారు. నారాయణ్‌గఢ్ ప్రాంతానికి చెందిన అభివృద్ధి అధికారి రూప్మా సాహసాన్ని మెచ్చుకొని, పలువురికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అయితే, రూప్మా గతంలో కూడా ఓ బాలికను కాపాడింది. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నది.

420
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles