ప్రతిభకు పురస్కారం!


Tue,March 7, 2017 01:29 AM

మహిళాశక్తిని విశ్వమంతా విస్తరిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాటుదేలుతున్నారు. విజయవంతంగా రాణిస్తున్నారు. విద్య అయినా.. ఉద్యోగం అయినా.. వ్యాపారం అయినా మేమున్నాం.. అని ముందువరుసలో నిలబడుతున్నారు. ఎన్ని చేసినా సరైన గౌరవం.. ప్రోత్సాహం లభిస్తేనే ఉత్సాహం రెట్టింపవుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో రాణించిన మహిళలకు పురస్కారాలు అందజేస్తున్నది. విజయ విషయాలు పంచుకోవడానికి ఈ వేడుక.. సరైన వేదికగా నిలుస్తున్నది. వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న ప్రతిభామూర్తుల్లో 13 కేటగిరీలకుగాను 24 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి నగదు పురస్కారంతో సత్కరిస్తున్నది. ఆ ప్రతిభావంత మహిళల్లో కొందరు వీళ్లు. మిగతావాళ్ల గురించి రేపటి సంచికలో..

బధిరుల పాలిట భరోసా


జానకిఫిన్ వ్యవస్థాపకురాలు
janaki
మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు చెందిన సత్తెమ్మ.. చంద్రప్పల కుమార్తె జానకి. ఏడుగురు ఆడపిల్లల్లో ఈమె చిన్నది. మూగ.. చెవుడు. తండ్రి తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కష్టాలను పెనవేసుకుని పుట్టిన జానకి, పరిస్థితులను అర్థం చేసుకుని చదివింది. తనని చిన్నచూపు చూసినా పట్టించుకోకుండా కష్టపడింది. చదువు పూర్తయిన తర్వాత సికింద్రాబాద్‌లోని స్వీకార్ ఉపకార్‌లో టీచర్‌గా కొంతకాలం పనిచేసింది. ఆ తర్వాత యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థలో చేరి బధిరుల తల్లిదండ్రులకు.. పిల్లలకు అవగాహన కల్పించేది. ఆ పయనంలో అనుభవాలు.. ఆమెను స్వయంగా ఓ సంస్థ ప్రారంభించేలా చేశాయి. 2007లో పీపుల్ విత్ హియరింగ్ ఇంపెయిర్డ్ నెట్‌వర్క్ (ఫిన్)ను స్థాపించి బధిరుల సమస్యలపై ఉద్యమిస్తున్నది. గ్రామాల్లోకి వెళ్లి వారి హక్కులపై అవగాహన కల్పించడం.. ప్రభుత్వ పథకాల గురించి తెలుపడం.. ఉద్యోగాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ బధిరుల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నది. పుణెలో కూడా ఒక సెంటర్ నిర్వహిస్తున్నది. బధిరుడైన శ్రీనివాస్‌ను పెండ్లి చేసుకున్నది. ఇప్పుడు ఉత్తమ మహిళగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు అందుకోబోతున్నది. సరైన సమాచారం అందక బధిరులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు ఎదురైన సమస్యలు ఎవ్వరికీ రాకూడదు. అన్ని జిల్లాల్లోనూ నెట్‌వర్క్ ఏర్పాటుచేసి గ్రామీణస్థాయిలో వైకల్యం ఉన్నవారికి చదువుచెప్పించి.. ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం అని అవార్డుకు ముందు చెప్పింది జానకి.

ముస్లింవాద సాహితీవేత్త


షాజహానారచయిత్రి, కవయిత్రి
shajhana
అస్మిత, షాహీన్‌లాంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన షాజహానా అన్వేషి సంస్థ నుంచి దూదేకుల స్త్రీల మీద ప్రాజెక్టు చేశారు. వెనుకబడ్డ ముస్లిం బతుకులను దగ్గరి నుంచి చూసిన ఈమె ఆ మహిళల బతుకును తన కవిత్వం రూపంలో రాశారు. షాజహానా ఖమ్మం జిల్లా కమలాపూర్‌కు చెందిన ప్రముఖ రచయిత దిలావర్ కూతురు. కోఠీ ఉమెన్స్ కాలేజీలో ఎం.ఏ చదివి రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పర్యవేక్షణలో ఎం.ఫిల్ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ పర్యవేక్షణలో తెలుగులో ముస్లింవాద సాహిత్యం పై పీహెచ్‌డీ చేశారు. షాజహానా కవిత్వం ఇంగ్లీష్, హిందీ, జర్మనీ భాషల్లోకి అనువదించబడింది. నఖాబ్ కవిత్వం కన్నడలోకి అనువాదమై పుస్తకంగా వెలువడింది. కవిత్వంతో పాటు కథలు కూడా రాసి కథా సంపుటిలను వెలువరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉద్యమ కవిత్వం కూడా రాశారు. దేశవ్యాప్తంగా జరిగిన వందల కవి సమ్మేళనాల్లో పాల్గొని కవితా పఠనం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా షాజహానాను వరించాయి. భారత ప్రభుత్వం తరపున జర్మనీలో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫెయిర్‌కు అతిథిగా హాజరయ్యారు. మాస్కోలో జరిగిన బుక్‌ఫెయిర్‌లో పాల్గొని కవితా పఠనం చేశారు.

ఉద్యమమేఊపిరి


తిరునగరి దేవకీ దేవి ఉద్యమకారిణి
Devaki-Devi
తిరునగరి దేవకీ దేవి. 1969 ఉద్యమకారిణి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన దేవకీ దేవి1969 తెలంగాణ ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ సాధన వరకు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ధీరవనిత . కేవలం ఉద్యమకారిణిగానే కాకుండా ఉపాధ్యాయురాలిగా, రచయిత్రిగా, కవయిత్రిగా కూడా సుపరిచితురాలు. ఆరు పదుల వయస్సులోనూ తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమానికి చేయూతనిచ్చారు. విమోచన ఉద్యమంలో ఎందరో మహిళలు, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వారికి సరైన గుర్తింపురాలేదంటారామె. అందుకే వారి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. 1969 ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మహిళాదినోత్సవం సందర్భంగా 1969 ఉద్యమకారిణిగా గుర్తించి అవార్డును ప్రకటించింది. అవార్డు రావడం ఆనందంంగా ఉంది. నాటి ఉద్యమకారులను గుర్తించి ఇలాంటి అవార్డు ప్రకటించడం మంచి పరిణామం. 1969 నుంచి నేడు తెలంగాణ వచ్చే వరకు సాగిన ఉద్యమాల్లో నేను ప్రత్యేక్షంగా పాల్గొన్నాను. మాలాంటి వారిని గుర్తించడం వల్ల భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉంటుంది అని చెప్పారామె.

రబ్బరు బుల్లెట్లనుఎదిరించి..


ధాత్రిక స్వప్న విద్యార్థి నాయకురాలు
swana
నిజామాబాద్ జిల్లాకు చెందిన ధాత్రిక స్వప్న కష్టపడి చదివి ఉస్మానియాలో ఉన్నత విద్యకోసం చేరింది. ఆ సమయంలోనే మలిదశ తెలంగాణ పోరాటంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినిగా తెలంగాణ కోసం ఉద్యమించింది. పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పటికీ, రబ్బరు బుల్లెట్లు తగిలినా ఉద్యమంలో కొనసాగింది. టీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం ఉస్మానియా శాఖ విద్యార్థిని విభాగానికి అధ్యక్షురాలిగా పనిచేసింది. ఉద్యమ సమయంలోనే ఏర్పడిన పరిచయంతో మున్నురుకాపు విద్యార్థి నాయకుడు మల్లేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. గృహిణిగా ఉంటూనే యూనివర్సిటీలో జువాలజీ పీహెచ్‌డీ స్కాలర్‌గా చేస్త్తుంది. ఉద్యమ సమయంలో విద్యార్థినిగా ఆమె చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
విద్యార్థినిగా తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశా. పెండ్లి తర్వాత తెలంగాణ వచ్చింది, అయితే నన్ను గుర్తు పెట్టుకుని అవార్డు ప్రకటించడం చాలా అనందంగా ఉంది. ఉద్యమ సమయంలో కృషి చేసిన సామాన్య జనానికి కూడా కేసీఆర్ పాలనలో గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ. అవార్డు కమిటీకి, కేసీఆర్‌గారికి రుణపడి ఉంటా అని చెప్పారు స్వప్న.

పాటసాయం


స్వర్ణ గాయని
swarna
కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామానికి చెందిన స్వర్ణ చిన్నతనం నుంచే పాటలు పాడేది. తన అక్క జ్యోతి ప్రోత్సాహంతో వేదికల మీదా పాటలు పాడడం ప్రారంభించింది. తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక కాలికి గజ్జెకట్టి పల్లెపల్లె తిరిగింది. ధూంధాం వేదికలెక్కి తెలంగానం చేసింది. రాష్ట్ర సాధనే ద్యేయంగా తన గళాన్ని వినిపించింది. ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో ఉద్యోగం కల్పించింది.తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ప్రజలను చైతన్యం చేసినందుకు గాను ప్రభుత్వం మహిళా దినోత్సవాన అవార్డుతో సత్కరించనున్నది.తెలంగాణ ఉద్యమంలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అనడానికి నిదర్శనమిది. మన రాష్ట్రం ఏర్పడ్డాక మన కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అందులో భాగంగా నాకు అవార్డునివ్వడం గర్వంగా ఉంది. 60 ఏళ్లుగా నష్టపోయిన మనం స్వరాష్ట్రంలో మనల్ని మనం గౌరవించుకునే అరుదైన అవకాశం ఈ అవార్డుల ప్రధానం. ఇవి మాకు శక్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యమం లేకపోతే, పాట లేకపోతే నేను ఎవరికీ తెలిసేదాన్ని కాదు. ఈ విషయంలో కేసీఆర్, గద్దర్, బాలకిషన్‌లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటున్నది స్వర్ణ

కలబడి నిలబడికట్ట కవిత


జర్నలిస్టు
Katta-Kavitha
నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన కవిత మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జర్నలిస్ట్‌గా విధులు నిర్వహిస్తూనే ప్రత్యక్ష పోరాటంలోనూ తన సత్తా చాటింది. ఉద్యమకారులను అణచివేస్తున్న సమయంలో వారికి ఎదురొడ్డి నిలబడి తన తెగువను ప్రదర్శించిన జర్నలిస్ట్. తెలంగాణ సాధనే ధ్యేయంగా అనేక కథనాలు సైతం రాసింది. ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా ఆమె చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్ట్‌గా అవార్డు ప్రకటించింది.ఉద్యమకారిణిగా, జర్నలిస్ట్‌గా రెండిట్లోనూ నా భాగస్వామ్యం ఉంది. ఈ అవార్డు కూడా రెండింటికీ గుర్తింపుగానే భావిస్తా. 12-13 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నప్పటికీ నమస్తే తెలంగాణలో పనిచేసిన సమయంలో అటు ఉద్యమం, ఇటు వృత్తి రెండింటినీ సమన్వయం చేసుకునే పూర్తి స్వేచ్చ నాకు లభించడం వల్లే ఉద్యమంలో భాగం కాగలిగాను. నా భావాలను స్వతంత్రంగా వ్యక్తం చేసుకునే అవకాశం లభించింది. ఉద్యమంలో నా పాత్ర చిన్నది. భవిష్యత్తులో తెలంగాణ కోసం చేయాల్సింది ఇంకా ఉందనే భావిస్తా. నాడు నాకు అవకాశం ఇచ్చిన నాటి ఎడిటర్ అల్లం నారాయణ, సీఈఓ నేటి ఎడిటర్ శేఖర్‌రెడ్డి గారికి ధన్యవాదాలు అని తన ఆనందాన్ని పంచుకున్నారు కవిత.

చురుకైన పాత్ర


మూల విజయారెడ్డి ఉద్యమకారిణి
vijaya
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన విజయారెడ్డి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తండ్రి దండ తిరుపతిరెడ్డి 1969 ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడంతో ఆ స్ఫూర్తితో టీఆర్‌ఎస్ ఏర్పడిన తర్వాత 2002 నుంచి మలి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించింది. గోదావరిఖని కేంద్రంగా కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపులోనూ భాగస్వామ్యమై అనేక సార్లు జైలు జీవితాన్ని గడిపింది. తెలంగాణ బిల్లు పెట్టే సమయంలోనూ ఢిల్లీలో 12 రోజులు పోరాడి అక్కడ కూడా జైలు జీవితాన్ని గడిపింది. ఉద్యమ సమయంలో ఆమె చూసిన తెగువను గుర్తించిన ప్రభుత్వం ఆమెకు ఉద్యమకారిణిగా మహిళా దినోత్సవాన అవార్డు ప్రకటించింది.మలిదశ తెలంగాణ ఉద్యమంలో నిరంతరాయంగా ఏ పిలుపునిచ్చినా స్పందించి ఉద్యమంలో భాగస్వామినయ్యా. కేసులు భరించా. నన్ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఉద్యమంలో భాగస్వామినై తెలంగాణ సాధనలో పాల్గొన్నందుకు ఇప్పుడు అవార్డు దక్కినందుకు గర్వంగా ఉంది. కేసీఆర్‌గారికి ధన్యవాదాలు అన్నారు విజయారెడ్డి.

ఒడిదుడుకుల దృశ్యం


గౌండ్ల మల్లీశ్వరి వీడియో జర్నలిస్టు
malliswari
ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లీశ్వరి చిన్నతనం నుంచే కష్టాలకు ఎదురీది పెరిగింది. పేదరికంలో పుట్టినప్పటికీ ఎంవీ ఫౌండేషన్ సహకారంతో చదువుకుని వీడియోగ్రాఫర్‌గా ఎదిగింది. వీడియో టెక్నిక్‌లు నేర్చుకుని 2008లో హెచ్‌ఎం టీవీలో వీడియో జర్నలిస్ట్‌గా చేరింది. రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ తొలి మహిళా వీడియో జర్నలిస్ట్‌గా గుర్తింపుపొందింది. ప్రస్తుతం జై తెలంగాణ న్యూస్ ఛానల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా సేవలందిస్తున్నది.వీడియో జర్నలిస్ట్‌గా ఆమె రాణించిన తీరును గుర్తించిన ప్రభుత్వం 2017 మహిళా దినోత్సవం సందర్భంగా తొలి మహిళా వీడియో జర్నలిస్ట్‌గా అవార్డు ప్రకటించింది.అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. కష్టపడి ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటున్న మహిళా వీడియో జర్నలిస్ట్‌లకు ఇలాంటి అవార్డులు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నన్ను అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని చెప్పారు మల్లీశ్వరి.

ఉద్యమ గానం


మారోజు చైతన్య గాయని
chethu
యాదాద్రి జిల్లా కోటమర్తి గ్రామానికి చెందిన చైతన్యకు చిన్నతనం నుంచే పాటలు పాడడంలో అనుభవం ఉంది. తెలంగాణ పోరాటంతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మారోజు వీరన్న భార్యనే చైతన్య. ఆయనతో కలిసి అనేక వేదికల మీద పాటలు పాడి ప్రజల్లో చైతన్యాన్ని రగిలించింది. 1996 నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న చైతన్య మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక వేదికలమీదా తన గొంతు వినిపించింది. ఉద్యమ సమయంలో ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం గాయనిగా మహిళ దినోత్సవ అవార్డుకు చైతన్యను ఎంపికచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. 96 నాటి ఉద్యమం నుంచి కూడా గోరటి వెంకన్న, మిత్ర, గద్దర్‌ల పాటలు పాడేదాన్ని. మలిదశ ఉద్యమంలో ధూంధాంతో కలిసి పాదం, పదం కలిపి ఆడిపాడిన. నా శ్రమకు తగిన ఫలితం దక్కింది అని తన ఆనందాన్ని పంచుకున్నారు చైతన్య.

1657
Tags

More News

VIRAL NEWS