ప్రజల మనిషిగా..ప్రజల్లో ఒకడిగా


Sat,June 17, 2017 01:09 AM

తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న ప్రశ్నలకు ఇప్పటికే చాలా సమాధానాలు దొరుకుతున్నాయి. జిల్లాల సంఖ్య పెంచితే ఏం లాభం అన్న సందేహాలకు కూడా సమాధానాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలకు పాలన చేరువైంది. కలెక్టర్లు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన మార్పులకు మచ్చుకు కొన్ని. కలెక్టర్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి ఆత్మీయంగా ప్రజలను పలుకరిస్తున్నారు. అలా ప్రజల మనిషిగా.. ప్రజల్లో ఒకడిగా ఉంటూ మన్ననలు పొందుతున్నారు సూర్యాపేట కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్. రక్తసేకరణలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపి గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సురేంద్రమోహన్ చేపట్టిన కార్యక్రమాల పరిచయం ఇది.
PENPAHAD
సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా కడవేరు సురేంద్రమోహన్ బాధ్యతలు చేపట్టాక ప్రజలకు ఉపయోగపడే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రణాళికాబద్దంగా వాటిని ప్రారంభించి వందశాతం సక్సెస్ సాధిస్తున్నారు. స్వతహాగా ప్రారంభించిన కార్యక్రమాలు ప్రభుత్వ పాలసీలుగా మార్చి పనితీరులో ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను విస్తృతంగా ప్రజలకు అందించడం.. రికార్డు స్థాయిలో రక్తాన్ని సేకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

రక్త సేకరణ.. మౌళిక వసతుల కల్పన

నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రక్త సేకరణలో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే టాప్‌లో ఉంచడంతో పాటు ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇందుకుగాను కడవేరు సురేంద్రమోహన్ శుక్రవారం హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్, రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఈఎస్‌ఎల్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏసీలు సమకూర్చడం, తాగునీరు, పరదాలు, ఇతర మౌళిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో ప్రసవాలు కూడా పెరిగాయి. సూర్యాపేట రెడ్‌క్రాస్ సొసైటీకి అధ్యక్షులుగా ఉన్న కలెక్టర్ సురేంద్రమోహన్ రికార్డు స్థాయిలో రక్తాన్ని సేకరించారు. గతంలో సంవత్సరానికి 2500 ప్యాకెట్లు సేకరించగా, కలెక్టర్ బాధ్యతలు తీసుకున్నాక 3,155 యూనిట్లు సేకరించగలిగారు.

విదేశాలకు వెళ్లి.. తిరిగొచ్చి

నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన సురేంద్రమోహన్, మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ సర్వేల్ పాఠశాలలో విద్యనభ్యసించారు. నిరుపేద, మధ్య తరగతి ప్రజలను దగ్గర్నుంచి చూడటంతో వారి స్థితిగతులు ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయా వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి చిన్న సమస్య తన దృష్టికి వచ్చినా పరిష్కారం చూపుతున్నారు. గ్రూప్స్ ద్వారా 1996లో జగిత్యాల ఆర్డీఓగా చేరి ఆ తర్వాత కరీంనగర్ ఆర్డీఓగా, 2002లో నల్లగొండ వెలుగు పీడీగా పనిచేశారు. 2005- 2010 మధ్య అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. 2010లో మళ్లీ ఉద్యోగంలో చేరి 2011 వరకు విపత్తు నివారణ కేంద్రం, 2013లో మీ సేవ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఐఏఎస్ క్యాడర్‌తో 2013 నుంచి 2015 వరకు ఖమ్మం జేసీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత 11 నెలలు జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సేవలందించారు. కొత్త జిల్లాలయ్యాక సూర్యాపేట మొదటి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

సాధించిన విజయాలు

-ఖమ్మంలో జేసీగా ఉన్న సమయంలో ఉద్యమం పంథాలో బోధన పద్దతులు మార్చి పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో 22 స్థానం నుంచి 6వ స్థానానికి తెచ్చారు. జిల్లాలో 15 వేల ఎకరాల భూమిని 6,500 మంది పేదలకు పంపిణీ చేశారు.
-ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం పంపిణీలో అక్రమాలను గుర్తించడంలో నూతనంగా ప్రవేశపెట్టిన వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌కు స్ఫూర్తి కూడా కలెక్టర్ సురేంద్రమోహన్ కావడం విశేషం. ఖమ్మంలో జేసీగా పనిచేస్తున్న సమయంలో డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మోటివేట్ చేశారు. అలాగే కొన్ని రూట్‌లలో పీడీఎస్ బియ్యం వెళ్లే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడంతో వందలాది మంది బోగర్ రేషన్ కార్డులు, గ్యాస్ సిలిండర్లు సరెండర్ చేశారు. తద్వారా సంవత్సరానికి సుమారు వంద కోట్ల రూపాయల ఆదా అయింది. మొదటిసారి రేషన్ కార్డులకు ఆధార్ ఆనుసంధానం చేసింది ఖమ్మంలోనే.

-ఖమ్మం జేసీగా ఉన్న సమయంలోనే సుమారు 40 ఏళ్లుగా పంచాయితీల్లో ఉండి పెండింగ్‌లో పడ్డ 15 వేల ఎకరాల భూమిని సామరస్యంగా పరిష్కరించి 6,500 మంది గిరిజనులకు పంపిణీ చేశారు. ఎవరితోనైనా బాగా ఉంటూ మనల్ని నమ్మేలా పారదర్శకంగా ఉంటే ఎంతటి పెద్ద సమస్య అయినా పరిష్కారం చేయవచ్చని సురేంద్ర నమ్ముతారు. భూ పంపిణీలో నాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ సహకారం ఎనలేనిదంటారు.
-సూర్యాపేట కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 25 ఏళ్లుగా నీళ్లకు నోచుకోని నడిగూడెం మండలం తెల్లబెల్లి చెరువును ప్రజల కోరిక మేరకు ఒక్క ఫోన్ కాల్‌తో నింపించారు.
-ప్రతి ఫ్రై డేను గ్రీన్ డేగా పాటిస్తున్నారు. ఆ రోజు మొక్కలు నాటడం.. వాటికి నీటిని పోయడం ప్రారంభించగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చింది
-క్యాష్‌లెస్ లావాదేవీలో సూర్యాపేట టాప్.. అక్షరాస్యతలో కూడా రాష్ట్రంలోనే టాప్.
-జిల్లాలోని పెన్‌పహాడ్ పీహెచ్‌సీ ఆదునికీకరణతో ప్రారంభమైన ఉద్యమం అన్ని పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆసుపత్రులకు చేరి పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు చేరువయ్యాయి.
-స్వతహాగా ప్రభుత్వ హాసల్లో చదువుకున్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక అధికారులను నియమించి రాత్రి బస చేశారు. ప్రతి హాస్టల్‌కు రూ. 10వేల చొప్పున ఇచ్చి మౌళిక వసతులు కల్పించారు.
-ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుతో సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంలో విదేశీ డెవలప్‌మెంట్ నిధులు 20 లక్షలతో మోడల్ సబ్‌సెంటర్ నిర్మాణం చేపట్టారు.
surendramohan
దేశంలో కోట్లాది మంది ఉండగా ఇతరుల జీవితాలను బాగు చేసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. అది మా లాంటి అతి కొద్దిమందికి వచ్చింది. ప్రభుత్వం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుంది. ప్రభుత్వం మాపై ఉంచిన నమ్మకం కోసం 24 గంటలు పనిచేస్తున్నాం. అవకాశాన్ని సార్థకం చేసుకుంటే ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు పొందుతాం. స్వతహాగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. అందుకే సక్సెస్ అవుతున్నానని చెప్పడానికి గర్వంగా కూడా ఉంది.
సురేంద్రమోహన్, సూర్యాపేట కలెక్టర్

752
Tags

More News

VIRAL NEWS

Featured Articles