ప్రకృతి అందాల గంగనాల


Thu,August 30, 2018 11:05 PM

ఎటు చూసినా పచ్చని వనాలు.. పెను వరద వచ్చినా కదలని ఎత్తయిన, అరుదైన వృక్షజాతులు.. వాటి మధ్య గలగల మంటూ హొయలొలికే గోదావరి పరవళ్లు.. ఆ నీటిని మళ్లించి పొలాలకు పారించేందుకు నాటి భగీరథులు నదికి అడ్డంగా సుమారు కిలోమీటరున్నర మేర రాళ్ల మధ్యన అనకొండను తలపించేలా కట్టిన కట్ట..! దానిపై నడుస్తుంటే భూలోకాన్ని మరిపించి వాహ్వ్ అనిపించేలా ప్రకృతి రమణీయత..! కొంచెం క్లిష్టమైనా మనసుకు ఆహ్లాదం పంచే వాతావరణంలో నిర్మితమైన గంగనాలను చూసి తీరాల్సిందే!
ganga
కొండలు.. గుట్టల నడుమ దట్టమైన అడవుల్లో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ పర్యాటకానికి కొత్తరూపాన్నిస్తున్నది గంగనాల.


1959లో నిర్మాణం

ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి శివారులో గోదావరినదిపై 1959లో గంగనాల ప్రాజెక్టు (అడ్డుకట్ట)ను నిర్మించారు. దిగువకు వృథాగా పోతు న్న గోదావరి జలాలను మళ్లించి ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని వేములకుర్తి, యామాపూర్, ఫకీర్ కొండాపూర్, మొగిలిపేట, ఒగులాపూర్, నడికుడ గ్రామాల్లో 2500 హెక్టార్ల పంట భూములకు పారించడంతో పాటు తాగు నీటి అవసరాలూ తీర్చుకునేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ముందే దీన్ని నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌కు చెందిన అప్పటి నీటి పారుదల మంత్రి జేవీ నర్సింగరావు ప్రత్యేక చొరవ చూపారు. ప్రభుత్వం నదికి అడ్డుగోడ, కాలువ తవ్వకం కోసం రూ.90వేలు కేటాయించగా దీనికితోడు స్థానిక వేములకుర్తి, యామాపూర్, ఫకీర్‌కొండాపూర్ గ్రామాల రైతులు సైతం భాగస్వాములై నిర్మాణాన్ని చేపట్టారు. ఏడాదిపాటు అడ్డుకట్ట, కాలువ పనులు కొనసాగాయి.


గోదావరి నదికి అడ్డుగా సుమారు 1200 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల వెడల్పుతో డంగు సున్నం, ఇసుక మిశ్రమంతో కలిపి రాతితో ఆడ్డుకట్ట కట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి వేములకుర్తి, యామాపూర్ మీదుగా ఫకీర్ కొండాపూర్ పెద్దచెరువు దాకా, అక్కడి నుంచి మల్లాపూర్ మండలం మొగిలిపేట పెద్ద చెరువులోకి నీటిని పారించేందుకు 13.4 కిలోమీటర్ల పొడువునా కాలువ తవ్వారు. అడ్డుకట్ట వద్ద రెండు గేట్లు ఏర్పాటు చేశారు. 1960-61 మధ్యకాలంలో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచీ ఆరు గ్రామాలకు ఈ ప్రాజెక్టు జీవనాధారమైంది. ఆయకట్టు రైతులకు ఆదరువుగా నిలిచింది. బావులపై ఆధారపడి సాగుచేసేవారికి కల్పతరువైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో దిగువకు నీటి ప్రవా హం తగ్గినా, వానలు పడినప్పుడు, లేదా ఎస్సారెస్పీ గేట్లు ఎత్తినప్పుడు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుంది.


గంగనాలకు పేరిలా..

పూర్వ కాలం నుంచీ గోదావరిని ఇక్కడి ప్రజలు గంగ అని పిలుస్తుంటారు. వాడుకంలోనూ మెజా ర్టీ ప్రజలు గంగ అనే అంటారు. గంగ నుంచి నీటిని పంట పొలాలకు పారించేందుకు కట్టిన కట్ట, కాలువ (నాలా)ను కలిపి గంగనాల అని నామకరణం చేశారు.


అనకొండలా.. అడ్డుకట్ట

ఎగువ ప్రాంతం నుంచి పరుగెత్తుకు వచ్చే జలాలను ఒడిసి పట్టేందుకు నది మధ్య నిర్మించిన అడ్డుకట్ట అచ్చు అనకొండను తలపిస్తుంది. ఈ అడ్డుకట్ట మీదుగా మిగులు నీరు పరవళ్లు తొక్కుతూ దిగువకు దూకుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కనులూ చాలవు. నాటి సాంకేతిక పరిజ్ఞానంతో కట్టిన ఈ అడ్డుకట్ట సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. నీటి ప్రవాహం లేనప్పుడు కట్టపై నుంచి నడుస్తూ గోదావరి అందాలు చూస్తూ ఉంటే మనసు పరవశిస్తుంది.


చూడముచ్చటైన అందం

ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరే నీటితో తొణికిసలాడే జలాశయం.. బండరాళ్ల మీదుగా పరవళ్లు తొక్కుతూ దిగువకు నీటి ప్రవా హం.. నది మధ్యలో పెను వరదలు వచ్చినా ఇంచుకూడా కదలని మద్ది, జిట్రేగి, సెనంగి, మోదుగ, అల్లనేరేడు, జువ్వి తదితర ఏండ్ల నాటి మహా వృక్షాలు.. నదిలో అక్కడక్కడా నీటి మడుగులు.. వాటి అంచులకు అందాన్నద్దే లా సహజసిద్ధంగా కత్తిరించినట్లు మొలిచిన గడ్డి. అడ్డుకట్ట మీదుగా వెళ్తుంటే మధ్యమధ్యన చెట్ల పొదలు, వాటి మధ్యన నీటి గుం టలు సందర్శకులను అబ్బురపరుస్తాయి.


ప్రాజెక్ట్ వద్ద లఘు చిత్రం షూటింగ్

ganga2


కంచి మడుగు

గంగనాల ప్రాజెక్టు కట్టక ముందు గోదావరి నదీభాగంలో పెద్ద మడుగు ఉండేది. ఇందులో ఎండాకాలంలోనూ నీరుండేది. పశువులు ఈ మడుగులో దాహం తీర్చుకునేవి. మడుగుకు ఆనుకొని ఉన్న పచ్చని గడ్డిని మేసేవి. చుట్టూ పచ్చని గడ్డి, మధ్యలో మడుగు ఉన్నందున దానిని కంచి మడుగు అని స్థానికులు పిలుస్తుంటారు. ఈ మడుగు వద్దే అడ్డుకట్టను నిర్మించారు. ఇక్కడే పులి కుర్రు (దీవి), ఇడుపుల మడుగు, తునికి ధోరణి, నల్లమడుగు ప్రాంతాలు అబ్బుర పరుస్తాయి. ఇక్కడ అప్పుడప్పుడూ లఘు చిత్రాల షూటింగ్‌లు జరుగుతాయి. సమీప గ్రామాల నుంచి యువకులు, విద్యార్థులు విహార యాత్రలకు వస్తుంటారు.


పర్యాటకానికి అనువు పులికుర్రు

గంగనాల ప్రాజెక్ట్‌కు అతి సమీపంలో పులి కుర్రు (దీవి) కనిపిస్తుంది. గోదావరి రెండు పాయలుగా చీలిపోయి మధ్యలో సుమారు 450 ఎకరాల విస్తీర్ణంతో కూడిన ప్రదేశం ఉంది. ఇందులో టేకు, వేప, మద్ది తదితర రకాల భారీ వృక్షాలు నిండిపోయి చిట్టడివిని తలపిస్తుంది. ఈ అడవిలో జింకలు, కుందేళ్లు, నక్కలు, ఉడుములు, పక్షులు తదితర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పులి తిరిగేదనీ, ఈ క్రమంలోనే దీనికి పులి కుర్రు (పులి దీవి) అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎండాకాలంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిర్మల్, జగిత్యాల జిల్లాల నడుమ గోదావరి నది మధ్యలో ఉన్న పులికుర్రు ప్రాంతం, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అనువుగా ఉన్నది.


2014లో జగిత్యాల సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి, పర్యాటక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ వణ్యప్రాణుల పరిరక్షణతో పాటు జింకల పార్కు, అతిథి గృహాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలనీ, పర్యాటకులు వచ్చి పోయేందుకు రోప్‌వే నిర్మించాలనే ఆలోచనతో అప్పట్లో పర్యాటక శాఖకు నివేదిక ఇచ్చారు. ఓ వైపు గంగనాల, మరోవైపు పులికుర్రును పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు వేములకుర్తి నుంచి రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తే నిర్మల్, జగిత్యాల జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశమున్నది.
-కనపర్తి రమేశ్, జగిత్యాల డెస్క్


ఇలా వెళ్లాలి

మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం నుంచి 18 కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి 10 కి.మీ దూరంలో వేములకుర్తి ఉన్నది. అక్కడి నుంచి గంగనాల ప్రాజెక్టు (గోదావరి తీరం) మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామం నుంచి సరైన రోడ్డు మార్గం లేదు. ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు మాత్రమే వెళ్తాయి. ఎండాకాలం లేదా చలి కాలంలో కార్లు, జీపులు, ఇతర వాహనాల్లో వెళ్లవచ్చు. కానీ, వానాకాలంలో మట్టిరోడ్డు బురదమయమై ప్రాజెక్టు దగ్గరిదాకా వెళ్లాలంటే కష్టతరమవుతుంది. గోదావరికి కొంత దూరాన వాహనాలను నిలిపి నడిచివెళ్లాలి. కొంత కష్టమైనా వనాల్లోంచి నడుస్తూ ప్రాజెక్టు గేటు పైనుంచి గోదావరిలోకి వేసిన మెట్లు దిగి బండరాళ్ల నడుమ అడ్డుకట్ట పైనుంచి నది మధ్యలోకి వెళ్తుంటే పొందే అనుభూతి వర్ణనాతీతం.

1472
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles