పోషకమే భేష్!


Fri,September 7, 2018 01:32 AM

ఆహారం మనిషికి నిత్యావసరం. కానీ ఏది తినాలి? ఏది పడితే అది తినకుండా పోషక విలువలున్న ఆహారం తీసుకుంటేనే శ్రేయస్కరం. జాతీయ పోషకాహార వారోత్సవం నేటితో ముగియనున్న సందర్భంగా గైడ్‌లైన్స్ ప్రకారం ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో
ఈ కథనం ద్వారా తెలుసుకుందాం!

food

గైడ్‌లైన్స్ 1 గర్భిణులు బాలింతలకు ఆరోగ్య రక్షణ

గర్భధారణ సమయంలో శరీరానికి పోషకాహారం చాలా అత్యవసరం. ఎందుకంటే అది పిండాభివృద్ధి దశ. పిండం అభివృద్ధి చెందేందుకు అదనపు ఆహారం తప్పనిసరిగా కావాలి. కాబట్టి పోషకాహారం పట్ల నిర్లక్ష్యం చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో శరీరంలో కొవ్వు నిల్వల వల్ల పోషకాహారం అనివార్యత ఏర్పడుతుంది. ఇక బాలింతల విషయానికి వస్తే బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శరీరంలోని శక్తిని కోల్పోతుంది. దాన్ని పూడ్చేందుకు సమపాళ్లలో నాణ్యమైన ఆహారం ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసం అదనపు ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసమే ముందస్తు ప్రణాళికగా గర్భదారణ సమయంలోనే పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మంచిది. దీనికి తోడు తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, పులియబెట్టిన ఆహారం తీసుకోవాలి.

గైడ్‌లైన్స్ 2 ఉప్పు మితంగా..

ఉప్పు లేనిది ఏ ఆహారం తీసుకోలేనివాళ్లు చాలామందే ఉంటారు. సోడియం మిళితమైన ఆహారం ప్రతి వ్యక్తికీ అవసరమే. అయితే దానిని కూడా మితంగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు అనే విషయం గ్రహించాలి. సోడియం శరీరానికి అదనపు సెల్యులాయిడ్ ద్రవంగా పనిచేస్తుంది. శరీరంలో నరాల పనితీరు సక్రమంగా జరగడంలో సోడియం ఉపకారిగా పనిచేస్తుంది. అయితే దీనిని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి. పరిమితి కంటే మించి తీసుకుంటే ఇది కిడ్నీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సోడియం క్లోరైడ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, కడుపులో క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల అవసరాన్ని బట్టి సోడియంకు బదులు పొటాషియం తీసుకోవాలి. చిన్న వయసు నుంచే ముడి ఉప్పును అలవాటు చేయాలి.

గైడ్‌లైన్స్ 3 ఇంట్లో చేసిన ఆహారం

పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. ఆరు నెలలు దాటిన తర్వాత మాత్రం ఒకవైపు పాలు ఇస్తూనే మరోవైపు పోషకాహారానికి అలవాటు చేయాలి. ఇంట్లో చేసిన పోషక విలువలున్న ఘనాహారమే ఇస్తే మంచిది. జీర్ణం అవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అది కూడా పాక్షిక ఘనాహారమే ఉత్తమం. తగిన మోతాదులో సప్లిమెంట్స్ ఇవ్వాలి. వీటివల్ల పోషకాహార లోపం నిరోధించబడుతుంది. ఆహారం తయారుచేసేటప్పుడు, తినేటప్పుడు పరిశుభ్రత పాటించాలి. లేకపోతే పిల్లల్లో అతిసార సోకుతుంది. ముందే చెప్పినట్లు ఆర్నెళ్ల వరకు పాలు ఇచ్చి ఇక అయిపోయింది అనుకోవడం సరైంది కాదు. ఆర్నెళ్ల తర్వాత క్రమ క్రమంగా పాలు తగ్గిస్తూ పాక్షిక ఘనాహారం రుచి చూపించాలి. రోజువారీగా బిడ్డకు 3-4 సార్లు ఈ ఆహారం ఇస్తుండాలి.

గైడ్‌లైన్స్ 4 వయసుకు తగిన ఆహారం

ఏ వయసుకు తగిన ఆహారం ఆ వయసుకు ఇస్తే మంచిది. ఆరోగ్యం, అనారోగ్యం అనేది ఈ వయో ఆధారిత నియమాలు పాటించకపోవడం వల్ల ఏర్పడుతాయి. కాబట్టి ముఖ్యంగా పిల్లలకు ఏమివ్వాలి? యుక్త వయసు వారికి ఏం ఇవ్వాలి? అనే విషయంలో స్పష్టత ఉండాలి. దీనికోసం పోషక విలువలున్న సమతుల ఆహారం ఇవ్వాలి. బాల్యదశలో తగిన ఆహారం ఇవ్వాలి. అంతో ఇంతో శారీరక శ్రమ కూడా అవసరమే. బీఎంఐ, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, విటమిన్ లోపాలను నివారించడానికి వయో ఆధారిత ఆహారం ఇవ్వడం అవసరం. సాధారణ అంటువ్యాధులు, పోషకాహార లోపాలపై ప్రభావం చూపిస్తాయి.

గైడ్‌లైన్స్ 5 సమతుల్యత కోసం వైవిధ్య ఆహారం

జీవితానికి పోషణ ఒక ప్రాథమిక అవసరం. కాబట్టి ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. సమతుల్యత అంటే అన్ని రకాల ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం అన్నమాట. చాలామంది రకరకాల ఆహారం అంటే రంగు రంగుల ఆహారం.. మసాలాల ఆహారం అనుకుంటారు. మసాలాల్లో కాకుండా పోషణలో ఆ వైవిధ్యం చూపించాలి. వివిధ రకాల ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాలా పోషకాలు అందుతాయి. తృణధాన్యాలు, మిల్లెట్లు, పప్పుధాన్యాలు పోషకాలకు ప్రధాన వనరులు కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధన్యం ఇవ్వాలి. పిల్లలు, మహిళలకు మంచి నాణ్యమైన మాంసకృత్తులు, కాల్షియంను అందించే పాలు ఇవ్వాలి. నూనెలు, గింజలు, కేలరీలు అధికంగా ఉండే ఆహారం ఇవ్వాలి.

గైడ్‌లైన్స్ 6 కూరగాయలు పండ్లు

ఎన్ని రకాల ఆహారం తీసుకున్నా కూరగాయలు, పండ్ల ద్వారా పొందే పోషకాలు ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తాయి. చూడటానికి సాధారణ ఆహారమే అయినా ఇవి చాలా ఆరోగ్యం. రుచితోపాటు పోషక విలువలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. ఫైటో న్యూట్రియెంట్స్, ఫైబర్స్ వంటి సూక్ష్మ పోషకాలు హృదయ వ్యాధులు, కంటిశుక్లం, క్యాన్సర్ వంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఇవి సహాయపడతాయి. పండ్ల రసాలలో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. ఈ రసాల కోసం తాజా పండ్లు ఉపయోగించాలి. వీలైనంతవరకూ ఇతర కూరగాయలతో చేసిన కూరలు, చారు, పెరుగన్నం వంటివి తీసుకోవాలి. ఆకుకూరలు మెనూలో కచ్చితంగా ఉండాలి. వీటిలో క్రిములు ఉండే అవకాశం ఉంది కాబట్టి పరిశుభ్రంగా కడిగి వండిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలి.

గైడ్‌లైన్స్ 7 మోతాదుకు మించని నూనెలు:

ఆహారం ఎంత అవసరమో అంతే స్థాయిలో నూనె కూడా అవసరం. అయితే దానికి ఒక మోతాదు పాటించాలి. నూనెలుగానీ వాటి స్థానంలో నెయ్యి, వెన్న, వనస్పతి మంచి పోషకాలను కలిగి ఉంటాయి. వీటిలో ఏదో ఒక దానిని ప్రత్యామ్నాయంగా వాడితే శ్రేయస్కరం. కొవ్వులు, నూనెలు అధిక శక్తి విలువలను కలిగి ఉండటమే కాదు.. తిన్నామన్న సంతృప్తిని కలిగిస్తాయి. కాబట్టి అవి ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇవి కరిగే విటమిన్ల శోషణను ప్రోత్సహిస్తాయి. ఎక్కువ కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్ రక్తంలోని లిపిడ్లను పెంచుతాయి. కాబట్టి మోతాదు పాటించాలి. ఒకవేళ మోతాదును విస్మరించి అధిక కొవ్వులు తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రమాదాలు ఏర్పడవచ్చు.

గైడ్‌లైన్స్ 8 మితంగా తినాలి

గత 2-3 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అధిక బరువు సమస్య వేధిస్తున్నది. 30-50% ఊబకాయం పెను సమస్యగా మారుతున్నది. అధిక బరువు, ఊబకాయం వల్ల టైప్-2మధుమేహం, కాలేయ వ్యాధి, పిత్తాశయ సమస్యలు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, కీళ్ళ సంబంధిత రుగ్మతలు, హైపర్‌టెన్షన్, హృదయ వ్యాధులు, క్యాన్సర్, మానసిక-సామాజిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అసమతుల్యత ఆహారం వల్ల శరీరం సంకుచితంగా మారుతుంది. కాబట్టి ఆహారం మితంగా తీసుకోవాలి. పరిమితికి మించి ఆహారం తీసుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. మితంగా తింటూనే శారీరక శ్రమ చేయాలి. పని మధ్యలో తీసుకునే విరామాల్లో కొద్దిపాటి ఆహారం తీసుకోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటే మంచిది.

గైడ్‌లైన్స్ 9 సురక్షిత ఆహారం

మంచి ఆహారం తీసుకోవాలంటే పోషక విలువలున్న ఆహారం తీసుకోవడమే కాదు.. సురక్షితమైన ఆహారం తీసుకోవాలి. అంటే పరిశుభ్రత, నాణ్యత ఉన్నవి తీసుకోవాలి. సహజంగా దొరికే ఆహారంలోనూ విషపూరితాలు ఉంటున్నాయి. పర్యావరణం కలుషితం ఎక్కువగా కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. సురక్షితంకాని ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రతీ పదార్థాన్ని పరిశుభ్రంగా తీసుకోవాలి. వాడకముందు పండ్లు, కూరగాయలను కడగాలి. ముడి, సరిగ్గా నిల్వచేసిన ఆహారాన్ని తీసుకోవాలి. క్రిముల నుంచి ఆహారాన్ని పరిరక్షించాలి.

డాక్టర్ మయూరి ఆవుల
న్యూట్రిషియనిస్ట్
mayuri.trudiet@gmail.com

636
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles