పోలీసులకు అమ్మ!


Wed,December 5, 2018 01:07 AM

పోలీసులనగానే శిక్షలు, నేరాలు, ఫిర్యాదులే గుర్తుకు వస్తాయి. కానీ చెన్నైలోని నంగనల్లుర్ సమీపంలో ఉన్న పజావంతగల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు అనాథైన ఓ తల్లిని చేరదీసి, ఆమెకు ఉపాధి కల్పించారు. ఆమె బాగోగులు చూసుకుంటూ అమ్మ స్థానం ఇచ్చారు. అంతేనా.. తన తొలి పుట్టినరోజును ఘనంగా చేసి, తల్లి కళ్లలో ఆనందాన్ని చూశారు.
inspired-police
చెన్నైలోని నంగనల్లుర్ సమీపంలో పజావంతగల్ పోలీస్‌స్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 67 యేండ్ల అనుష్య భర్త కొన్నేండ్ల కిందటే చనిపోయాడు. సంపాదన లేని కొడుకు మద్యానికి బానిసయ్యాడు. దీంతో తల్లిని సరిగా పట్టించుకోకపోవడంతో అనుష్య ఒంటరిగా మిగిలిపోయింది. బంధువులెవరూ ఆమెను ఆదరించలేదు. దీంతో తన గోడు చెప్పుకొనేందుకు ఓ రోజు పజావంతగల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ఇన్‌స్పెక్టర్ వెంకటేశన్‌ను కలిసి తన గోడు చెప్పుకొన్నది. అయితే, వెంకటేశన్ కొడుకుపై కేసు ఫైల్ చేస్తానని చెప్పడంతో.. అనుష్య వద్దని నిరాకరించి కన్నీటి పర్యంతమైంది. తన కొడుకును అల్లారుముద్దుగా పెంచుకున్న విధానాన్ని వివరిస్తూ, కేసులు పెట్టి కొట్టొద్దని వేడుకున్నది. ఈ దృశ్యాన్ని చూసిన పోలీసుల హృదయం ద్రవించింది. ఎలాగైనా అనుష్యకు అండగా నిలువాలనే నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే అనుష్యతో గతేడాది స్టేషన్‌కి సమీపంలో చిన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు.

ఆ క్యాంటీన్‌లోనే పోలీసులు టీ, టిఫెన్, భోజనాలు చేసేవారు. వారు ప్రతిరోజూ డబ్బులు చెల్లించి, ఆమె దగ్గరే ఆహార పదార్థాలు కొనుగోలు చేసేవారు. ఇలా పోలీసులు చూపిన ఉపాధితో అనుష్య ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకున్నది. ఆ క్యాంటీన్‌కు వచ్చిన పోలీసులంతా ఆమెను అమ్మా అంటూ సంబోధించేవారు. అలా ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి అనుష్య అమ్మ అయింది. అప్పటి నుంచి ఆమెను సొంత తల్లిగా భావిస్తూ, బాగోగులు చూసుకుంటున్నారు. నవంబర్ 27న అనుష్య పుట్టిన రోజు కావడంతో వారంతా ఆమెకు కేక్, బహుమతులు అందించి ఘనంగా వేడుకలను నిర్వహించారు. అనుష్య 67వ యేట తొలిసారిగా జరుపుకొన్న పుట్టిన రోజును అత్యంత సంబురంగా జరిపి ఆమెను సంతోష పెట్టారు. వృద్ధాప్యంలో అమెకు అండగా నిలిచిన పోలీస్ అధికారులను అందరూ ప్రశంసిస్తున్నారు.

1410
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles