పొలానికే! పేరంటానికా అన్నట్టు!!

Tue,March 21, 2017 01:54 AM

మామూలుగా ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు బంగారు ఆభరణాలతో బయటకు వెళ్లడం మామూలే. కానీ, పొలం పనికి వెళ్లేప్పుడూ కూడా సొమ్ములు ధరించి కళతో కనిపించడం పాలమూరు శ్రామిక మహిళలకే చెల్లింది.

ప్రస్తుతం కాల్వల ద్వారా నీళ్లొచ్చిన సంబురంలో ఉన్నందున పాలమూరు మహిళ మరింత నిండుగా ఉన్నది. ఇంకా కొన్నాళ్లు పోతే, తానే బంగారు తెలంగాణకు ఉదాహరణగా నిలుస్తుందనీ
అనిపించింది.
polam
దశాబ్దాలుగా కరువు కాటకాలలో పాలమూరు పేదరికం అంచుకు నెట్టబడిందని తెలుసు. అక్కడివన్నీ బీడు భూములే అనీ తెలుసు. దాంతో వలసకు మారుపేరుగా ముద్రపడ్డ పాలమూరులో ఇండ్లన్నీ పాడుపడి ఉంటాయని, ప్రజలంతా ఏడుపు మొహాలతో, గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ కనిపిస్తారనీ ఎవరైనా అనుకుంటే పొరబాటు. అవును మరి. జీవితానికి తనదైన రహస్యం ఉన్నట్లే, పాలమూరు శ్రామిక మహిళకూ తనదైన జీవకళ ఉన్నది. దానికి బంగారు సొబగులు అద్దడమూ ఆమెకు తెలుసు. నిత్య జీవితంలో ఎంతటి ఎదురీత ఉన్నప్పటికీ ఎండనకా వననకా కష్టపడుతున్నప్పటికీ ఆమె ఉన్నంతలో సంతోషంగా ఉంటూ ఆశావహంగా జీవించడం తెలిసిన మనిషి. అందుకే ఒంటిపై బంగారు సొమ్ములు ధరించడం తన సంప్రదాయం అన్నట్లు పాలమూరు మహిళలు బంగారు బతుకమ్మలోలె కానరావడం విశేషం. విశేషమే మరి. బాగా పంటలు పండే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఏ కళా లేకుండా ఇండ్లు ఉండటం చూశాక పాలమూరు పచ్చగా కళతో కానరావడం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అంతకన్నా ఆశ్చర్యం, ఆమె బంగారు సొమ్ములతో పొలం పనులకు వెళుతూ కనిపించడం. నిజమే. అందం, ఆరోగ్యం గురించి ఈ కష్జజీవులకున్న సోయి అన్నీ అమరిన వాళ్లకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ముఖ్యంగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు గ్రామాలన్నీ మంచి కళతో ఉన్నయి. ఇండ్లకు సున్నాలు వేసి ఉన్నయి. తలుపులకు ఏడాదికి ఒకసారి రంగులు వేస్తున్న తీరూ కనిపించింది. ఇంటి ఆవరణ అంతా కూడా శుభ్రంగా ఉన్నది. వీటన్నిటికన్నా మిన్న పాలమూరు మహిళ సంతోష ఛాయలతో ఉన్నది. ఒంటిపై సొమ్మలు ధరించి పనీపాటల్లో నిమగ్నమై కనిపించింది. ప్రస్తుతం కాల్వల ద్వారా నీళ్లొచ్చిన సంబురం కూడా తోడైనందున ఆమె మరింత ఆకర్షణీయంగా ఉన్నది. తెలంగాణ సంతరించుకుంటున్న సరికొత్త శోభలో ఆమె మరింత ఆనందంతో కళ్లెదుట నిలబడటం శుభ సూచకం.
old-women
జీవితాన్ని కేవలం ఒక్క ఆర్థిక కోణమో నిర్ణయించదు. సకల జీవన వ్యాపకాలూ మనుషులను సంబురంగా వుంచడంలో పాత్ర వహిస్తాయనడానికి నిదర్శనంగా పాలమూరు మహిళ కానవచ్చింది. ఆమె సొమ్ములతో మెరిసిపోతున్నది. ప్రతి మహిళా తప్పనిసరిగా బంగారు ఆభరణాలు ధరించకుండా లేనే లేదు. ఆమె బంగారు చెవి కమ్మలు, రవ్వల ముక్కు పోగులను ధరించడమే కాదు, మెడలో నాలుగైదు తులాల నాను, పది తులాల వెండి గుండ్ల పేర్లూ ధరించి కనిపించింది. కాళ్లకే కాదు, చేతులకూ కడెం ధరించడమూ ఉంది. కాలం లేదని గానీ, మా బతుకులు బంగార మొసంటివే కదా అని పుష్ఫలత అన్న మహిళ అంది. మేం ఉన్నోళ్లం కాదు. కానీ, సోమ్ములు ధరించడం మా కష్టంలో ఒక భాగంఅని ఆమె జవాబిచ్చింది. ఫంక్షన్లున్నప్పుడే కాదు, పనికి పోయేటప్పుడు సొమ్ములు పెట్టుకోవడం మా దేశాన అంతటా ఉన్నది అని మల్లమ్మ చెప్పింది.
old-women1
చేతులకు వెండి కడియాలు ధరించడం పాలమూరు మహిళ ప్రత్యేకత అని తెలిసింది. చేతుల కడియాలు 10 నుంచి 20 తులాలతో చేయించుకుంటే, కాళ్ల కడియాలు 60 నుంచి 70 తులాలతో చేయించుకుంటామని వారు చెప్పారు. కాళ్లకు వెండి పట్టాలు కూడా ధరిస్తారట. అయితే, కొందరు ముంజేతిపై భాగాన గట్టి కడెం ధరించడమూ కనిపించింది. కాగా, చెవులకు బంగారు కమ్మలు తప్పనిసరి. కొందరు గువ్వ పోగులు కూడా చేయించుకున్నరు. మరికొందరు బరువైన బంగారు గంటీలూ ధరించి కనిపించారు. మెడలో నల్లపూసల దండతో పాటు బంగారుగుండ్ల పేరును ధరిస్తున్నారు. అలాగే పలకలు కూడా. కాగా, గొల్ల కుర్మలు వెండిగుండ్ల దండలను ధరిస్తుండటమూ విశేషంగా కనిపించింది. ఇవన్నీ ఒకెత్తు., చేతులకు నిండుగా గాజులు ధరించడం మరో ఎత్తు. వీటితో వాళ్ల ప్రతి కదలికా రాగరంజితం అవుతున్నది. ఇక ఏమీ లేని వాళ్లు కనీసం ఒక బంగారు ముక్కుపోగుతో మెరుస్తారు. తలలో ఒక బంతి పువ్వునైనా తురుముకుని మిగతా అమ్మలక్కలతో పోటీపడుతారు.
vari
మొత్తం మీద జీవాలను మేపుతూ ఉన్న గొల్లకుర్మ మహిళలే కాదు, పొలం పనుల్లో నిమగ్నమైన మహిళలు కూడా తప్పనిసరిగా బంగారు ఆభరణాలను ధరించే పనుల్లో నిమగ్నం కావడం విశేషం. పనే వాళ్లకు శుభకార్యం అన్నట్టు కనిపించింది. మొన్న బంగారు గుండ్ల పేరు పడిపోయింది. అయినాగని మళ్ల చేయించుకుని పనికి వచ్చిన. పనికి సొమ్ములు లేకుండా పోవడం మాకు అలవాటు లేదు అని లక్ష్మి అనే మహళ వివరించింది. చిత్రమే మరి. నిత్య జీవితంలో జీవకళకు తోడు బంగారు సొబగులూ అద్దడం పాలమూరు శ్రామికుల ప్రత్యేకతగా తెలుస్తుంటే, పనిలేక దారిద్య్రం అన్నది ఈ నేలలో కనిపించడం కేవలం కృత్రిమం, తాత్కాలికం అనే అనిపిస్తున్నది. అన్ని వనరులనూ సద్వినియోగం చేసుకోవడంలో గత పాలకుల వైఫల్యమనే తోస్తున్నది.
కందుకూరి రమేష్ బాబు
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

1113
Tags

More News

మరిన్ని వార్తలు...