అజీర్ణం, మలబద్దకం, అధిక బరువుతో మొదలై మలద్వారం వద్ద సమస్యలను బయటికి చెప్పుకోలేక, ముదిరిన తరువాత డాక్టర్ను సంప్రదిస్తుంటారు. మలద్వారం వద్ద అనేక సమస్యలను పైల్స్ లేదా అర్శమొలలుగానే భావించి, చికిత్స తీసుకుంటుంటారు. దీనివల్ల వ్యాధి ఇంకా ముదిరి, తీవ్రంగా మారుతుంది. కాని వీటిలో వ్యాధిని కచ్చితంగా గుర్తించి సరైన ఆయుర్వేద చికిత్స తీసుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
అర్శమొలలు
మలవిసర్జన సమయంలో అధిక దురద, రక్తం పడడం, మలద్వారం దగ్గర మాంసం పెరిగినట్టుగా ఉండడం పైల్స్ లక్షణం. ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
1. మలద్వారం బయట ఉండి, మలవిసర్జనకు అడ్డుపడుతూ ఉంటాయి. కొందరిలో రక్తం కూడా పడుతుంది.
2. మలద్వారం లోపలే ఉండే పైల్స్. ఇవి 4 దశల్లో ఉంటాయి.
మొదటి దశలో మొలలు మలద్వారం లోపలే ఉండి, మలబద్దకం ఉండడం వల్ల మలం గట్టిగా బయటకు వెళ్లినప్పుడు రక్తస్రావం అవుతుంది.
వేడి చేయడం వల్ల రక్తస్రావం కలుగుతోందనే అపోహతో అశ్రద్ధ చేస్తారు. వ్యాధి ఎక్కువ అవుతుంది.
రెండో దశలో మల విసర్జన సమయంలో రక్తస్రావంతో పాటు మొలలు బయటకు వచ్చి, మలవిసర్జన తరువాత మళ్లీ లోపలికి వెళ్లిపోతాయి.
మూడవ దశలో మల విసర్జన సమయంలో బయటికి వచ్చి, మొలలు బయట అలానే ఉండిపోయి, మలాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా లోపలికి నెడితే లోపలికి పోతాయి.
చివరి దశలో మొలలు బయటకు వచ్చి, అలానే ఉండిపోయి, వాచిపోయి తీవ్రమైన నొప్పి, కదలలేని, కూర్చోలేని స్థితిని కలిగిస్తుంది.
రక్తస్రావం ఎక్కువగా కలిగితే రక్తహీనతకు దారితీస్తుంది.

ఫిషర్
మలద్వారం వద్ద తీవ్రమైన నొప్పి, మంట, చుక్కలు చుక్కలుగా రక్తస్రావం లక్షణాలను కలిగిస్తుంటే ఫిషర్గా గుర్తించవచ్చు.
ఎక్కువ సమయం కూర్చోవడం, అధిక ప్రయాణాలు, స్త్రీలలో గర్భధారణ సమయంలో మలద్వారం వాచిపోయి, కుంచించుకుపోయి, మలం గట్టిగా రావడం వల్ల మలద్వారం వద్ద చర్మం చీలిపోయి, పుండులాగ ఏర్పడుతుంది. దీనిపై నుంచి మలవిసర్జన జరిగేటప్పుడు తీవ్రమై, భరించలేని నొప్పి, రక్తస్రావం కలుగుతుంది.
మలద్వారం వద్ద కలిగే ఫిషర్ సమస్యను చాలామంది పైల్స్గా భావించి, చికిత్స తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినప్పటికీ వ్యాధి అలాగే ఉండి, మళ్లీ మళ్లీ ఇబ్బందులను కలిగిస్తుంది.
చికిత్స క్రమం
మలద్వారం వద్ద వచ్చే వ్యాధులకు మన ఆధునిక జీవన విధానం, మనం తీసుకునే ఆహారం, శరీర ప్రకృతి ముఖ్య కారణాలుగా ఉంటాయి.
చికిత్సకు ఉపక్రమించే ముందు శరీర ప్రకృతిని పూర్తిగా పరిశీలించి, మలద్వారం దగ్గర పూర్తిగా పరీక్ష చేసి, కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి, తరువాత చికిత్స చేస్తే సులభంగా తగ్గించవచ్చు.
అర్శమొలల్లో మొదటి రెండు దశల్లో మలవిసర్జన సులభంగా అయ్యేటట్లుగా ఔషధాలతో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గిపోతుంది.
మూడవ దశలో క్షారకర్మ అనే చికిత్స ఉత్తమంగా ఉంటుంది.
నాల్గవ దశలో మొదట రక్తస్రావం తగ్గడానికి ఔషధాలతో చికిత్స చేసి, క్షారసూత్ర చికిత్స చేస్తే అర్శమొలలు పూర్తిగా తొలగిపోతాయి.
క్షారకర్మ, క్షారసూత్ర చికిత్స చేయడం వల్ల మొలలు తొలగిపోవడమే కాకుండా మలద్వారం చుట్టుపక్కల మళ్లీ మొలలు రాకుండా ఉంటుంది.