పెట్టుబడుల్లో..అనుభవమే మార్గదర్శి


Sat,July 28, 2018 12:43 AM

తన ఆలోచనా తీరే ప్రతీ మదుపరి విజయానికి సోపానం. నైపుణ్యం, కాలం ఈ రెండూ కూడా అత్యంత ప్రధానం. అలాగే అనుభవం, వివేకం మదుపరుల నిర్ణయాలను ప్రతిబింబిస్తాయి. నిజానికి మదుపరుల స్వభావాన్ని వారి ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
successful-investor
పెట్టుబడికి అవకాశమున్న మదుపరులు ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారుల కోసం చూస్తున్నప్పుడు వారిలో నైపుణ్యం కొరత, తీరిక లేమి కనిపిస్తున్నాయి. ఇందుకు ఇతరత్రా కార్యకలాపాల్లో తలమునకలై ఉండటమే కారణం కావచ్చు. దీనివల్లే దీర్ఘకాలిక పెట్టుబడులపైనా దృష్టి పెట్టలేకపోతున్నారు. అవగాహన, సమయం లేకనే పోర్ట్‌ఫోలియో, ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నామని చాలామంది మదుపరులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చు. ప్రయత్నిస్తే ఈ అవరోధాలనూ అధిగమించవచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ ద్వారా పోర్ట్‌ఫోలియో రూపకల్పన, పరిశీలన, అమరికలపై వ్యయ సంబంధిత అంశాలు తెలియవచ్చు. కానీ అనుభవం, విజ్ఞానం ద్వారానే వివేకవంతమైన ఆలోచనా తీరును అందిపుచ్చుకోగలమన్న విషయాన్ని మరువరాదు. పెట్టుబడి విషయాల్లో చాలాసార్లు మదుపరుల వైఖరే పోర్ట్‌ఫోలియోల ప్రదర్శనను దెబ్బతీస్తుంది. ఉదాహరణకు గణాంకాల సమీకరణ అన్నది ఓ నైపుణ్యం. వీటి ఆధారంగా తమ ప్రయోజనాలను, లాభాలను అంచనా వేసుకోవడం తర్వాతి ప్రధానాంశం. ఈ పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్న పక్షంలో గత అనుభవాల ప్రతిపాదికన భవిష్యత్ కార్యాచరణను నిర్మించుకోవడం మీ వివేకానికి నిదర్శనంగా నిలుస్తుంది.

రేపటి రోజున మార్కెట్ ఎలా ఉంటుందన్నదానిపై మనకు ఆందోళన అక్కర్లేదు. కానీ ఆ రోజున మనం మార్కెట్‌పట్ల ఎలా స్పందిస్తామన్నదే కీలకం అని ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్ అన్నారు. సరికొత్త స్థాయిలను అందుకునే అవకాశాన్ని మార్కెట్లు చేజార్చుకున్నాయన్న దానిపైనో లేదంటే నష్టాలబారిన పడ్డాయన్న దానిపైనో మదుపరులకు బాధ కలుగవచ్చని చెప్పారు. స్టాక్ మార్కెట్ సరళిపై బఫెట్ స్థూల విశ్లేషణ ఇది. సరిగ్గా గమనిస్తే స్టాక్ మార్కెట్ల విషయంలో మదుపరుల తపన ఇంతకుమించి ఉండదన్న విషయం మనకూ అవగతమవుతుంది. కాబట్టి పడిలేచే స్టాక్ మార్కెట్ల విషయంలో లోతుగా మదనపడటం మానేయడమే ఉత్తమం. మన చుట్టూ చోటుచేసుకునే పరిణామాల నియంత్రణ మన చేతుల్లో ఉండదన్న విషయం గుర్తించాలి. పెట్టుబడులకు సంబంధించిన రంగాలన్నీ కూడా ఇంచుమించు ఒడిదుడుకులకు లోనయ్యేవే.

పెట్టుబడులను అనేకానేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. సహజంగానే ఒక్కో రంగం.. ఒక్కో కారణం చేత పెరుగడమో, తగ్గడమో జరుగుతూ ఉంటుంది. వాటిపై అవగాహన ఏర్పరుచుకోవడం ముఖ్యం. ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు.. కోర్టు తీర్పులు కావచ్చు.. దేశ, విదేశీ పరిస్థితులు కావచ్చు.. ఏదైనా కావచ్చు. తద్వారా మార్కెట్లు పరుగులు పెట్టడమో లేదా పడకేయడమో జరుగవచ్చు. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లు లేదా ఆయా రంగాలు ఎలా స్పందించాయన్నది తెలుసుకోవడమే మన పెట్టుబడులకు శ్రీరామరక్ష. పెట్టుబడులకు ముందు పూర్వాపరాలపై ఓ అవగాహన తెచ్చుకుంటే చాలు. మన కష్టార్జితానికి విలువ పెరుగుతూపోతుంది. మొత్తంగా మన అనుభవమే మనకు అసలు సిసలైన మార్గదర్శి. మన పెట్టుబడులకు దిశా-నిర్దేశం చేసేది కూడా అదే.

కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు, వెలాసిటీ,
వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
knk@wealocity.com

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles