పులులకు జ్ఞాపకశక్తి ఎంతంటే?


Sat,August 4, 2018 11:38 PM

పిల్లలూ! మన జాతీయ జంతువు పులి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటిల్లో ముఖ్యమైంది వాటి జ్ఞాపకశక్తి, బలం, వాటి పిల్లల సంరక్షణ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
Jeevajalam
పులి పిల్లలకు అవి పుట్టిన వారం రోజుల వరకూ కళ్లు కనిపించవు. ఇవి ఆహారం విషయంలో చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత.. ఇంకా మిగిలితే, దాన్ని ఎక్కడైనా దాచి, మళ్లీ ఆకలి వేయగానే తింటాయి. పులులు తమకంటే రెండు రెట్లు పెద్దవైన జీవులను కూడా చాలా తేలిగ్గా చంపేయగలవు. పులి పిల్లలు రెండేండ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే, అవి 18నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో బాగా నైపుణ్యం సంపాదించాకే తల్లిని వదిలి వెళతాయి. పులులు ఎక్కువగా ఒంటరిగా వేటాడడానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే ఎక్కువగా వేటాడతాయి. ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయి.

ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా.. దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు. పులులకు మిమిక్రీ చేయడమూ తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి. వీటి జ్ఞాపకశక్తి మనుషుల కంటే 30 రెట్లు ఎక్కువ. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే.. చనిపోయేవరకూ మర్చిపోవు. పులి పిల్లల్లో ఎక్కువగా రెండేళ్లలోపే చనిపోతుంటాయి. పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒకే ఉదుటున ఐదుమీటర్ల దూరం దూకగలవు.

470
Tags

More News

VIRAL NEWS