పిల్లల అభివృద్ధికి ఖజానా!


Sun,December 16, 2018 01:09 AM

బడికి వెళ్లమంటే మారాం చేస్తుంటారు కొందరు పిల్లలు. చదువుల కోసం లక్షలకు లక్షల ఫీజులు చెల్లిస్తున్నాం అంటూ బాధపడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. కానీ చదువుకోవాలని ఉన్నా.. సరైన వసతులు లేక ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారని తెలుసా? అలా చదువుకు దూరమై రోడ్డున పడ్డ కొంతమంది పిల్లలే చిల్డ్రన్ డెవలప్‌మెంట్ ఖజానా అనే జీవిత నైపుణ్య కార్యక్రమాన్ని నడుపుతున్నారు. ఈ ఖజానా ఏం చేస్తుంది? ఎలా నడుస్తున్నది..
Studets
దక్షిణాసియా దేశాల్లో 385 మిలియన్ల పిల్లలు సరైన వసతులు లేక చదువుకు దూరమై రోడ్డున పడుతున్నారు. తల్లిదండ్రులు ఉన్నా వారి జీవితంలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఇక ఎవరూ లేని అనాథపిల్లల పరిస్థితి ఏమిటి? అందుకే వారి కోసం ఓ ఎన్‌జీవో ముందుకొచ్చింది. చిల్డ్రన్ డెవలప్‌మెంట్ ఖజానా (సీడీకే) పేరుతో.. పిల్లలకు జీవిత నైపుణ్యం, విద్యా కార్యక్రమాలను, ప్రజాస్వామ్య విలువలను బోధిస్తున్నది. 9 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసున్న వీధిపిల్లల పూర్తి బాధ్యతను తీసుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. చదువుతో పాటు చిన్న పనులు చేసి వచ్చిన డబ్బును డిపాజిట్ చేయడం, వాటితో మంచి పనులు చేపట్టడం లాంటివి కూడా నేర్పుతారు. కొత్తగా వచ్చిన పిల్లలను చేర్చుకుంటారు. వారికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తారు. తరువాత ప్రతీ ఒక్కరికి పాస్‌బుక్ ఇస్తారు. వారు చేయాల్సిన పనుల గురించి వివరిస్తారు. వీరికి పాఠాలు, బాధ్యతలు నేర్పించేది ముందు నుంచి ఉన్న సీనియర్ పిల్లలే. ఈ బ్యాంక్ వివరాలన్నీ కూడా వీరే చూసుకుంటారు. ఎవరూ పెద్దవాళ్లు లేరు. 2001 నుంచి జమ్ముకశ్మీర్, కేరళ, ఢిల్లీ, బిహార్, జార్ఖండ్, ఒడిస్సా, రాజస్థాన్, అండమాన్ నికోబార్, మహారాష్ట్రలో సీడీకెని నడుపుతున్నారు. మన దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఏడు దేశాల్లో ఈ సంస్థ ఉంది.

పిల్లల కోసం..

సీడీకే ఖజానా బాధ్యతల్ని కొంతమంది పిల్లలు నిర్వహిస్తారు. ఎన్నికల ద్వారా వారిని ఎంచుకుని బాధ్యతలు అప్పగిస్తారు నిర్వాహకులు. ఆరునెలలకి ఒకసారి ఎన్నికలుంటాయి. ఎవరైతే దీనికి అర్హులో వారిని ఎన్నుకునే అవకాశం పిల్లలకే ఉంటుంది. ఎక్కువ మెజారిటీ వచ్చిన వారు చైల్డ్ వలంటీర్ మేనేజర్ (సీవీఎం). రెండవ స్థానంలో ఉన్నవారు చైల్డ్ వలంటీర్ మేనేజర్ సహాయకుడిగా పదవుల్లో ఉంటారు. మాజీ మేనేజర్ వారికి పూర్తి శిక్షణ ఇస్తారు. క్యాష్‌బుక్, లెడ్జర్ బుక్, పాస్‌బుక్‌ల వివరాలు అన్నింటినీ కొత్తవారికి అప్పగిస్తారు. ప్రతీ ఒక్కరూ వారి డబ్బులను సంస్థ అకౌంట్‌లో కాకుండా పర్సనల్ సీడీకే అకౌంట్‌లో డిపాజిట్ చేసుకుంటారు. అనవసర ఖర్చులకి డబ్బును వృథా చేయకుండా జాగ్రత్తగా దాచుకోండని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటారు. తల్లిదండ్రులు సొంతిల్లు కట్టుకోవడానికి, ఆరోగ్యం విషయంలో, స్కూల్ ఫీజ్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్న వారిని సీడీకే పిల్లలు ఆదుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సీడీకేలో 16,912 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటివరకు రూ. 59,01,827 డిపాజిట్ చేశారు. అందరినీ సమానంగా చూడడం కూడా ఇక్కడ నేర్పుతారు.

ఎన్‌జీవో బటర్‌ఫ్లయిస్..
Studets1
ఎన్‌జీవో బటర్‌ఫ్లయిస్‌ని రీటా పనికర్ స్థాపించారు. 1989లో ఈ సంస్థని కొంతమంది పిల్లలతో మొదలుపెట్టారు. రీటాతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ప్రవీణ్ నంగియా వీధిపిల్లల కోసం కొన్ని సర్వేలు నిర్వహించారు. పిల్లలు పడుతున్న కష్టాలు వాటిని అనుభవించిన వారికే అర్థమవుతాయని కొంతమంది పిల్లలకే సంస్థ బాధ్యతల్ని అప్పగించారు. బటర్‌ఫ్లయిస్ చైల్డ్ హెల్త్ కోఆపరేటివ్, పిల్లల మీడియా, రెసిలియన్స్ సెంటర్ చిల్డ్రన్, చైల్డ్ సోషల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లు కూడా నడుపుతున్నారు. పిల్లల శ్రేయస్సుకు సంబంధించిన కార్యక్రమాలకు చురుకుగా మద్దతునిస్తున్నదీ సంస్థ. రోజువారీ సవాళ్లను, భవిష్యత్తులో అడ్డంకులను ఎదుర్కొనేలా వారిని తయారు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
వనజ వనిపెంట

499
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles