పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు- రకాలు- లక్షణాలు


Tue,August 21, 2018 01:25 AM

సలహా

Boy
ప్రపంచంలో ఎంతటి విధ్వంసం జరిగినా, భయంకర ఉత్పాతం వచ్చినా తల్లిదండ్రి ఒడిలో ఉంటే తమకేమీ కాదనుకునే అమాయకత్వం పిల్లలది. కానీ క్యాన్సర్‌కు అలాంటి మొహమాటాలేవీ ఉండవు. శత్రువులను దునుమాడే అరివీర భయంకరుడైన ప్రపంచ విజేత కొడుకుకు క్యాన్సర్ వచ్చినా అంతటి వీరుడూ దానిముందు నిస్సహాయుడే. కానీ ఒక శుభవార్త. చాలా రకాల పిల్లల క్యాన్సర్లు ఇప్పుడు చికిత్స ముందు లొంగిపోతుండటం విశేషం.


పెద్దవారిలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లూ పిల్లల్లోనూ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ప్రధానంగా వాళ్లలో రక్తసంబంధిత క్యాన్సర్లు (లుకేమియా), మెదడు కణుతులు (బ్రెయిన్ ట్యూమర్స్), లిఫోమా, సాఫ్ట్ టిష్యూ సార్కోమా వంటివి ఎక్కువ. పిల్లల్లో వచ్చే క్యాన్సర్‌లు సాధారణంగా ఎలాంటి లక్షణాలూ చూపకపోవచ్చు. అకస్మాత్తుగా జ్వరంతో బయటపడవచ్చు. పరిపరి విధాలుగా ప్లాన్ చేసుకొని ఒకరినో, ఇద్దరినో కన్న తల్లిదండ్రులకు తమ చిన్నారికి క్యాన్సర్ అని తెలిస్తే వాళ్లకు అది అశనిపాతంగా పరిణమిస్తుంది. తీవ్రమైన వేదనకూ, కుంగుబాటుకూ లోనవుతారు. కొంతలో కొంత ఉపశమనం ఏంటంటే పిల్లల క్యాన్సర్లు చాలావరకు పూర్తిగా నయం చేయదగినవే.


రేడియేషన్..

మనదేశంలో ప్రతీ ఏడాది దాదాపు 45000 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీళ్లలో 70% మందికి వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే 30% మందిలో వారి జీవితకాలంలో అది ఎప్పుడో ఒకప్పుడు తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. చిన్నప్పుడు 20 గ్రేల కంటే ఎక్కువగా రేడియేషన్‌కు గురైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గ్రే అంటే శరీరం గ్రహించిన రేడియేషన్ అని అర్థం. మామోగ్రామ్ వంటి పరీక్షలు మరీ చిన్నవయసులో చేయించుకోవడం కూడా అంత మంచిది కాదు. 30ఏళ్లు పైబడ్డాక డాక్టర్ సలహా మేరకు చేయించుకుంటేనే మంచిది. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలావరకు కీమో, రేడియేషన్‌కు స్పందిస్తాయి. పిల్లలు రేడియేషన్ తీసుకునేటప్పుడు ఒంటరిగా ఉండటానికి భయపడి చికిత్సకు సహకరించకపోతే కొన్ని సందర్భాల్లో వారికి మత్తు ఇస్తారు. 12 ఏళ్లు పైబడ్డాక అమ్మాయికి గానీ, అబ్బాయికి గానీ క్యాన్సర్ చికిత్స వల్ల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం పడుతుందనుకుంటే అలాంటప్పుడు ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరుస్తుంటారు.


లుకేమియా..

పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ లేకేమియా, మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడే తెల్లరక్త కణాలు అపరిమితంగా పెరిగిపోవడమే లేకేమియా. ఇలా అధికంగా పెరిగిన తెల్ల రక్తకణాలు ఎర్ర రక్తకణాలను అడ్డుకొని రక్తాన్ని సరిగా సరఫరా కానివ్వవు. ఇలాగా ఒక్కసారిగా జరగడం కానీ లేదా దీర్ఘకాలికంగా గానీ జరగవచ్చు. చాలావరకు నయం చేయగలిగే ఈ చికిత్సలో కీమో, రేడియో థెరఫీలు ఉంటాయి. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, స్టెమ్‌లెస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు ఈ క్యాన్సర్‌కు బాగా పనిచేస్తాయి. మొదటి బిడ్డకు రక్తసంబంధిత క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో కూడా జాగ్రత్త పడాలి.


లుకేమియా లక్షణాలు..

పిల్లలు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలు మచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. రక్త పరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి తీసిన మూలగ (బోన్‌మ్యారో)ను పరీక్షించడం ద్వారా ఈ క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు.


మెదడు కణితి..

పెద్దవాళ్లలో కంటే పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువని చెప్పొచ్చు. పొద్దున్నే లేవగానే త్రీవమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తించే తీరుమారడం, ఆందోళన, ఫిట్స్, చూపు/మాట మందగించడం వంటి లక్షణాలను మెదడు కణితిగా అనుమానించాల్సి ఉంటుంది. అది క్యాన్సర్ కణితి అయినా, కాకపోయినా రెండూ ప్రమాదకరమే. మెదడులో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి సర్జరీతో దాన్ని తొలగించడమో లేక ఇతర చికిత్స ప్రక్రియలు అనుసరించడం మంచిదా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని చికిత్సను నిర్ణయిస్తారు. ఒక్కోసారి మెదడు కణితిని రేడియో సర్జరీతో తొలగిస్తారు.


లింఫ్ నాళ క్యాన్సర్..

రోగ నిరోధక వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించే లింఫ్ నాళాలకు సంబంధించిన క్యాన్సర్‌లో హాడ్జ్‌కిన్స్, ఆనన్ హాడ్జ్‌కిన్స్ అనే రకాలుంటాయి. మెడ, చంకల్లో, గజ్జల్లో లింఫ్ నాళాలు వాయడం, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చెమటలు పట్టడం, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలతో లిఫోమాలు బయటపడుతుంటాయి. ఇతర టిష్యూలను కలిపే సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌ను సాఫ్ట్ టిష్యూ సార్కోమా అంటారు. ఎముకలను, కండరాలను కలిపే ఈ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్ లక్షణాలు.. వచ్చిన ప్రదేశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ టిష్యూలకు సాగే గుణం ఉండటం వల్ల తొలిదశలో లక్షణాలు బయటపడవు. సాఫ్ట్ టిష్యూలలో వచ్చే క్యాన్సర్‌కు ప్రధానంగా సర్జరీ, అవసరాన్ని బట్టి దానికంటే ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలుంటాయి. అండాలలో, టెస్టిస్‌లో వచ్చే జెర్మ్‌సెల్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో ఎక్కువ.


చికిత్స..

రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్ గ్రంథిలో, మెడ, ఛాతీ, పొట్ట, పెల్విస్‌లలో వచ్చే కణితులు (న్యూరో) బ్లాస్టోమాలు, ఎముకలు, టిష్యూలలో వచ్చే ఈవింగ్ సర్కోమా, మూత్రపిండాల్లో వచ్చే నెఫ్రోబ్లాస్టోమా వంటివి పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు. పిల్లల్లో పూర్తిగా నయం చేయగలిగిన ఈ క్యాన్సర్స్ పెద్దవాళ్లలో కనిపిస్తే మాత్రం అంతే తేలిగ్గా నయం కాకపోవచ్చు. పిల్లల్లో అరుదుగా కనిపించే మిగతా క్యాన్సర్స్ అదుపులోకి రావడం కష్టం కావచ్చు. లేదా ఎంతగా ప్రయత్నించినా చికిత్సకు లొంగకపోవడం జరగవచ్చు. పుట్టుకతో వచ్చే లోపాలు, జన్యు సంబంధమైన కారణాలు పిల్లల్లో క్యాన్సర్స్‌కు దారితీయవచ్చు. కాబట్టి ముందు పుట్టిన బిడ్డకు క్యాన్సర్ ఉంటే రెండో బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండటం, లక్షణాలు గుర్తించి సరైన చికిత్స అందించడం, పోషకాహార లోపాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం, చికిత్స తర్వాత కూడా డాక్టర్ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
vamshi

71
Tags

More News

VIRAL NEWS