పిల్లలకు కూడా క్యాన్సరా..?


Wed,January 17, 2018 11:06 PM

మా పాప వయసు 3 సంవత్సరాలు. కొద్ది రోజుల క్రితం ఒక వారం పాటు జ్వరం వచ్చింది. ఆ సమయంలో కాళ్లలో తీవ్రమైన నొప్పితో బాధపడింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆయన పరీక్షించి మా పాప పాలిపోయినట్లు కనిపిస్తోందని రక్తపరీక్షలు చేయించారు. అవి చూసి క్యాన్సరేమో అనే అనుమానం వెలిబుచ్చారు. మాకేమీ పాలుపోవడం లేదు. 3 సంవత్సరాల వయసులో కూడా క్యాన్సర్ వస్తుందా? అలా వస్తే చికిత్స ఏముంటుంది? దయచేసి పూర్తి వివరాలు తెలియజేయగలరు.
నాగేందర్, గోదావరిఖని

childcancer
ఏ వయసు వారికైనా క్యాన్సర్ రావచ్చు. క్యాన్సర్ రావడానికి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ పాప అక్యూట్ లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఇందులో జ్వరం, కాళ్లలో విపరీతమైన నొప్పి, లోపలి భాగాల్లో రక్తస్రావం, లివర్, ప్లీహం పరిమాణం పెరిగిపోవడం, లింఫ్‌నోడ్స్‌లో వాపు వంటి లక్షణాలు ఉంటాయి. అందరిలో అన్ని లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరంతో పాటు ఒకటి రెండు ఇతర లక్షణాలు ఉండొచ్చు. లక్షణాలు కనిపించి రక్త పరీక్ష కూడా అనుమానాస్పదంగా అనిపిస్తే క్యాన్సర్‌ను నిర్ధారించడానికి బోన్‌మ్యారో ఆస్పిరేషన్ టెస్ట్ అనే ఎముకమజ్జ పరీక్ష చెయ్యాల్సి ఉంటుంది. బోన్‌మ్యారోలోని కణస్థితిని బట్టి ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అనేది నిర్ధారించవచ్చు. ఇప్పుడు ప్రతి ఆరోగ్య సమస్యకు ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటున్నది. క్యాన్సర్‌కు మందులతో చేసే చికిత్సను కీమోథెరపీ అంటారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు చాలా అభివృద్ధి చెందాయి.

అయితే ఈ చికిత్స ప్రత్యేకంగా నిపుణులు అందుబాటులో ఉన్న చోట తీసుకోవడం తప్పనిసరి. కీమోథెరపీ చికిత్స అందిస్తున్న సమయంలో ఎదురయ్యే సమస్యలను వెంటవెంటనే గుర్తించి దానికి తగిన పరిష్కారాలు సూచించాల్సి ఉంటుంది. ఈ చికిత్సా కాలంలో త్వరగా ఇన్‌ఫెక్షన్లు సోకవచ్చు, రక్తస్రావ సమస్య రావచ్చు. ఇప్పుడు మల్టీమోడాలిటీ విధానంలో కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఇన్‌ఫెక్షన్లను అదుపుచెయ్యడం, పౌష్టికాహారం అందించడం వంటి అన్ని జాగ్రత్తలు చికిత్సతో పాటు అందిస్తున్నారు. ఇప్పుడు మనదేశంలో కూడా పాశ్చాత్య దేశాలతో సమానంగా క్యాన్సర్ చికిత్సలో మంచి ఫలితాలను సాధిస్తున్నారు. కాబట్టి మీరు క్యాన్సర్ అనగానే కంగారు పడాల్సింది ఏమీ లేదు. మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లు చాలా వరకు చికిత్సతో తగ్గిపోతాయి.
sshirisha

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles