పిలుస్తున్నది పదవోయి


Thu,August 9, 2018 11:15 PM

ఎటుచూసినా పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలు. ఆకాశాన్ని తాకుతున్నట్లు పెరిగిన వృక్షాలు, జలజలాపారే జల పాతాలు, కిచకిచమంటూ విహరించే పక్షుల కిలకిలరావాలు, కొండ కోనల్లో సందడిచేసే వన్యప్రాణులు, దట్టమైన అడవుల నడుమ మానవనిర్మిత కుటీరాలు. వాటిల్లో బెడ్‌రూమ్, బాత్‌రూమ్, ఏసీ, టీవీ ఇలా ఎన్నో ఆధునిక వసతులు. ఇవ్వన్నీ మన తెలంగాణలోనే. రాష్ట్రంలోని అడవులు, అభయారణ్యాల్లో దాగి ఉన్న ప్రకృతి వింతలను, అద్భుతాలను పర్యాటకులు వీక్షించేలా అటవీశాఖ ఇంటిగ్రేటెడ్ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నది.
viharam
నయగరా జలపాతాన్ని గుర్తుకు తెచ్చేలా కనువిందు చేసే అద్భుత జలపాతం, దట్టమైన అడవుల మధ్య నిర్మించిన వనకుటీరాలు, ఎత్తయిన పురాతన సమాధులు, సాహసికులను రా రమ్మని పిలుస్తున్న ట్రెక్కింగ్ స్పాట్‌లు. అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించిన వేలాడే లక్నవరం వంతెన. రెండేళ్లకోసారి పట్నంమంతా అడవిలో వాలే సమ్మక్కసారక్కల వనజాతర ఒక్కటేమిటీ ఎటు చూసినా అద్భుతాలే.

ట్రైబల్ సర్క్యూట్


పర్యాటక రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం అభయారణ్యం, తాడ్వాయి, బొగతా జలపాతం, లక్నవరం చెరువు, మేడారం, మల్లూరు, దామరవాయిలను కలుపుతూ ట్రైబల్ సర్క్యూట్ టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దు తున్నారు.

అందమైన కుటీరాలు


ఏటూరు నాగారం అభయారణ్యంలోని తాడ్వాయి దగ్గర పర్యాటకులు బస చేయడానికి ఆరు కుటీరాలు ఏర్పాటుచేశారు. ఒక్కొక్క కుటీరాన్ని పక్షులు, జంతువుల చిత్రాలతో చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. కుటీరం అద్దె ఒక్క రాత్రికి రూ.1,000(ఒక్కరికి), ఎటూ చూసినా పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, ఏకాంతాన్ని కోరుకునేవారికి అద్భుతమైన ప్రాంతమిది. వీటిలో డబుల్ బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, ఏసీ, టీవీ ఇలా అన్ని రకాల వసతులున్నాయి. రాత్రం తా వీటిల్లో బస చేయవచ్చు.

కోరుకున్న ఆహారం


ఆర్డర్‌పై సర్వ్ చేస్తారు. రాత్రిపూట క్యాంపుఫైర్, ఆటలు, పాటలు మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఉదయాన్నే అడవిలో సుమారు ఐదు కిలోమీటర్ల సైక్లింగ్ ఉంటుంది. బ్లాక్‌బెర్రీ ఐలాండ్ సందర్శనతో పాటు, కొండేటి వ్యూపాయింట్ నుంచి బర్డ్‌వాచింగ్ అవకాశం ఉంది. కుటీరాలకు దగ్గరలోనేఉన్న గిరిజన మ్యూజియం సందర్శించవచ్చు. కుటీరాల్లో ఉండాలంటే ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకోవాలి.

సమ్మక్క సారలమ్మల గద్దెలు


కుటీరాలకు 14 కి.మ్లీ దూరంలో ప్రతి రెండేళ్లకోసారి కోటిజనంతో అలరారే మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలున్నాయి. జాతర సమయం లో ఇసుకేస్తే రాలని జనంతో అలరారే మేడారం నిశ్శబ్దంగా స్వాగతం పలికే దృశ్యం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది.

లక్నవరం చెరువు


కాటేజీల నుండి లక్నవరం చెరువు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరస్సు వద్ద ఇప్పటికే రెస్టారెంట్లు, కుటీరాలు నిర్మించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ సరస్సు చిన్నచిన్న దీవులతో మనోహరంగా ఉంటుంది. ఆ దీవుల అనుసంధానంగా దీనిపై వేలాడే వంతెనను నిర్మించారు. ఇది ఆధునిక ఇంజనీరింగ్ ప్రతిభను చాటుతుంది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో ఇక్కడ వసతులు కల్పించారు. బోటింగ్, జెట్టీలు ఏర్పాటు చేశారు. దీనికి చేరువలోనే ప్రఖ్యాత రామప్ప గుడి, రామప్ప చెరువు ఉన్నాయి.

ఎత్తయిన సమాధులు


ఆదిమ మానవుల కాలం నాటి దామెరవాయి రాక్షస గుహలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. క్రీస్తుపూర్వం నాటి వందల సమాధులున్న దామరవాయి వద్ద విజ్ఞాన కేంద్రాన్ని, నాటి మానవ మనుగడ ఎలా ఉండేదో తెలిపే వీడియో, ఆడియో ప్రదర్శనశాల, మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఏ డేట్ విత్ నేచర్, స్టే హెల్దీ -గో గ్రీన్, వాక్-ఇన్ వైల్డ్ అన్న నినాదాలతో ఎకో-టూరిజం వైపు ప్రజలను ఆకర్షించటానికి ప్రభుత్వం అటవీప్రాంతాల్లోని దర్శనీయ స్థలాలను గుర్తించి ఎకోటూరిజం క్యాలెండర్‌ను రూపొందించింది. అభయారణ్యంలో పర్యాటకుల సందర్శనకు ప్రత్యేక వాహనాలను సమకూరుస్తున్నారు.

బొగత జలపాతానికి


viharam2
కుటీరాలకు మరోవైపు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉంటుంది. ఈ నదిపై నిర్మించిన సుదీర్ఘవంతెనపై ప్రయా ణం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. వర్షాకాలం కావడంతో నిండుగా ప్రవహించే గోదావరిని చూస్తూ వంతెనపై ప్రయాణిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. వంతెన దాటిన తర్వాత జయశంకర్ జిల్లా పరిధిలోని వాజేడు మండలంలో కొలువుదీరిన బొగత జలపాతం ఉంటుంది. తెలంగాణ నయగరాగా పేరొందిన ఈ జలపాతం వద్ద రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు నిర్మిస్తున్నారు.

సైకిల్ సవారీ


viharam1
పర్యాటకులతో పాటు సాహసాలను ఇష్టపడేవారి కోసం ఈ వనంలో సైకిల్ సవారీకి ప్రత్యేకమైన ట్రాక్ కూడా ఉంది. సైకిళ్లు అద్దెకు లభిస్తాయి. అరగంటపాటు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, సైక్లింగ్ చేస్తూ.. ఆనందంగా గడపొచ్చు. అడవిలోని అందాలన్నీ చూపించడానికి గైడ్స్ ఉంటారు. అభయారణ్యం విశేషాలన్నీ వివ రిస్తారు. దగ్గరుండి మరీ వనంలోని వింతలన్నీ తిప్పి చూపిస్తారు. ట్రెక్కింగ్, రాక్ క్లయింబ్లింగ్ వంటి ఈవెంట్లతో రెండు రోజులు హాయిగా గడిపేయడానికి అనువైన ప్రాంతమిది.
ఆసక్తి గల వారు www.ecotourism.bhupalpally.com
వెబ్‌సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
మధుకర్ వైద్యుల

1702
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles