పాస్తా పాకం


Thu,June 19, 2014 12:27 AM

వంకాయ.. బీరకాయ..
ఆనపకాయ.. బెండకాయ..
దేశీరుచులను తినితిని బోరుకొట్టేసింది కదా!
పాస్‌పోర్టే లేకుండా..
పొరుగింటి పుల్లకూర రుచి చూడడానికి సిద్ధమా?
స్వదేశం వదిలి.. విదేశీ వంటకాలను ఓ పట్టు పట్టేయండి మరి!
ఇటాలియన్ డిష్.. పాస్తాతో ఈ మెనూ మీ ముందుకొచ్చింది..
ఘుమఘుమలాడే వంటకాలను లొట్టలేసుకుంటూ తినేయండి..

pineer

పన్నీర్ పాస్తా

కావలసిన పదార్థాలు :
పాస్తా - 350గ్రా.
పాస్తాసాస్ - 24మి.లీ.
వెల్లుల్లిపాయలు - 2 రెబ్బలు
పచ్చిమిర్చి - 1
పన్నీర్ - 250గ్రా.
పాలకూర - ఒక కట్ట
క్యారెట్, బీన్స్, కార్న్, బఠాణీ - 2 కప్పులు
ఆలివ్ ఆయిల్ - 2 స్పూన్స్
చీజ్ - కొద్దిగా
మిరపగింజలు - ఒక టీ స్పూన్
ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. ఇందులో పాస్తా వేసి ఉడికించాలి. ఈలోపు పాన్‌లో ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి పాస్తా సాస్ పోయాలి. దీంట్లో క్యారెట్, బీన్స్, కార్న్, బఠాణీలు, పాలకూర వేసి కలపాలి. సన్నని మంట మీద కాసేపు ఉండనివ్వాలి. ఇందులో పన్నీర్, మిరపగింజలు వేసి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద 5నిమిషాలు అలాగే ఉంచాలి. పాస్తాలోని నీళ్లు వడబోసి ఇందులో కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చీజ్‌తో గార్నిష్ చేయాలి. పన్నీర్ పాస్తా రెడీ!

green-pasta-salad

గ్రీన్ పాస్తా సలాడ్

కావలసిన పదార్థాలు :
పాస్తా - ఒక కప్పు, పాలకూర తరుగు - పావు కప్పు, పచ్చిమిరపకాయలు - 2
వెన్న - ఒక టీ స్పూన్, మిరియాలపొడి - పావు టీ స్పూన్
నిమ్మరసం - ఒక టీ స్పూన్, చీజ్ తురుము - 2 టీ స్పూన్, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
పాలకూర కడిగి వేడి నీళ్ళలో వేసి పదినిమిషాలు ఉంచాలి. చల్లారాక తీసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు మరిగించి పాస్తా వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి మెత్తబడేవరకు ఉడికించి జల్లెడలో వేయాలి. వెంటనే పాస్తా మీద చల్లటి నీళ్లు పోయాలి. దీనివల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. పాన్‌లో వెన్న కరిగించి పచ్చిమర్చి వేసి వేయించాలి. దీంట్లో పాలకూర పేస్ట్ వేసి కలపాలి. బాగా వేగాక ఇందులో ఉడికించిన పాస్తా, ఉప్పు, మిరియాలపొడి వేసి మరో రెండునిమిషాలు ఉంచి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, చీజ్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

Lemon-Garlic-Chicken-Pasta

చికెన్ పాస్తా

కావలసిన పదార్థాలు :
పాస్తా - ఒక కప్పు, చికెన్ - పావుకేజీ (బోన్‌లెస్), వెల్లుల్లిపాయలు - 4బ్బలు
ఆలివ్ ఆయిల్ - 5 టీ స్పూన్స్, మిరపగింజలు - ఒక టీ స్పూన్
నిమ్మరసం - 4 టీ స్పూన్స్, చీజ్ - కొద్దిగా, మిరియాలపొడి - ఒక స్పూన్, ఉప్పు - తగినంత

తయారుచేసే విధానం :
ఒక పాన్‌లో ఆలివ్ ఆయిల్ పోసి వెల్లుల్లిపాయలు, మిరపగింజలు వేయించాలి. దీంట్లో చికెన్ ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు వేసి వేయించాలి. సన్నని మంట మీద అలాగే ఉంచాలి. పక్కన మరో గిన్నెలో పాస్తాను కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. నీళ్లను వడబోయాలి. దీంట్లో ముందుగా వండుకున్న చికెన్‌ని వేసి బాగా కలపాలి. సన్నని మంటమీద కాసేపు వేగనివ్వాలి. చివరగా నిమ్మరసం, చీజ్ వేసే సర్తిపోతుంది. పైనుంచి కొద్దిగా ఆలివ్ ఆయిల్‌పోస్తే కూర మరింత ఉంటుంది. చికెన్ పాస్తా మీ నోరూరించక మానదు!

pastakheer

పాస్తా పాయసం

కావలసిన పదార్థాలు :
పాస్తా - 3/4కప్పులు, పాలు - 3 కప్పులు, కండెన్స్‌డ్ మిల్క్ - 3/4 కప్పు
చక్కెర - నాలుగు స్పూన్స్, యాలకులు - 3
కార్న్‌ఫ్లోర్ - అర స్పూన్, కుంకుమపువ్వు - కొద్దిగా
జీడిపప్పు - 10, పిస్తా - 5, బటర్ - అర స్పూన్

తయారుచేసే విధానం :
పాస్తాను ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. దాదాపు 3/4 వంతులు ఉడకాలి. ఈలోపు పాలను బాగా మరిగించాలి. ఆ వేడి పాలను ఉడుకుతున్న పాస్తాలో పోయాలి. పూర్తిగా ఉడికాక అందులో చక్కెర, కండెన్స్‌డ్ మిల్క్ పోసి కాసేపు ఉంచాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్‌లో కొన్ని పాలుపోసి ఉండలు కట్టకుండా కలిపి ఆ మిశ్రమాన్ని పాస్తాలో వేయాలి. ఇప్పుడు పాయసం చిక్కబడేంతవరకు సన్నని మంట మీద అలాగే ఉంచాలి. యాలకులను వేసి మరికాసేపు ఉంచాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా బటర్ వేసి జీడిపప్పు, పిస్తాలను వేయించి పాయసంలో కలపాలి. చివరగా కుంకుమపువ్వు వేసి దించేయాలి. తియ్యని పాస్తా పాయసం తినడానికి సిద్ధమైనట్లే!

3637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles