పాతచీరెలకు.. కొత్త శోభ!


Tue,August 14, 2018 01:37 AM

shobha-devi
వరంగల్ నిట్ విద్యార్థులు భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ తయారు చేస్తున్నారట తెలుసా? ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌పై యుద్ధమే జరుగుతున్నది. ఈమె కూడా తన వంతుగా అలాంటి ప్రయత్నమే చేస్తున్నది. ప్లాస్టిక్ వాడకూడదని.. ప్రత్యామ్నాయం కోసం వెతికితే పాత చీరెలు కనిపించాయి.. వాటినే ఆయుధంగా చేసుకొని సంచులు కుట్టిస్తున్నది.. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి మార్గాన్ని కూడా కల్పిస్తున్నది. మరి ఆ మార్పునకు కారణమైన శోభాదేవిని పరిచయం చేసుకుందామా!


ఎన్ని వందలు.. వేలు పెట్టి కొన్న చీరైనా పాతగా అయిపోతుంది. అప్పుడేం చేస్తారు? బొంతలు కుట్టించుకోవడమో లేక స్టీల్ సామాన్లకో వేసేస్తారు. అందరూ ఆలోచించినట్లే ఆలోచిస్తే శోభ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. ప్లాస్టిక్ వాడొద్దని ప్రభుత్వాలు చెబుతున్నా.. వాటికి ప్రత్యామ్నాయం లేక వాటినే కొనసాగిస్తున్నారు చాలామంది. ఇక్కడే శోభ ఆలోచన మొదలైంది. అయితే ఈ ఆలోచన వెనుక ఒక సంఘటన జరిగింది. ఒంట్లో బాగోలేక ఆసుపత్రికి వెళ్లింది శోభ. అక్కడ డాక్టర్
సర్జరీ చేయాలి.. ఒకవేళ చేసినా ఎంతవరకు క్యూర్ అవుతుందో చెప్పలేం అన్నారు. అంటే.. తన జీవితం ముగిసినట్లేనా? అనుకుంది. మహిళల కోసం ఈరోజు కూడా తాను ఏం చేయకపోతే ఇన్ని రోజులు జీవించి, ఇక జీవితం కొనసాగించి లాభం లేదనుకుంది. అప్పుడే తన చూపు ఇంట్లో కనిపించిన పాత చీరెల మీద పడింది. వాటిని సంచులుగా మార్చి అమ్మడం మొదలుపెట్టింది. తనతోపాటు మరో నలుగురితో కుట్టించి తాను లాభం ఆశించకుండా వారికి ఉపాధి దొరికేలా చేసింది.


శోభది.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వివేకానంద్‌నగర్‌లో నివాసం. ఇంటర్ చదువుతుండగానే పెళ్లయిపోయింది. ఆ తర్వాత శోభ గృహిణిగా స్థిరపడిపోయింది. చిన్నప్పటి నుంచి కళల పట్ల మక్కువ ఎక్కువ. మెషీన్ కుట్టడం, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, మెహందీ పెట్టడం, పేపర్లలో చిట్కాలు చదివి మెనిక్యూర్, పెడిక్యూర్‌లు చేసుకోవడం అలవాటు చేసుకుంది. తన వరకు ప్రయోగం చేసుకోవడం వరకు బాగానే ఉంది. ఇతరుల మీద ప్రయోగిస్తే బాగోదు కాబట్టి కోర్సు చేయాలనుకొని బ్యూటీపార్లర్‌లో సంవత్సరం పాటు నేర్చుకొని డిప్లొమా పూర్తి చేసింది. ఇంటి దగ్గరే ఒక పార్లర్ స్టార్ట్ చేసింది. కానీ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా పార్లర్ వ్యాపారం దెబ్బతిన్నది. అప్పటికే తాను ఇతరులకు పెయింటింగ్, కుట్టు పని నేర్పించడం చేస్తుండేది. ఇలా ఖాళీగా లేకుండా ఎంతోకొంత సంపాదిస్తూ మరికొంది మందికి ఉపాధి మార్గాన్ని చూపించేది.


సరికొత్త మలుపు: మనం ఒకటి తలిస్తే.. దైవం ఇంకొకటి తలుస్తాడంటారు. శోభ విషయంలో అదే జరిగింది. ఇంట్లో కష్టాలతో సతమతమవుతున్న ఆమెకు ఓరీ ఫ్లేమ్ అనే ఒక కంపెనీ కనిపించింది. దీని ద్వారా నలుగురు మనుషులను కలుసుకోగలిగింది. వ్యాపార సూత్రాలు ఒంటపట్టాయి. అలా ఆ కాస్మొటిక్ కంపెనీ ద్వారా పార్లర్‌ని మళ్లీ మొదలుపెట్టింది. తాను ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. కమ్యూనికేషన్ సిల్క్స్ కూడా పెరిగాయి. అలా ఆమె ఆ వ్యాపారం చేస్తూ డైరెక్టర్ లెవల్ వరకూ వెళ్లింది. అయితే ఇక్కడే పెద్ద కుటుంబాల్లో ఉండే కష్టాలూ అర్థమయ్యాయి. భర్త పెద్ద ఉద్యోగంలో ఉండి.. రూపాయి చేతిలో లేని ఆడవాళ్లను చూశాక మనసు చివుక్కుమందట శోభకి. అందుకే ఆడవాళ్లు సొంతంగా ఎంతోకొంత సంపాదించాలనేది టార్గెట్‌గా పెట్టుకోవాలంటున్నది.


పాతచీరెల ప్రస్థానం: పుట్టినందుకు ఒక సార్థకత ఉండాలనుకునేది శోభ. ఆరోగ్యం బాగాలేనప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు ఆమెపై ప్రభావాన్ని చూపాయి. ఎందుకిలా? జరిగిందని కూర్చొని బాధపడలేదు. తనవల్ల పదిమంది మహిళలకు ఏదైనా చేయూత అందించాలని ఆలోచించింది. అదే సమయంలో తన ఫ్రెండ్ బొటిక్ నుంచి ఫోన్ వచ్చింది. ఆమె పేపర్ బ్యాగుల తయారీ గురించి అడిగింది. కానీ శోభ పేపర్ అంటే మళ్లీ ప్రకృతికి నష్టం కలిగించినట్లనుకుంది. అందుకే ఇంట్లో కనిపించిన పాత చీరెను కట్ చేసి సంచి కుట్టి తన దగ్గరకి తీసుకెళ్లింది. శోభ ఆలోచన మెచ్చిన ఆమె ఫ్రెండ్.. తన దగ్గర ఉన్న పాత తాన్లను బ్యాగులుగా కుట్టమని ఆర్డర్ ఇచ్చింది. తన ఒక్కదానివల్ల అవ్వదు.. అందుకే మరో నలుగురిని పోగేసింది. తాను కట్ చేసి ఇస్తే వారు కుట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. అలా మొదటి ఆర్డర్ పూర్తయింది. ఆ తర్వాత చుట్టుపక్కల వారి చీరెలు తీసుకొని కుట్టి.. పండ్ల షాపులు, కూరగాయల షాపులకు అమ్మింది. ఒక ఎమ్‌ఎన్‌సీ కంపెనీ కూడా ఆమె ఆలోచనకు మెచ్చి స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇలా తన ఆలోచన ఇప్పుడు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నది.
shobha-devi1

చుట్టుపక్కల వారి చీరెలు తీసుకొని కుట్టి.. పండ్ల షాపులు, కూరగాయల షాపులకు అమ్మింది. ఒక ఎమ్‌ఎన్‌సీ కంపెనీ కూడా ఆమె ఆలోచనను మెచ్చి స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించింది.


ప్లాస్టిక్‌పై పోరు..

శ్రావణ మాసం వచ్చింది. వ్రతాలు.. నోములకు ప్లాస్టిక్ బదులు ఇలాంటి సంచులను వాడాలన్నది నా విన్నపం. పాస్టిక్‌కి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని మొదలుపెట్టా. ఒక అడుగు అనేకంటే అర అడుగు ముందుకు వేశా. నాతో పాటు మరికొంతమంది జతకూడితే ఈ యుద్ధాన్ని సరైన రీతిలో పూర్తి చేయగలమనే నమ్మకం ఉంది. చాలామంది చీరెలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. కొందరు మేం చీరెలిస్తే.. మాకేమిస్తారన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ ఈ బ్యాగుల వల్ల కొంతమందికి ఉపాధి దొరుకుతుందనే ఆలోచన చేయండి. ఇప్పటికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చీరెలు ఇస్తున్నాయి. కానీ ఆర్డర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో చీరెల కొరత ఉంది. కాబట్టి ఎవరైనా చీరెలు ఇచ్చేవారు ముందుకొస్తే మరింత సంతోషం. రైజింగ్ ఈవ్స్ పేరుతో ఫేస్‌బుక్ పేజీని కూడా నిర్వహిస్తున్నా. వివరాల కోసం.. 8179836318కి సంప్రదించవచ్చు అని చెప్పింది శోభాదేవి.
సౌమ్య నాగపురి
వీరగోని రజినీకాంత్ గౌడ్

828
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles