పాంక్రియాటైటిస్..ఆపరేషన్ తప్పనిసరా?


Thu,August 16, 2018 01:37 AM

నాకు గత 8 నెలల నుంచి కడుపు నొప్పి వస్తుంది. ఇటీవలే చాలా తీవ్రంగా కడుపునొప్పి వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్యూట్ ప్రాంక్రియాటైటిస్ అని చెప్పారు డాక్టర్లు. స్కానింగ్ చేసి, పిత్తాశయంలో రాళ్లు ఉన్నందువల్ల ఈ జబ్బు వచ్చిందని చెప్పారు. ఆపరేషన్ చేసి పిత్తాశయం తీయాలన్నారు. అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటే ఏమిటి? దీనివల్ల చాలా సమస్యలు వస్తాయా? ఆపరేషన్ తప్పనిసరా? ఆపరేషన్ తరువాత కూడా ఈ సమస్య వస్తుందా? దయచేసి తెలుపగలరు.
- రంజిత, కామారెడ్డి

pancreatitis
పాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కావలసిన జ్యూస్‌ను తయారుచేసే ఏకైక గ్రంథి ఇది. అలాగే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసేది కూడా క్లోమగ్రంథే. క్లోమగ్రంథిలో వచ్చే వాపును అక్యూట్ పాంక్రియాటైటిస్ అంటారు. ఆల్కహాల్ తీసుకోవడం, పిత్తాశయంలో రాళ్లు దీనికి ప్రధాన కారణాలు. కాకపోతే కడుపుకి దెబ్బ తగిలినా, సీరం ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నా ఈ జబ్బు రావొచ్చు. ఇదొక్కటే సీరియస్ కండిషన్. అక్యూట్ పాంక్రియాటైటిస్ వస్తే చాలా తీవ్రంగా కడుపునొప్పి ఉంటుంది. వాంతులు కూడా కావొచ్చు. చాలా ఫ్లూయిడ్స్ వెళ్లిపోతాయి. తద్వారా షాక్ కూడా గురి కావొచ్చు. దీని ప్రభావాలు శరీరంలో ఇతర అవయవాల మీద కూడా చూపిస్తాయి. కిడ్నీ ఫెయిల్ కావడం, బీపీ తగ్గిపోవడం, ఊపిరితిత్తులు డామేజ్ కావడం, గుండె బలహీనం కావడం కూడా కావొచ్చు. ఈ జబ్బు ఉన్నవారికి రక్తంలో సీరం అమైలేజ్, సీరం లైపేజ్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే స్కానింగ్ ద్వారా అక్యూట్ పాంక్రియాటైటిస్‌ని నిర్ధారించవచ్చు. అక్యూట్ పాంక్రియాటైటిస్ ఉన్నవారికి హాస్పిటల్‌లో అడ్మిషన్ అత్యవసరం. ఐసియులో ఉండాలి. సపోర్టివ్ ట్రీట్‌మెంట్‌తో చాలామందికి ఉపశమనం కలుగుతుంది. కొంతమందిలో కాంప్లికేషన్స్ రావొచ్చు. దీనివల్ల కడుపులో పాంక్రియాటిక్ సిస్ట్, పాంక్రియాస్ కుళ్లిపోతే (పాంక్రియాటిక్ నెక్రోసిస్) వాటిలో ఇన్‌ఫెక్షన్ రావొచ్చు. అప్పుడు యాంటిబయాటిక్స్, లేకపోతే ఎండోస్కోపి ద్వారా శస్త్రచికిత్స అవసరం రావొచ్చు. ఈ జబ్బు మళ్లీ మళ్లీ రావొచ్చు. దీనికి ప్రధాన కారణమైన పిత్తాశయ రాళ్లను తొలగించడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వల్ల అక్యూట్ పాంక్రియాటైటిస్ మళ్లీ రాకుండా చెయ్యొచ్చు. పిత్తాశయంలో కూడా రాళ్లు ఉంటే సర్జరీ చేసి పిత్తాశయాన్ని తీసేయాలి.

డాక్టర్ దత్తారామ్
కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోంటరాలజిస్ట్,
లాపరోస్కోపిక్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్
సన్‌షైన్ హాస్పిటల్స్
హైదరాబాద్.

771
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles