పర్యాటకానికి మారుపేరు పాలమూరు


Fri,August 24, 2018 02:35 AM

ఒకప్పుడు వలసకూలీల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్ జిల్లా నేడు పర్యాటక శోభను తరించుకుంటున్నది.పూర్వపు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రితోపాటు మయూరి పార్కు, సలేశ్వరం, మల్లెలతీర్థం, గద్వా ల, ఆలంపూర్, కోయిల్‌సాగర్, జూరాల ఇలా అనేక ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. జిల్లాను గద్వాల జోగులాంబ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలుగా విభజించిన తరువాత హైదరాబాద్ నుంచి జిల్లాకు పర్యాటకులను ఆకర్షించేందుకు టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేస్తున్నది. పర్యాటకానికి పట్టుగొమ్మగా విలసిల్లుతున్న పూర్వ పాలమూరు జిల్లాలో విహరిద్దాం రండి.


పిల్లలమర్రి మహావృక్షం

palamuru
సుమారు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి వృక్షం జిల్లా కేంద్రంలో ప్రధాన పర్యాటక ప్రాంతం. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మర్రి నీడలో దర్జాగా వెయ్యిమంది కూర్చోవచ్చు. ఈ మహావృక్షం మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియం ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు.


మయూరి పార్క్

జిల్లాకు మయూరి కొత్త శోభను తెచ్చింది. మయూరి పార్కు అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్నది. మహబూబ్‌నగర్, జాదుచెర్ల రహదారి మధ్య అప్పన్నపల్లి శివారులో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ మయూరి పార్క్‌లో యువతను ఆకర్షించేందుకు అడ్వెంచర్‌జోన్‌ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ నిపుణుల సహకారంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా జిప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. 25 అడుగుల ఎత్తులో 150 మీటర్ల దూరం గాలిలో తేలుతూ జిప్‌లైన్‌పై వెళ్లటం మరిచిపోలేని ఓ అనుభూతి. నిపుణుల సాయంతో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి వారి ఆధ్వర్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ జిప్‌లైన్‌ను నిర్వహిస్తున్నారు. అడ్వెంచర్ జోన్‌లో రెండోది జిప్ సైకిల్. 40 అడుగుల ఎత్తులో 300 మీటర్ల దూరం తీగలపై సైకిల్ తొక్కటం అనేది ఓ సవాల్ లాంటిదే. నిపుణుల పర్యవేక్షణలో జరిగే జిప్ సైక్లింగ్ నడిపే వాళ్లకే కాదు చూసే వాళ్లకు కూడా ఒక థ్రిల్లింగే.


అద్భుత క్షేత్రం సలేశ్వరం

సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే ఈ శివ క్షేత్రం మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అడవిలో ఉంది. మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఒక లోయలో ఉంది. ప్రతీ ఏడాది చైత్ర పున్నమినాడు ఈ క్షేత్రానికి భక్తులు వేలసంఖ్యలో తరలివస్తా రు. పున్నమి నాటి రాత్రి అడవిలో వేలాది భక్తులు లోయలోకి దిగి స్వామిని దర్శించుకుంటారు. ఈ శివాలయం ఎదురుగా దాదాపు మూడువందల అడుగుల ఎత్తు రాతికొండ పై నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ దూకుతుంటుంది. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టు కుంటుంది. ఒకే ఒక మనిషి నడిచేంత బాటతో కూడిన లోయ అడుగుభాగానికి చేరుకోవడం నిజంగా సాహసమే!


alampur

ఆలంపూర్ జోగులాంబ

అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిమకుటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకఠాక్షాలను చూపుతున్నది. ఆలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి.


మల్లెల తీర్థం

mallela-thirdham
ఇది ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరంలో ఉంటుంది. ఈ నీరు ఎంతో పవిత్రమైందని భావించటంతో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతం దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గంలో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలంలో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు. ఈ మల్లెల తీర్థంలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భావించటంతో ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.


కోయిల్‌సాగర్ ప్రాజెక్టు

koilsagar
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలోని మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులలో ఒకటి. జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలంలోని బొల్లారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. జిల్లాలోని దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాలలోని 12 వేల ఎకరాల సాగు భూమికి నీటిని అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.276టీఎంసీలు. 1945లో నిజాం కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది. రెండు కొండల మధ్య నిర్మితమైన ఈ ప్రాజెక్టు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది.


గద్వాల కోట

Gadwal_Fort
గద్వాల కోట మహబూబ్‌నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకి ప్రసిద్ధిచెందింది. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అని పేరు. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి.


ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

Jurala_Dam
జిల్లాలోని ప్రముఖ ప్రాజెక్టులలో జూరాల ప్రాజెక్టు ఒకటి. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తరువాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 9.68టీఎంసీలు. గద్వాలకు 16 కిలోమీటర్ల దూరంలో ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్లే రోడ్డు మార్గంలో ఆత్మకూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.


జటప్రోలు (కొల్లాపూరు) సంస్థానం

Kollapur
మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది తీరాన వెలిసిన ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక సంస్థానమిది. ఈ సంస్థానాధీశులు కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమని కూడా వ్యవహరిస్తారు. ఇది కృష్ణానది ఒడ్డున నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉండేది. 1500 సంవత్సరాల నాటి అనేక పురాతన దేవాలయాలను నేటికీ ఇక్కడ చూడవచ్చు. సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందింది.


వనపర్తి సంస్థానం

Wanaparthy_Palace
ఈ సంస్థానము మహబూబ్‌నగర్ జిల్లా లో నైరుతి దిక్కున ఉంది. ఈ సంస్థానంలోని 124 గ్రామాలు మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అమ్రాబాద్ తాలూకాలలో విస్తరించి ఉన్నాయి. ఈ సంస్థానం 450 చ.కి.మీ.లలో విస్తరించింది.
-మధుకర్ వైద్యుల

1585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles