పంచభూత వైద్యం..ఆయుర్వేదం


Tue,July 31, 2018 01:53 AM

Ayurved
ఫలానాది తింటే వాతం చేస్తుంది... తిన్నది సరిగా అరగకపోతే పైత్యం ఎక్కువైంది.. చల్లగాలిలో తిరిగితే కఫం ఏర్పడుతుంది.. లాంటి మాటలు వింటూనే ఉంటాం. మన శరీరంలోని వాత, పిత్త, కఫాల గురించే ఈ మాటలన్నీ. ఇంతకీ ఆయుర్వేద వైద్యంలో కీలకాంశాలైన ఈ వాత, పిత్త, కఫాలంటే ఏమిటి.. ఆయుర్వేదం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా..మన శరీరం పంచభూత నిర్మితం. దీని ఆధారంగానే ఆయుర్వేదం ఏర్పడింది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే మూడు రకాల అంశాలు ఉంటాయి. ఈ మూడూ కూడా పంచభూతాలతో ఏర్పడినవే. ఇవి సమతుల స్థితిలో ఉన్నప్పుడే పంచభూత నిర్మితమైన మన శరీరం కూడా సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటుంది. గతి తప్పిన వాత, పిత్త, కఫాలను సమతుల స్థితికి తీసుకొచ్చే దిశగానే ఆయుర్వేదం పనిచేస్తుంది.

Ayurveda
పంచమహా భూతాలనే మన శరీరాన్ని నడిపించే వాత, పిత్త, కఫాలుగా విభజించారు. వీటిని ఆయుర్వేద పరిభాషలో దోషాలంటారు. దోషం అంటే చెడుదని అర్థం కాదు. శరీరానికి ఒక క్రమ స్థాయిలో దీని అవసరం ఉంటుంది. అది ఎక్కువైనా తక్కువైనా సమస్యే అవుతుంది. ప్రతి దోషానికి కొన్ని లక్షణాలుంటాయి. ఉదాహరణకు వాత దోషం గాలి, స్పేస్ (ఖాళీ ప్రదేశం) కలిపి ఏర్పడుతుంది. గాలి స్వతహాగా చలనశీలత కలిగింది. అదేవిధంగా ఎక్కువసేపు గాలికి ప్రభావితమైతే మృదుత్వాన్ని కోల్పోతుంది. పొడిబారుతుంది. కాబట్టి వాత దోషం సమతుల్యత కోల్పోతే శరీరంలో ఈ లక్షణాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నమాట. వాత, పిత్త, కఫ దోషాలు శరీర స్థాయిలో, కణ స్థాయిలో రెండురకాలుగా ప్రభావం చూపిస్తాయి. కణ స్థాయిలో ప్రతిరోజూ ఈ దోషాల ప్రభావం ఉంటుంది. ఇక శరీర స్థాయిలో వేర్వేరు వయసుల్లో వీటి ప్రభావం వేర్వేరుగా ఉంటుంది.


వాతం

గాలి, స్పేస్ కలిపి వాత దోషం ఏర్పడుతుంది. మనిషి జీవితంలో 65 ఏళ్ల వయసు నుంచి చనిపోయేవరకు వాత దోషం ఉంటుంది. దీనివల్ల వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది. వాత దోషంలో మరో అయిదు ఉపదోషాలుంటాయి. అవి ఒక్కో ప్రక్రియపై ప్రభావం చూపిస్తాయి.
-ప్రాణ వాయువు - పీల్చే గాలే ప్రాణవాయువు.
-అపాన వాయువు - కిందివైపు ప్రయాణించే గాలి.
-ఉదానవాయువు - పైవైపు ప్రయాణించే గాలి.
vata
ఇదిరెండు రకాలుగా ఉంటుంది. కడుపులో అరగకపోతే వాంతులు కావడానికి కారణం ఇదే. ఇంకోటి చనిపోయే ముందు ప్రాణాన్ని బయటకు తీసుకెళ్లేది ఉదాన వాయువే.
-సమాన వాయువు - మెదడులో పెరిఫెరల్ భాగాల నుంచి సెంట్రల్ భాగానికి వెళ్లేది. ఇది చిన్న పేగులో కూడా ఉంటుంది. పాతక పిత్త (డైజెస్టివ్ ఫైర్- కడుపులో ఉండే పిత్తం)కి ఉపయోగపడే ఆక్సిజన్ ఇది. పాతక పిత్త, ఈ సమానవాయువు కలిసి జీర్ణక్రియకు దోహదపడుతాయి.
-వ్యాన వాయువు - మెదడు నుంచి బయటికి వెళ్లేది. రక్తప్రసరణ, గుండె పనితీరు, రక్తాన్ని అన్ని భాగాలకు తీసుకెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.


పిత్తం

అగ్ని, నీరు కలిపి పిత్త దోషం ఏర్పడుతుంది. ఇది శరీర వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది. పదార్థాలను మార్పు చెందించడమే దీని పని. ఉదాహరణకు ఆహారం జీర్ణం అయ్యి శక్తిగా మారడం. తీసుకునే ఆహార పదార్థాలు చివరికి గ్లూకోజ్‌గా మారడం.. ఇలాంటి జీవక్రియలన్నీ పిత్త దోష అధీనంలో ఉంటాయి. ఇది జీవాన్ని మెయిన్‌టెయిన్ చేస్తుంది. 20 నుంచి 65 ఏళ్ల వయసు వరకు శరీరాన్ని క్రమ పద్ధతిలో మెయిన్‌టెయిన్ చేయడానికి పిత్త దోషం ఎక్కువగా ఉంటుంది. దీనిలో కూడా మరో అయిదు ఉపదోషాలుంటాయి.
-పాతక పిత్త - చిన్నపేగులో ఉండే డైజెస్టివ్ ఫైర్.
pitta
-సాదక పిత్త - మెదడులో ఉండే ఫైర్. తప్పొప్పులను చెప్పగలిగేలా చేసేది ఇదే.
-అలోచక పిత్త - కళ్లలో ఉండి చూపుకి ఉపయోగపడేది
-వ్రజక పిత్త -చర్మంలో ఉండేది ఇదే.
-రంజక పిత్త - రక్తంలో ఉండి, రక్తప్రసరణకు ఉపయోగపడుతుంది.

కఫం

నీరు, నేల కలిపి కఫ దోషం ఏర్పడుతుంది. ఇల్లుకట్టాలంటే సిమెంటు, ఇసుక, నీరు కావాలి. అదేవిధంగా మానవ శరీరం నిర్మితం కావాలంటే కఫ దోషం కావాలి. కఫదోషం ఆయా అవయవాల్లో లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది.
మనం పుట్టినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు ఎదిగే వయసు కాబట్టి కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. కఫం ఎక్కువ ఉన్నా, పిత్త తక్కువైనా లావు అవుతారు. కఫదోషం కూడా మరో అయిదు ఉపదోషాలుగా విభజించబడింది.
-క్లేదక కఫ - జీర్ణాశయంలో ఉండేది
kapha
-అవలంబక కఫ - ఊపిరితిత్తులు, గుండెలో ఉండే కఫం
-తర్పక కఫ - మెదడు లోపల ఉండేది
-శ్లేషక కఫ - కీళ్లలో ఉండే లూబ్రికెంట్
-బోదక కఫ - నోటిలో ఉండే లాలాజలం


ముఖ్యమైన చికిత్సలు 5 సెన్స్ థెరపీలు

రుచి - ఆహారం, మూలికల ద్వారా ఇచ్చే థెరపీ.
స్పర్శ - మసాజ్ థెరపీ, మర్మ థెరపీ, ఆక్యుప్రెజర్, ఆక్యుపంక్చర్ దీనిలోకి వస్తాయి.
వాసన - అరోమా థెరపీలో ఎసెన్షియల్ ఆయిల్స్‌ని ఉపయోగిస్తారు. ప్రతి దోషానికి వేర్వేరు ఆయిల్స్ ఉంటాయి.
ధ్వని - చాంట్ థెరపీ. బీజాక్షరాల్లో ఎవరికి ఏ అక్షరం పఠిస్తే బావుంటుందో దీన్ని బట్టి చెబుతారు.
దృష్టి- కలర్ థెరపీ - వేర్వేరు దోషాలకు వేర్వేరు రంగులు వాడుతారు.


ఇలా పనిచేస్తుంది!

ఈ 3 దోషాలు రెండు రకాలుగా వ్యక్తమవుతాయి. మానవ జీవం నిర్మాణ సమయంలో కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ఉండేది ప్రకృతి. పిండం పురుడు పోసుకున్నప్పుడు ఉండే వాత-పిత్త-కఫాల శాతం అన్నమాట. ఆ తరువాత ఆహారం వల్ల, జీవనశైలి వల్ల దోషాలు మారుతుంటాయి. ఇది వికృతి. వీటి ఆధారంగా ఈ దోషాలను గణించి ఏ దోషం బ్యాలెన్స్ తప్పి ఉందో తెలుసుకుని, దానికి వ్యతిరేకమైన లక్షణం కలిగినదాన్ని పెంచే దిశగా చికిత్స ఇస్తే కంట్రోల్ చేయగలుగుతాం. తద్వారా సమస్యలు తగ్గుముఖం పడుతాయి. ఆయుర్వేద ఔషధాలు, చికిత్సలు ఈ దిశగానే పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్యం అనగానే మొదట పంచకర్మ చికిత్సే గుర్తుకు వస్తుంది. అయితే వీటితో పాటు ఆయుర్వేద చికిత్సల్లో ఇంకా చాలా రకాలు.
దోషాలు సమతుల్యం అయితే జీవక్రియలు, విసర్జన క్రియ, ఆకలి, నిద్ర అన్నీ బావుంటాయి. బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు. భావోద్వేగాలు కూడా కంట్రోల్‌లో ఉంటాయి. నిర్ణయాత్మక శక్తి మెరుగుపడుతుంది. అంటే ఆయుర్వేద చికిత్సలతో శారీరక, మానసిక అనారోగ్యాలన్నింటినీ బాగుచేయవచ్చన్నమాట.

sarath
శరత్ అద్దంకి ఫౌండర్, డైరెక్టర్,రాధాస్ ఆయుర్వే హాస్పిటల్, హైదరాబాద్

757
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles