నోటి క్యాన్సర్.. పారా హుషార్..


Wed,September 20, 2017 04:01 AM

cancer
ఇంటర్ నుంచే చదువు కోసం ఇంటికి దూరంగా ఉంటుంది ఈ తరం. ఆ తర్వాత పై చదువులు, ఉద్యోగాలు, కాన్ఫరెన్స్‌లు, మీటింగులు అని దూరపు ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇలా చాలామంది ఇంటి వంటకు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండక తప్పని పరిస్థితులు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు స్నేహితులు, సరదాలు చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో సరదాగా మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కాహాల్ వంటి దురలవాట్లతో బయట తిండి కూడా చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బయట తీసుకునే ఆహారం రుచికరంగా, అందంగా కనిపించడానికి నూనెలు, ఉప్పు కారాలు ఎక్కువగా వాడడమే కాకుండా కొన్ని ఆర్టిఫీషియల్ ఫుడ్ కలర్స్, కెమికల్స్, వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడడం జరుగుతూ ఉంటుంది. ఇవి క్యాన్సర్ కారకాలు కావచ్చు.

దురలవాట్లు, బయటి తిండి ఎక్కువగా తినడం, వృత్తి పరమైన కారణాలు ఎక్కువై మానసిక ఒత్తిడికి గురవడం, వాతావరణ కాలుష్యానికి గురవడం, నైట్ డ్యూటీలు, ఏసీ రూముల్లో నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువ ఉండడం.. ఇలాంటి ఏమైనా మొత్తంగా చూస్తే పురుషులు స్త్రీలకంటే క్యాన్సర్‌కు ఎక్కువగా గురవుతారని మనం గమనించగలం.

పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ తప్పితే ఇంక ఏవి తీసుకున్నా స్త్రీలకంటే పురుషులలోనే ఎక్కువ. ఈ మధ్య పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కావడం మరింత బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్యను చూస్తే 2007 నుంచి 2030 సంవత్సరానికి ఈ సంఖ్య 45 శాతం పెరిగే అవకాశం ఉంది. అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ టెస్ట్‌లు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలుగడం ఎవ్వరి చేతుల్లో లేదు అనేది సత్యం. 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని క్యాన్సర్‌ల కంటే అధికంగా ఉండవచ్చు అని అంచనా. సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నములడం వంటివి నోటి క్యాన్సర్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 80,000 మంది దాకా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాతావరణ కాలుష్యం అధికంగా ఉన్న కోలకత్తలో ప్రతి లక్ష మందిలో 20 మంది లంగ్ క్యాన్సర్‌కు గురవుతున్నారు.

తర్వాత కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో ఈ సంఖ్య 15 మంది దాకా ఉంది. ఉప్పు, కారాలు, పచ్చళ్లు, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఇంకా దురలవాట్లు కూడా ఉండడం పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌కు గురిచేస్తున్నాయి. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్ బారిన పడడం ఎక్కువ అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మన దేశంలోని పురుషులు నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్ క్యాన్సర్‌కు గురికావడం చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలవాట్లు, జీవనశైలి, ఆహారం ఆరోగ్యకరంగా లేకపోవడం క్యాన్సర్ కారకాలు కావడంతో పాటు పురుషులలో వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటాయి. ఆస్‌బెస్టాస్ కంపెనీలో పనిచేసేవారు, అల్యూమినియం ప్రొడక్షన్ కంపెనీలో పని, ఆల్కహాలిక్ బేవరేజెస్, పొగాకు ఉత్పత్తుల కంపెనీ, రేడియం ఉత్పత్తులు, రేడియో న్యూక్లయిడ్స్, చెక్కపొడి, గామా రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పనిచేసేవారికి ఊపిరితిత్తులు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇతర వృత్తులలో వారి కంటే ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది.

vamshi

ఎండలో ఎక్కువగా తిరుగడం లేదా ఎండ అసలు తగులకుండా ఏసీ రూముల్లో గంటల తరబడి పనిచేయడం, నైట్ డ్యూటీలు, పెస్టిసైడ్స్, కెమికల్స్‌కు మగవారే ఎక్కువగా గురవుతారు. కాబట్టి వారికి క్యాన్సర్స్ ముప్పు పొంచి ఉంటుంది. సాధారణంగా పురుషులు ఇంట్లో ఏవి పడితే అవి తింటుంటారు. అందుకే బయటకు వెళ్లినప్పుడు తేలికగా దొరికే జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఫలితంగా ఊబకాయం. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకోవడానికి పీఎస్‌ఏ (ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్) అనే రక్తపరీక్షను 50 ఏళ్లు పై బడ్డాక చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు వీర్యంలో, మూత్రంలో రక్తం కనిపించడం, నడుము, తుంటి, పక్క టెముకల నొప్పులు, మూత్ర సంబంధ సమస్యలు కనిపించే సరికే దశ ముదిరిపోయి ఎముకలకు కూడా పాకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పీఎస్‌ఏ పరీక్షలో యాంటీజెన్ పెరుగడాన్ని గమనిస్తే ఇతర పరీక్షలు బయాప్సీతో పాటు అవసరమయితే అల్ట్రాసౌండ్, బోన్‌స్కాన్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, బయాప్సీ వంటి పరీక్షలు చేస్తారు.

50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఈ లక్షణాలు ఉన్నా లేకున్నా పీఎస్‌ఏ టెస్ట్, డీఆర్‌ఈ చేయించుకొని డాక్టర్ సలహా మేరకు ఎంత కాలంలో మళ్లీ చేయించుకుంటే మంచిది? పీఎస్‌ఏ టెస్ట్ మార్పులు ఎలా ఉంటున్నాయి? ఇంకా ఇతర పరీక్షలను ఎటువంటి లక్షణాలు ఉన్నప్పడు తప్పనిసరిగా చేయించుకోవాలి? అనే విషయాల మీద అవగాహన పెంపొందించుకోవడం తప్పనిసరి.
- పురుషులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం తగదు.
- తగ్గని దగ్గు, దాంతో పాటు రక్తం
- ఆకలి, బరువు తగ్గడం
- నొప్పితో పాటు జ్వరం
- మూత్రం ఆగి ఆగి రావడం, రక్తం కనిపించడం
- మలవిసర్జనలో రక్తస్రావం
- తీవ్రమైన ఆజీర్తి
- గొంతు నొప్పి, ఘన పదార్థాలు తీసుకోలేకపోవడం
- నోటిలో మానని పుండు
- ఎముకల నొప్పులు

పై లక్షణాలను ఇన్‌ఫెక్షన్స్ అని, పైల్స్ అని, రోగనిరోధక శక్తి తగ్గిందని, స్మోకింగ్ వల్ల కొద్దిగా దగ్గు వస్తుందని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. వయసు పైబడి దురలవాట్లు ఉండి లక్షణాలు కనిపిసే జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే నోరు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, పొట్ట, కోలన్, ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించిన హెచ్చరికలూ కావచ్చు. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం అవగాహన పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.

613
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles