నీ పాదం మీద పుట్టుమచ్చనై..


Sat,August 25, 2018 11:58 PM

అమ్మలో సగం.. నాన్నలో మరో సగం.. అన్నాతమ్ముళ్లు.! అక్కాచెల్లెళ్లతో అన్నాదమ్ములది జన్మజన్మల బంధం. ఎన్నటికీ వీడిపోని అనుబంధం. ఆ అపురూప అనుబంధాలను వెండితెరపై కూడా పండించే ప్రయత్నం చేశారు పలువురు తెలుగు సినీ దర్శకులు.అలనాటి రక్త సంబంధం సినిమా నుంచి రాఖీ వరకూ తోడబుట్టిన వారి మధ్య మమకారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వెండితెర జ్ఞాపకాల గురించి రక్షాబంధన్ సందర్భంగా..
sister-brother
ప్రతీ సినిమా వాస్తవ కథలోంచి పుట్టుకొస్తది. కానీ ఈ అన్నాచెల్లెండ్ల బంధం గురించి, రక్షాబంధన్ గురించి పురాణాల్లో కూడా చాలా కథలే ఉన్నాయి. సమస్త లోకాల ప్రాణులన్నింటి పట్ల సమధర్మం పాటించేవాడు యమధర్మరాజు. తన పతి ప్రాణాలు తీయవద్దని యముడి చెల్లెలు యమున ఆయన చేతికి రక్షాబంధనం కట్టి వేడుకుందట. అప్పటి నుంచి అన్నాచెల్లెండ్ల మధ్య రక్షాబంధన్ అనేది ఒక సంప్రదాయంగా మారిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇదే రాఖీ గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. దేవతలకు - రాక్షసులకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేవతల రాజు దేవేంద్రుడు ఓడిపోతాడు. రాక్షసులు చంపేస్తారన్న భయంతో తన పరివారంతో అమరావతిలో తల దాచుకుంటాడు. అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాణి శ్రావణపూర్ణిమ రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి, ఆ పూజలో ఉంచిన దారాన్ని రక్షగా ఇంద్రుని చేతికి కట్టింది. ఇంద్రుడు ఆ యుద్ధంలో విజయం సాధించాడు.

విష్ణు పురాణంలో మరో కథ ఉంది. బలి చక్కవర్తి ఒకసారి కఠోరమైన తప్పస్సు చేస్తాడు. బలి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బలి మీరెప్పటికీ నా మందిరంలోనే ఉండిపోవాలి అని కోరుతాడు. విష్ణుమూర్తి వరమిచ్చి బలి చక్రవర్తి పూజా మందిరంలోనే ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి బలి చేతికి దారం లాంటి బంధనం కట్టి ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని సోదరుడిగా భావిస్తున్నాను అంటుంది. దానికి బలి నా నుంచి నీకు ఏం కావాలో.. కోరుకో అని లక్ష్మీదేవికి వరమిస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపమని కోరుతుంది. బలి చక్రవర్తి ఇచ్చిన మాట మేరకు విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపించేస్తాడు. ఇలా రాఖీ అనేది ఒక రక్షా బంధనంగా, రక్షణనిచ్చే దారంగా, చెల్లెకు, అక్కకు రక్షణ కల్పించేందుకు అన్నకు, తమ్ముడికి కట్టే దారం రక్షణ కల్పించే కవచంలా రక్షాబంధనం ప్రాముఖ్యం సంతరించుకుంది.

పల్నాటి పౌరుషం


కోడిపందాల్లో మొదలైన బావ, బావమరుదుల మధ్య చిన్న అపార్థం వారి మధ్య పంతాలకు దారి తీస్తుంది. ఆ తర్వాత చెల్లికి పురుడు సందర్భంగా వచ్చి కూడా బావతో మాట్లాడకుండానే వెళ్లిపోతాడు. ఆ బాధనంతా కన్నీళ్ల మాటునే అణిచిపట్టుకొనే భావోద్వేగం ఈ సినిమా నిండా కనిపిస్తుంది. అన్నాచెల్లెండ్లు పరస్పరం ఎదురుగా ఉండి కూడా మాట్లాడుకోలేకపోవడం గుండెల్ని ఎంత పిండేస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.

చెల్లెలి కాపురం


కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించింది. ఈ చిత్రంలో చెల్లె కోసం అన్న చేసే త్యాగం, అన్నకు రావాల్సిన పేరు ఇంకెవరో అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక తన కాపురాన్ని ఫణంగా పెట్టి చెల్లి చేసే ధైర్యం అందరికీ నచ్చింది. అందుకే అనుబంధాల సినిమాల్లో పేరెన్నిక గన్నది.

పుట్టింటికి రా.. చెల్లి


అర్జున్, స్వప్న మాధురి కలిసి నటించిన ఈ సినిమా ఎంతోమందిని కంటతడి పెట్టించింది. తక్కువ బడ్జెట్‌లో తీసిన సినిమా అయినా.. పెద్ద హిట్ సాధించి ఎక్కువ రోజులు నడిచింది. ఎన్నో హృదయాల్లో అన్నాచెల్లెండ్ల అనుబంధానికి గుర్తు ఈ సినిమా అనిపించుకుంది.

రక్తసంబంధం


అన్నాచెల్లెండ్ల మధ్య అనుబంధాన్ని అత్యంత గాఢంగా కళ్లకు కట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్, సావిత్రి పోటీ పడి మరీ నటించిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. చెల్లె సుఖంగా ఉంటే అంతే చాలనుకునే.. ఒక అన్నలా ఎన్టీఆర్ రాజు పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ఎంతోమంది అన్నల, తమ్ములకు ఆదర్శంగా నిలిచిపోయింది. చివరికి ఇద్దరూ కలిసి ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ప్రాణాలు వదిలే సీన్ గుండెల్ని పిండేస్తుంది. రక్తసంబంధాన్ని మించిన బంధం మరేదీ లేదని నిరూపిస్తుంది.

అన్నవరం


అన్నయ్యా అన్నావంటే... ఎదురవనా.. కలనే కన్నావంటే నిజమవనా అంటూ చెల్లె కోసం బతికే ఓ అన్న కథ ఇది. పవన్‌కల్యాణ్, సంధ్య, శివ బాలాజీ కలిసి నటించిన సినిమా ఇది. అన్నాచెల్లెండ్ల మధ్య అంతులేని ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో చూపిన కథ ఇది.

చంటి


ముగ్గురు అన్నల ముద్దుల చెల్లెలుగా మీన, వారింట్లో పనిచేసే అమాయకుడి పాత్రలో వెంకటేశ్ నటించిన సినిమా చంటి. హిట్ కొట్టిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే అందరూ ఎంతో ఇష్టంగా చూస్తారు. తన చెల్లెనెవరూ కన్నెత్తి కూడా చూడకూడదనే భావంతో, మహారాణిలా చూసుకునే అన్నల కథ ఇది.తమ చెల్లిని ప్రాణంగా చూసుకునే అన్నలందరికీ తప్పకుండా నచ్చే చిత్రమిది.

హిట్లర్


తల్లిని చంపేసిన తండ్రి నుంచి, చుట్టుపక్కల అల్లరిమూకల నుంచి తన చెల్లెళ్లను కాపాడుకుంటూ ఉంటాడు. చెల్లెండ్లను జాగ్రత్తగా చూసుకునే చిరంజీవి మంచితనాన్ని వారు అధికారంగా, నియంతృత్వంగా ఫీలవుతారు. చెల్లెండ్లను ప్రాణానికి ప్రాణంగా కాపాడుకునే అన్నయ్యలందరికీ, అన్నయ్య విలువ తెలిసిన చెల్లెండ్లందరికీ ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

రాఖీ


ఒక చెల్లిని కోల్పోయిన అన్నయ్యగా, మిగిలిన ఎంతోమంది ఆడవాళ్లను తన చెల్లెళ్లుగా భావించి వారికి కష్టమొచ్చిన సమయంలో ఒక అన్నగా, తమ్ముడిగా మీకు నేనున్నా అంటూ అభయమిస్తుంటాడు. ఎన్టీఆర్ అన్నగా, రాఖీగా నటించిన ఈ సినిమా ఎంతోమంది ఆడపడుచుల హృదయాలను గెలుచుకుంది.

గోరింటాకు


రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మిన్, ఆకాశ్ కలిసి నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అన్నాచెల్లెండ్ల ప్రేమను కండ్లకు కట్టింది. చెల్లెలు చనిపోగా, ఆమె లేకపోతే నేను కూడా లేను.. కలిసే పుట్టాం.. కలిసే చనిపోతాం అని అన్న కూడా ప్రాణాలు కోల్పోయే సీన్ గుండెల్ని పిండేస్తుంది. అన్నాచెల్లెండ్ల మధ్య బంధాన్ని, అనుబంధాన్ని శిఖరమంత ఎత్తులో నిలిపింది.

పూర్తిగా అన్నాచెల్లెండ్లు, అక్కాతమ్ముళ్ల కోణంలో కాకపోయినా చాలా సినిమాల్లో తోడబుట్టిన బంధాన్ని కండ్లకు కట్టినట్టు చూపించారు పలువురు దర్శకులు. ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా తోడబుట్టిన బంధం, అనుబంధం, ప్రేమానురాగాలు ఎప్పటికీ తగ్గవు. మరోసారి అక్కాచెల్లెండ్లను ప్రాణానికి సమానంగా చూసుకునే అన్నలకు, తమ్ముండ్లకు, అన్నాదమ్ముల్లను ఆస్తిగా భావించే అక్కలకు, చెల్లెండ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు.
ప్రవీణ్‌కుమార్ సుంకరి

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles