నీ తెలివికి హ్యాట్సాఫ్!


Tue,August 14, 2018 01:28 AM

Zeenat-Banu-Haq
రద్దీ ప్రాంతాల్లో, బస్, రైల్వే స్టేషన్లలో సెల్‌ఫోన్‌లు చోరీ చేసే దొంగలు ఇక జాగ్రత్త. ఈ యువతిలాగే అంతా టెక్నాలజీని ఉపయోగించుకుంటే.. మీ దొంగాటలకు కటకటాలు తప్పవు. చోరీకి గురైన తన ఫోన్‌ను ఎవ్వరి సహాయం లేకుండా, కేవలం టెక్నాలజీని ఉపయోగించి ఓ దొంగ ఆట కట్టించింది.


ముంబైలోని అంధేరికి చెందిన 19 యేండ్ల జీనత్ బాను హక్ స్థానిక పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నది. గతవారం ఆమె ప్రయాణిస్తున్న లోకల్ ట్రైన్‌లో తన స్మార్ట్‌ఫోన్ జియోమీ 4ఏ చోరీకి గురైంది. ఇంటికెళ్లిన తర్వాత ఫోన్ పోయినట్లు గుర్తించిన జీనత్.. కంగారు పడకుండా వెంటనే గూగుల్ అకౌంట్‌లో మై యాక్టివిటీ ఓపెన్ చేసి ఫోన్ ఉన్న లొకేషన్ చూసింది. అప్పటికే తన ఫోన్‌లో ఏవేం యాక్టివిటీస్ జరిగాయో తెలుసుకున్నది. ఫోన్‌ను దొంగిలించిన వ్యక్తి.. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను అప్‌డేట్ చేసుకున్నాడు. రజనీకాంత్ కొత్త సినిమా కాలా పాటలను వెతికాడు. ఆ ఫోన్ తనదే అన్నట్లు ఫీలైపోయి, పుదుచ్ఛేరి ఎక్స్‌ప్రెస్‌లో దాదర్ నుంచి తిరువణ్ణామలైకి టికెట్ బుక్ చేసుకున్నాడు. దాని పీఎన్‌ఆర్ నంబర్, సీటు వివరాలను స్క్రీన్ షాట్ తీసుకున్నాడు. దర్జాగా ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నది జీనత్. ఆ ఫొటో ఆధారంగా చోరీకి పాల్పడింది సెల్వరాజ్ శెట్టిగా గుర్తించింది. తాను సేకరించిన ఆధారాలన్నింటినీ తీసుకొని దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన ఫోన్ వివరాలు కూడా సమర్పించి, అతడ్ని అరెస్ట్ చేయాలని కోరింది. మరోవైపు లొకేషన్‌ను ట్రాక్ చేస్తూ.. రైలు బయలుదేరుతుందనగా తన సీటులో కూర్చున్న సెల్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తాను ఫోన్ దొంగిలించలేదని మొదట బుకాయించినా.. నిజం ఒప్పుకోక తప్పలేదు. దీంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సమయస్ఫూర్తితో దొంగను పట్టించిన జీనత్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆమె తెలివి, ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

1701
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles