నిలిచిన నిర్మాణాలకు పునరుజ్జీవం


Sat,July 21, 2018 01:38 AM

sampada
నిర్మాణ సంస్థలకు ఆపన్నహస్తాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నాలుగేండ్ల తర్వాతనైనా ఈ రంగాన్ని ఆదుకోవడానికి నడుం బిగించింది. నిర్మాణ సంస్థలకు చివరి నిమిషంలో ఆర్థిక సాయాన్ని అందించే దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇదే జరిగితే, గత కొంతకాలంనుంచి నిధుల్లేక నిలిచిపోయిన భారీ
ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభానికి నోచుకునే అవకాశమున్నది.


తెలంగాణ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్నాళ్ల తర్వాత.. నిర్మాణ రంగం ప్రతినిధులతో కూలంకషంగా చర్చించింది. ఈ పరిశ్రమలో నెలకొన్న సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ఓపికగా విన్నారు. ఆ తర్వాత, ఆయా సమస్యలన్నిటికీ చరమగీతం పాడారు. ఫలితంగా, అప్పటివరకూ సవాలక్ష సమస్యలతో, రకరకాల ఇబ్బందులతో ఇబ్బంది పడ్డ నిర్మాణ రంగం ఒక్కసారిగా కుదుటపడింది. రియల్ రంగమంతా క్రమక్రమంగా కోలుకున్నది. ఇప్పుడు ఇతర మెట్రో నగరాల్లో అమ్మకాల్లేక ఇబ్బంది పడుతుంటే.. మన వద్ద మాత్రం రియల్ రంగంలో సరికొత్త వెలుగురేఖలు ప్రసరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగానికి అందజేసిన ప్రోత్సాహం గురించి కేంద్రానికి తెలిసిందో లేదో తెలియదు కానీ.. రియల్ రంగాన్ని ఆదుకునే ప్రయత్నాల్ని మొదలెట్టింది.


ఒక ప్రాజెక్టును ప్రారంభించే ముందు.. ఆయా నిర్మాణ సంస్థ పక్కా ప్రణాళికల్ని రచిస్తుంది. ప్లాన్లు, ఎలివేషన్లు, ఫ్లాట్ సైజులు, అందులో సదుపాయాలు, ఇలా ప్రతి అంశంలో ఎంతో మేధోమథనం జరిపి.. అన్ని రకాల ఆఫీసుల చుట్టూ తిరిగి అనుమతిని తీసుకుంటుంది. ఒక అంతస్తులో ఒక్క ఫ్లాటు అమ్మినా, మొత్తం అంతస్తును నిర్మిస్తుంది. అయినప్పటికీ, మొక్కవోని పట్టుదలతో, ఫ్లాట్లు ఎలాగైనా అమ్ముడవుతాయన్న ధీమాతో డెవలపర్లు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తీరా నిర్మాణం ప్రారంభం అయ్యాక, ఏదో బయటి శక్తుల కారణంగా మార్కెట్లో అమ్మకాలు నిలిచిపోతే, ఆయా డెవలపర్ పడే కష్టం అంతాఇంతా కాదు. చేతిలో ఉన్న సొమ్ము, బ్యాంకు రుణాలు, కొనుగోలుదారుల సొమ్ముతో చేపట్టిన ప్రాజెక్టును ఒక్కసారిగా నిలిచిపోతే.. కలిగే మానసిక వేదనను వర్ణించలేం.


ఇలాంటివి తెలంగాణలో తక్కువే అయినప్పటికీ నొయిడా, గుర్గావ్, ముంబై, పుణె, నాగపూర్, బెంగళూరు వంటి నగరాల్లో అధికంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా, గత కొన్నేండ్ల నుంచి మార్కెట్ మెరుగ్గా లేని కారణంగా, బడా మెట్రో నగరాల్లోనే అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వాస్తవిక సమస్యలను అర్థం చేసుకుని, చివరి దశలో ఆర్థిక చేయూతను అందిస్తే.. ఆ ప్రాజెక్టు కష్టాల నుంచి బయటపడుతుంది. ఫలితంగా, అందరూ ఆనందంగా ఉండటానికి ఆస్కారముంటుంది. అందుకే, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చివరి దశలో నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడానికి పూర్తి స్థాయి చర్చల్ని జరుపుతున్నది. ఈ క్రమంలో ఇటీవల నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా నిర్వహించింది.

BANNER-PHOTO
-రియల్ రంగంలో సరికొత్త మార్పులను రెరా తీసుకొస్తున్నది. కాకపోతే, ఇప్పటికే నిలిచిపోయిన నిర్మాణాలకు పునరుజ్జీవం కలిగించడానికి లాస్ట్ మైల్ ఫండింగ్ అందించడానికి చర్చిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా స్ట్రెస్ అసెట్స్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికల్ని రచిస్తున్నది. కేంద్ర గృహనిర్మాణ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెరా అమలు, ఈ రంగాన్ని నిలబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అయితే, జీఎస్టీ రేటు తగ్గితేనే ఈ రంగంలో పెరుగుదల నమోదు అవుతుందని క్రెడాయ్ అధ్యక్షుడు జక్సే షా ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, బ్యాంకులు, ఎన్‌బీసీసీ, క్రెడాయ్ వంటి నిర్మాణ సంఘాలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


-నిర్మాణ రంగంలో నూతన జవసత్వాలు నింపేందుకు కేంద్రం ప్రయత్నించడం ఓ మంచి పరిణామం అని నిర్మాణ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. కేవలం నొయిడా, గ్రేటర్ నొయిడాలోనే కాకుండా, ఇతర మెట్రో నగరాల్లో ఆర్థిక సాయం అందక నిలిచిపోయిన ప్రాజెక్టుల వైపు దృష్టి సారించాలని కేంద్రాన్ని డెవలపర్లు కోరుతున్నారు. చేతిలో సొమ్ము లేక నిలిచిన ప్రాజెక్టుల్ని నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ టేకోవర్ చేసుకుని.. వాటిని పూర్తి చేసేందుకు తోడ్పడేలా ఒక ప్రతిపాదనను సిద్ధం చేయాలని గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ భావిస్తున్నది. అయితే, ఆయా ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అవకాశం ఉందా? లేదా? అనే అంశం ఆధారంగా కేంద్రం ముందుకెళ్లే అవకాశమున్నది. ఈ క్రమంలో మరో సమావేశం కూడా జరుగనున్నది. మొత్తానికి, రియల్ రంగంలో పునరుజ్జీవం కలిగేలా అడుగులు వేస్తుండం ఆహ్వానించదగ్గ పరిణామం.
-కింగ్ జాన్సన్ కొయ్యడ

294
Tags

More News

VIRAL NEWS