నికేత చీరకట్టు విజేత


Sat,July 28, 2018 02:20 AM

చీరకట్టు కనికట్టు చేస్తుందంటారు.. కానీ, ఆ కట్టు ఎన్ని రకాలు?తెలుగు కట్టు.. తమిళ కట్టు.. బెంగాలీ కట్టు.. ఇలా ప్రాంతానికో ప్రత్యేకమైన కట్టు ఉంది..కొన్ని కట్లు వర్గాల.. తెగలకు కూడా పరిమితమైనవీ ఉన్నాయి..మనకు తెలియని వందల చీరకట్లు ఉన్నాయంటే నమ్మగలరా?వాటిని వెలికి తీసి.. నేర్పించేందుకు సిద్ధమైంది నికేత.. పుణేకి చెందిన ఈమె ఈ కట్టు నేర్పడానికి హైదరాబాద్ విచ్చేసింది.. ఈ సందర్భంగా ఆమెతో ప్రత్యేక సంభాషణ ఇది. ఒక అమ్మాయి, మహిళ.. ఒక నెలలో సన్నగా ఉండొచ్చు.. మరో నెలలో నాలుగైదు కేజీలు పెరుగొచ్చు.
SAREE
అలాంటప్పుడు సన్నబడితే దుస్తులకు కుట్లు వేసుకోవడమో.. లావయితే ఉన్న కుట్లు విప్పడమో చేయాలి. అదే చీర కట్టుతో ఆ ఇబ్బంది ఉండదు. మీరు ఎలా ఉన్నా.. మిమ్మల్ని అందంగా చుట్టేయడానికి సిద్ధమైపోతుంది. అలాంటి చీరకు ఆదరణ కరువైంది. ముఖ్యంగా ఈతరం అమ్మాయిలు పండుగలకు.. పబ్బాలకు మాత్రమే ఈ చీరకట్టుతో కనిపిస్తున్నారు. ఒకవేళ ఒకే కట్టుతో బోర్ కొట్టి అలా చేస్తున్నారేమో.. లేదా ఇంకేదైనా కారణం ఉందో వారి మనసులకే తెలియాలి. కానీ చీర బోర్ కొట్టకుండా.. చీర మీద ప్రత్యేక ఆసక్తిని కలిగించాలనుకుంది నికేత. కట్ల గురించి చెప్పడమే కాదు.. వాటినెలా కట్టుకోవాలో నేర్పిస్తున్నది.


మొదటి కట్టు..

నికేత పుట్టి, పెరిగింది పుణేలో. ఎంతైనా ఆడపిల్ల కదా.. చిన్నప్పటి నుంచి చీరకట్టుకోవడమంటే సరదా. కానీ ఆ వయసులో చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్లేమంటారో అని దొంగతనంగా చీర కట్టుకునేది. ఇక్కడ కట్టుకోవడం అనేకంటే చుట్టుకునేది. ఒకసారి చెల్లెతో ఆడుకుందామని డిసైడ్ అయింది. అయితే తను లైబ్రేరియన్. చెల్లి పుస్తకాల కోసం వస్తుంది. అయితే లైబ్రెరీలో గాంధీ బొమ్మ ఉండాలి కదా! దానికి బదులు అమ్మ ఫొటో పెట్టి.. తువ్వాలని దండగా వేసింది. వీళ్లు ఆటలో పడిపోయారు. ఒక్కసారి వాళ్లమ్మ వచ్చి చూసేసరికి కూతురు చీరకట్టులో.. అటు తన ఫొటోకి దండ చూసి తెగ నవ్వుకుందట. ఇలా తన మొదటికట్టు నవ్వులతో ముగిసింది. ఆ తర్వాత స్కూల్ ఫంక్షన్లకు అమ్మ చీర కట్టేది. కాలేజ్ ఫెరవల్స్ వచ్చినప్పుడు కూడా అమ్మ సహాయం చేసేది. అలా చేస్తున్నప్పుడు సరిగా నేర్చుకో అంటూ మందలించేది. అయితే చిన్నప్పుడు నికేత బొద్దుగా ఉండేది. చీర కట్టినప్పుడు అందరూ వెక్కిరించేవాళ్లు. దీంతో చీరకట్టును సీరియస్‌గా తీసుకోలేదు. పైగా అందరూ ఎగతాళి చేస్తున్నారని కట్టుకోవడమే మానేసింది.
RK

తప్పించుకోలేక..

చీరకట్టుకు దూరంగా ఉండడం కొంతవరకే సాధ్యం. పెళ్లయ్యాక చీరకట్టుకోకపోతే కొన్ని కుటుంబాల్లో ఊరుకోరు. నికేతకి అలాంటి పరిస్థితే ఏర్పడింది. పెండ్లి ఫిక్సయింది. అది కూడా బెంగాలీ అబ్బాయితో. అప్పటికీ బెంగాలీ కట్టు ఒకటుంటుందని నికేతకి తెలియదు. పెండ్లికి బంధువులంతా కూడా చాలా చీరలు బహుమానంగా ఇచ్చారు. ఇక చీర కట్టుకు ఎస్కేప్ కొట్టడం సాధ్యం కాదనుకుంది. మామూలు చీరకట్టు అంటే.. నివీ డ్రేప్‌ని పట్టుదలగా నేర్చుకుంది. కానీ అక్కడికి వెళ్లాక వాళ్ల కట్టు చూసి కంగుతిన్నది. కాకపోతే అప్పుడే ఒక ఆలోచన మొదలైంది. మనకు తెలియని ఎన్నో రకాల చీరకట్లు ఉన్నాయని. అందుకే వాటి మీద అధ్యయనం చేయాలని అనుకుంది. తన అధ్యయనంలో రీతాకపూర్ రాసిన శారీస్ ఆఫ్ ఇండియా పుస్తకం ఎంతో తోడ్పాటునందించింది. అలా పుస్తకం చూస్తూ ఒక్కో కట్టు నేర్చుకుంది. కానీ పుస్తకం చూస్తూ కాదు.. ఎన్ని చూడకుండా కట్టుకోగలనో అని తనకు తాను అనుకొని చీరకట్టుకోవడం నేర్చుకుంది.

అనుకోకుండా ఒకరోజు..

చీరకట్టులోని గొప్పతనం తెలుసుకో అని నేటి తరానికి చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే భారతదేశంలో చాలా చీరకట్టు కనుమరగయ్యాయి. ఇంకా అవుతాయనే సందేహాలు ఉన్నాయి. దీనికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే చీర కొంటే దానికి ఫాల్ వెయ్యాలి, మ్యాచింగ్ బ్లౌజ్ కుట్టించాలి. ఇంత తతంగం కావాలంటే చాలా రోజులు పడుతుంది. అలా కాకుండా.. వాటి అవసరమే లేకుండా చీరకట్టు ఎలా కట్టుకోవాలో నేర్పాలనుకుంది. అందుకే నికేత తనవంతుగా వివిధ రకాల చీరకట్లు కట్టుకొని తన అపార్ట్‌మెంట్‌లో, ఆఫీస్‌లో తిరుగుతుండేది. ఆమెను మొదట చూసి నవ్వుకున్నారు. ఆ తర్వాత వాళ్లు కూడా నేర్పించమని కోరేవాళ్లు. ఒకసారి అపార్ట్‌మెంట్‌లో వినాయకచవితికి ఈ చీరకట్లతో ర్యాంప్ వాక్ చేయించాలని అనుకున్నారు అపార్ట్‌మెంట్‌లోని ఆడవాళ్లు. అలా ఆమె చీరకట్టు ఫేమస్ అయింది. దీన్నే కెరీర్‌గా మలుచుకుంటే ఎలా ఉంటుందని అనుకుంది.

వర్కషాప్‌లు మొదలు

నికేత ఒక ఎన్జీవోలో పనిచేసేది. ఆ పని నిమిత్తం ఒకసారి గోవా వెళ్లాల్సి వచ్చింది. పైగా ఆమె చదివింది ఆంత్రపాలజీ. మానవజీవన మనుగడ, వారి జీవనవిధానం, సంస్కృతి మీద అవగాహన ఉంది. దీంట్లో ఈ చీరకట్టును కూడా చేర్చి దీని గొప్పదనం ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు బెంగళూరుకి చెందిన ఒకావిడ ఈమె చేసే పనికి మరింత ఊతం ఇవ్వాలనుకుంది. బెంగళూరులో వర్క్‌షాప్ నిర్వహించమని కోరింది. అలా మొదలైన వర్క్‌షాప్‌లు, యూఎస్, చికాగోదాకా వెళ్లాయి. రెండు సంవత్సరాల క్రితం మొదలైన ఈమె ప్రయాణంలో ఆరు వర్క్‌షాప్‌లు, మూడు సెమినార్లుగా గడుస్తుంది. ఇందులో ఒకసారి గోవాలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌కి మగవాళ్లు కూడా అటెండయ్యారు. వారు చీరకట్టుకోవడం మీద చాలా ఆసక్తి చూపించారు. కేవలం ఆడవాళ్లే చీరకట్టుతో మెరిసిపోవాలా? మా డ్రెస్‌ల్లో వారు కనిపిస్తున్నప్పుడు.. ఇక నుంచి నెలలో కనీసం ఒకరోజైనా మేమూ చీరకట్టుతో మెరిసిపోతామని ప్రతిజ్ఞ చేశారు.

హ్యాండ్‌లూమ్స్ మాత్రమే..

నేను పంజాబీ. కాబట్టి బొద్దుగా ఉండేదాణ్ని. ఈ చీరకట్టు కోసం చాలా కష్టపడి బరువు తగ్గాను. చీరకట్టును మరింత ప్రాచుర్యంలోకి తేవడానికి 100 డేస్ శారీ ప్రాజెక్ట్ చేపట్టాను. దీంట్లో ఒక్కో చీరకట్టుతో ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాను. ఇది ఒక రకంగా డాక్యుమెంటరీలాంటిదని చెప్పొచ్చు. మామూలు చీరలు కడితే అది జారిపోతుందేమోనన్నా భయం ఉంటుంది. అందుకే హ్యాండ్‌లూమ్ ఎంచుకున్నా. పైగా ఈ చీరల వల్ల నేతన్నలకు కూడా ఎంతోకొంత సహాయం చేయొచ్చు. అందుకే నేను చేసే వర్క్‌షాప్‌ల్లో కూడా కచ్చితంగా నేత చీరలనే ఉపయోగిస్తా. ఇప్పుడు 6యార్డ్స్‌తో కలిసి ఈ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నా. నేను ఇప్పటిదాకా 200ల మంది దాకా చీరకట్లు నేర్పి ఉంటాను. ఒక్కో సెషన్‌కి ఐదు నుంచి పదిమందిని మాత్రమే చేర్చుకుంటా. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే వారికి నేర్పించడం సాధ్యం కాదు. ఇకముందు మరిన్ని దేశాల్లో తిరిగి చీర ప్రాముఖ్యాన్ని వివరించాలి. భావితరాలకి కూడా చీరకట్టులోని అందాన్ని తెలియచేయాలి అని కోరుకుంటున్నది నికేత.

జ్ఞానదబందినీ.. రవీంద్రనాథ్ టాగూర్‌కు మరదలు వరుస అవుతుంది. ఆమె చీరకట్టు గురించి పెద్ద రీసెర్చ్ చేసింది. దాంట్లో భాగంగా సౌరాష్ట్ర వెళ్లి పార్సీల కట్టు గురించి తెలుసుకుంది. దీనికి కారణం.. అప్పటికీ మన దగ్గర పెట్టికోట్ వేసుకోవడం, జాకెట్లు తొడుగడమనే ఆనవాయితీ లేదు. దీనివల్ల ఒళ్లంతా కనిపిస్తుందని ఆమె రీసెర్చ్ మొదలుపెట్టింది. ఆమె అక్కడికి వెళ్లి వాళ్లు పాయింట్‌ల మీద చీరలు కట్టుకోవడం గమనించింది. దాన్ని కాస్త మార్చి సారీ పెట్టికోట్‌ని డిజైన్‌చేసింది. అక్కడే చీర కట్టు అందులోన నివీ డ్రేప్ విధానాన్ని నేర్చుకుంది. కోల్‌కతాలో ఒక చీరకట్టుకు సంబంధించిన స్కూల్‌ని కూడా స్థాపించింది. వంద సంవత్సరాల కాలంగా 140 చీరకట్ల గురించి డాక్యుమెంట్ చేసి ఉన్నాయి. 2500 సంవత్సరాల నుంచి మహిళలు చీర కడుతున్నట్లు ఆధారాలున్నాయి. అంటే.. ఎన్నిరకాల చీర కట్లు కనుమరుగయ్యాయో చెప్పుకోవచ్చు.

-సౌమ్య నాగపురి
రమా కల్యాణి

679
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles