నాకేమైంది?


Fri,April 7, 2017 01:34 AM

నా వయసు 42 సంవత్సరాలు. మూడు నెలలుగా మలద్వారం చుట్టూ విపరీతమైన నొప్పి వస్తున్నది. కుర్చీ మీద కూర్చోలేక పోతున్నాను. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తున్నది. నా సమస్యకు పరిష్కారం చూపగలరు?
ఈశ్వర్‌రావు, ఆదిలాబాద్
Getty
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే దీర్ఘకాలంగా మీరు మలబద్దకంతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా మీకు ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. దీన్ని ఫిస్టూలా అంటారు. ఇందులో ముందుగా మలద్వారం పరిసరాల్లో చిన్న బుడిపె వంటిది ఏర్పడుతుంది. ఈ బుడిపె మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం నుంచి తరచుగా చీము, రక్తం వస్తుంటాయి. ఈ బొడిపేనే ఫిస్టూలా అంటారు. ఒక్కోసారి ఫిస్టూలాలోని రంధ్రం మూసుకుని పోయి చీము రక్తం అందులోనే నిలువ ఉండిపోయి నొప్పి చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో జ్వరం కూడా రావచ్చు.
ఇది మందులతో నయమయ్యే సమస్య కాదు. దీనిని తొలగించడానికి సర్జరీ అవసరమవుతుంది. అంతేకాదు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. మలబద్దకం రాకుండా చూసుకోవాలి. అందుకోసం ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. శుభ్రమైన లోదుస్తులు ధరించాలి. డ్రైవింగ్ వంటి వృత్తిలో ఉన్నవారు మలద్వారానికి గాలి తగిలేలా ఉండే సీట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి.
డాక్టర్ ఎం. ఎ. సలీం
సీనియర్
కన్సల్టెంట్ జనరల్ సర్జరీ
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

546
Tags

More News

VIRAL NEWS